Begin typing your search above and press return to search.

చిన్నారుల మరణాలకు ఇదే కారణం.. పరిశోధనలో సంచలన విషయాలు..

దేశ భవిష్యత్ చిన్నారుల చేతుల్లో ఉంది. నేటి బాలలే రేపటి పౌరులు.. ఇవి చెప్పుకునేందుకు అక్కరకు వస్తున్నట్లు అనిపిస్తుంది.

By:  Tupaki Political Desk   |   2 Oct 2025 6:00 PM IST
చిన్నారుల మరణాలకు ఇదే కారణం.. పరిశోధనలో సంచలన విషయాలు..
X

దేశ భవిష్యత్ చిన్నారుల చేతుల్లో ఉంది. నేటి బాలలే రేపటి పౌరులు.. ఇవి చెప్పుకునేందుకు అక్కరకు వస్తున్నట్లు అనిపిస్తుంది. చిన్నారుల జీవితాలను మొగ్గలోనే చిదిమేస్తున్నారు. సరైన నాణ్యతా పరీక్షలు పూర్తి చేయకుండా బయటకు వదలిన ఔషధాలతో చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. దీనిపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది.

కలకలం రేపుతున్న చిన్నారుల మరణాలు..

దేశవ్యాప్తంగా చిన్నారుల మరణాలు కలకలం రేపుతున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఒకే తరహా దగ్గు సిరప్‌ వాడిన పిల్లల్లో అనారోగ్య ఘటనలు చోటుచేసుకోవడం.. మరణాలు సంభవించడం ఆందోళనకర పరిణామం. మారుతున్న సాంకేతికత, ఆరోగ్యరంగంపై నమ్మకాన్ని మరింత పెంచుతుంది. ఈ సమయంలో ఇటువంటి ఘటనలు వెలుగులోకి రావడంపై పెద్ద ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి.

ఆరుగురు చిన్నారులు అసువులు బాసారు..

మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా జిల్లాలో ఈ ఏడాది (2025) ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ వరకు ఆరుగురు చిన్నారులు కిడ్నీ ఇన్ ఫెక్షన్ కు గురై మృతి చెందారు. చనిపోయిన పిల్లల్లో జ్వరం, మూత్ర సమస్యలు ప్రధాన లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అయితే ఇది దగ్గు సిరప్ తాగిన వారిలోనే కలిగినట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమై ‘కోల్డ్‌రిఫ్’, ‘నెక్స్‌ట్రో-డీఎస్’ సిరప్‌ల వినియోగాన్ని నిషేధించారు. ఇదే సమయంలో రాజస్థాన్‌లోనూ ఇలాంటి అనారోగ్య సమస్యలే బయటపడ్డాయి. సికర్ జిల్లాలో ప్రభుత్వ పథకం కింద సరఫరా చేసిన డెక్స్‌ట్రోమెథోర్ఫాన్ హైడ్రోబ్రోమైడ్ దగ్గు సిరప్ వాడిన తర్వాత ఐదేళ్ల బాలుడు మరణించడం, భరత్‌పూర్‌లో మూడేళ్ల బాలుడు అస్వస్థతకు గురికావడం, సంగనేర్‌లో రెండేళ్ల బాలిక తీవ్ర పరిస్థితిలో చికిత్స పొందడం తల్లిదండ్రులలో భయాందోళనలు రేపుతోంది.

ఫార్మా కంపెనీలకు నోటీసులు

ఈ ఘటనల అనంతరం రాజస్థాన్ మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఆర్ఎంఎస్‌సీఎల్) జైపూర్‌కు చెందిన కైసన్స్ ఫార్మా తయారు చేసిన బ్యాచ్ నంబర్లు కేఎల్-25/147, కేఎల్-25/148పై విచారణ ప్రారంభించింది. ఈ బ్యాచ్‌ల సరఫరా రాష్ట్ర వ్యాప్తంగా నిలిపివేశారు. ప్రాథమిక నివేదికల ప్రకారం ఈ సిరప్ పిల్లలకు సురక్షితం కాదని తేలింది. ముఖ్యంగా నాలుగేళ్లలోపు చిన్నారులే ఎక్కువగా దీనికి ప్రభావితం అవుతున్నారు. వైద్య నిపుణులు ఈ విషయంపై స్పష్టంగా హెచ్చరిస్తూ ఐదేళ్లలోపు పిల్లలకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏ సిరప్ ఇవ్వకూడదని తల్లిదండ్రులకు సూచించారు.

నమూనాలను పరిశీలిస్తు్న్న ఎన్‌సీడీసీ

మరోవైపు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ) మధ్యప్రదేశ్‌లో నమూనాలను సేకరించింది. రాజస్థాన్ డ్రగ్ కంట్రోలర్ అజయ్ పాటక్ వివరాల ప్రకారం.. ప్రభావిత బ్యాచ్‌ల నమూనాలను నాణ్యతా పరీక్షల కోసం పంపారు. 5 నుంచి 6 రోజుల్లో తుది నివేదిక రానుంది.

గతంలోనూ దగ్గు సిరప్ తోనే..

గతంలోనూ భారతీయ కంపెనీలు తయారు చేసిన దగ్గు సిరప్‌ల వల్ల గాంబియా, ఉజ్బెకిస్థాన్‌ దేశాలలో చిన్నారుల మరణాలు సంభవించాయి. అటువంటి చేదు అనుభవాల తర్వాత కూడా ఇలాంటి ఘటనలు మళ్లీ వెలుగులోకి రావడం ఆందోళనకరం. అందువల్ల ఇప్పుడు కేంద్రం అన్ని ఆరోగ్య పథకాల కింద సరఫరా చేసే మందులకు కఠినమైన ల్యాబ్‌ టెస్టులు తప్పనిసరి చేసింది. ఔషధ నాణ్యతా నియంత్రణ విధానాలను పునర్విమర్శించాలని కూడా ఆదేశించింది.

నాణ్యతా ప్రమాణాలపై అనుమానాలు..

చిన్నారుల మరణాలు దేశంలోని ఫార్మాస్యూటికల్ రంగంలో ఉన్న లోపాలను బహిర్గతం చేస్తున్నాయి. ప్రపంచానికి అతిపెద్ద ఔషధ ఉత్పత్తిదారుగా భారత్ నిలుస్తున్న తరుణంలో నాణ్యతా ప్రమాణాలపై ఇలాంటి అనుమానాలు రావడం మన ప్రతిష్టకు మచ్చతెస్తుంది. ఔషధ తయారీదారులపై కఠిన నియంత్రణలు, పారదర్శక పరీక్షలు, కఠిన చట్టపరమైన చర్యలు తప్పనిసరి.

నిరంతర పర్యవేక్షణ ఉండాలి..

ప్రతిసారి ఒక ఘటన జరిగిన తర్వాత హడావుడిగా చర్యలు తీసుకోవడం కాకుండా, నిరంతర నాణ్యతా ప్రమాణాలను అమలు చేయడం ప్రభుత్వాల కర్తవ్యం. చిన్నారుల భద్రతే ప్రథమ ప్రాధాన్యం కావాలి. ఈ విషాద సంఘటనలు మళ్లీ జరగకుండా ఆచరణలో మార్పులు తీసుకురావడం ఇప్పుడు అత్యవసరం.