సాఫ్ట్వేర్ ఇంజనీర్లలో ఎందుకు ఇలాంటి ఆకస్మిక మరణాలు!
తినే ఆహారం వల్లనో లేక పని భారం వల్లనో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో గుండెపోటు ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.
By: Madhu Reddy | 20 Sept 2025 4:00 PM ISTతినే ఆహారం వల్లనో లేక పని భారం వల్లనో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో గుండెపోటు ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. చిన్న పిల్లల నుండి మొదలు ముసలి వాళ్ళ వరకు చాలామందిలో ఈ గుండెపోటు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. అయితే హెల్త్ కు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. చాలా మంది గుండెపోటుకు గురవుతున్నారు.దాంతో ప్రతి ఒక్కరిలో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా అమెరికాలో యువ టెక్నీషియన్ల గుండెపోటు మరణాలు.. చాలామంది డాక్టర్లలో అనుమానాలకు దారి తీసింది. ఇండియాకి చెందిన కొంతమంది టెక్నీషియన్లు అమెరికాలో వర్క్ చేస్తున్నారు. అయితే కొన్ని నెలల నుండి అమెరికాలో గుండెపోటు మరణాలు ఎక్కువ అవ్వడంతో అనేక ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
విషయంలోకి వెళ్తే.. అమెరికాలో రీసెంట్ గా అనగా సెప్టెంబర్ 3న 37 ఏళ్ల సాయి కృష్ణ రామచందర్ రాజి అల్లూరి అమెరికాలోని వర్జినియాలో సాయంత్రం వాకింగ్ కి వెళ్లి అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు.
అయితే ఈయన ఇండియాకి చెందినవాడే.. ఆంధ్రప్రదేశ్ కి చెందిన సాయి కృష్ణ రామచందర్ ఇండియానా వెస్లియన్ విశ్వ విద్యాలయం నుండి పట్టభద్రుడు అయ్యారు. అయితే ఈయన సాయంత్రం పూట వాకింగ్ కి వెళ్లి రూమ్ కి తిరిగి రాకపోవడంతో రూమ్మేట్స్ ఆందోళన చెంది.. వెంటనే 911 కి ఫోన్ చేయగా సాయి కృష్ణ రామచందర్ హార్ట్ ఎటాక్ తో మరణించాడని పోలీసులు సమాచారం ఇచ్చారు.
మరోవైపు మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి లగ్జరీ లైఫ్ గడపాలి అనే ఉద్దేశంతో వర్క్ చేయడం కోసమని ఓ విద్యార్థి అమెరికాకు వెళ్ళాడు. ఈయన కూడా గుండెపోటుతో మరణించారు.
ఆగస్టులో 35 ఏళ్ల ప్రతీక్ పాండే మైక్రోసాఫ్ట్ ఇంజనీర్ గా అమెరికాలో వర్క్ చేస్తున్నారు.ఆయన కూడా అకస్మాత్తుగా మరణించారు. అయితే ప్రతీక్ పాండే మరణానికి కారణం ఏంటి అని వాళ్ల మామ తెలుసుకోగా.. గుండెపోటు వచ్చినట్టు వైద్యులు ప్రాథమిక నివేదిక అందించారు. అయితే ఇండోర్ లో పుట్టి పెరిగిన ప్రతీక్ పాండే దాదాపు 10 సంవత్సరాల క్రితం శ్యాన్ జోస్ స్టేట్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేయడం కోసం అమెరికా వెళ్ళాడు. అలా జూలై 2020లో మైక్రోసాఫ్ట్ కంపెనీలో చేరాడు.
మరో బాధాకరమైన సంఘటన ఏంటంటే... కోనసీమ జిల్లాకు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెరికాలో మే 17న హార్ట్ ఎటాక్ తో మరణించాడు. జూన్ 15న తన పెళ్లి కోసం ఇండియాకి రావాల్సి ఉండగా పెళ్లికి ఒక నెల ముందుగానే ఈయన గుండెపోటుతో మరణించడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
వాషింగ్టన్ డీసీలో టెక్నీషియన్ గా పనిచేసే 28 ఏళ్ల మహమ్మద్ తురబ్ అలీ కూడా అకస్మాత్తుగా మరణించాడు. అయితే యువ విద్యార్థులు, టెక్నీషియన్లు చాలామంది అకస్మాత్తుగా మరణించడంతో వీరి మరణాలను చూసిన డాక్టర్లలో కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
సాఫ్ట్వేర్ ఇంజనీర్లలో ఎందుకు ఇలాంటి ఆకస్మిక మరణాలు సంభవిస్తున్నాయి అని వారు పరిశోధించగా..సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కువ ఒత్తిడి అలాగే రాత్రి వేళలో ఎక్కువసేపు పనిచేయడం వల్ల,నిద్ర లేక స్ట్రెస్ తో గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయట. ఇలా సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేసే ఉద్యోగుల మరణాలు చాప కింద నీరులా పాకడంతో ఎంతోమంది డాక్టర్లు ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలని,పని గురించి ఒత్తిడి తీసుకోకూడదని, మంచి ఆహారాన్ని తీసుకోవాలని చెబుతున్నారు.
అంతేకాదు ఎక్కువసేపు పని చేయడం, టైం టూ టైం ఫుడ్ తీసుకోకపోవడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలియజేస్తున్నారు. ఈ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లలోనే ఎక్కువ గుండెపోటు మరణాలు సంభవించడానికి కారణం.. పనిలో ఒత్తిడి అలాగే కఠినమైన ప్రాజెక్టులు ఇచ్చి చాలా తక్కువ సమయంలో వాటిని కంప్లీట్ చేయాలని కంపెనీ వాళ్ళు చెప్పడంతో హెల్త్ అప్సెట్ అయ్యి ఆకస్మిక గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయని డాక్టర్లు తెలియజేస్తున్నారు.
