Begin typing your search above and press return to search.

ఏంటీ విదేశీ భాషా సిండ్రోమ్.. ఈ అరుదైన వ్యాధిని అరికట్టడం ఎలా?

దీంతో ఈ వ్యాధి అతడికి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ సమస్య వచ్చినప్పుడు రోగులు అకస్మాత్తుగా తమ సొంత భాషను మార్చిపోయి ఇతర భాషను మాట్లాడడం మొదలు పెడతారట.

By:  Madhu Reddy   |   7 Jan 2026 5:00 AM IST
ఏంటీ విదేశీ భాషా సిండ్రోమ్.. ఈ అరుదైన వ్యాధిని అరికట్టడం ఎలా?
X

ఈ మధ్యకాలంలో కొత్త కొత్త అనారోగ్య సమస్యలు పుట్టుకొస్తూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ అరుదైన వ్యాధుల గురించి సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతి ఒక్కరికి తెలుస్తోంది. అంతేకాదు ఈ అరుదైన వ్యాధులను అరికట్టడం ఎలా? అనే విషయాలపై అటు వైద్యులు కూడా అవగాహన కార్యక్రమాలు చేపడుతూ భవిష్యత్తులో అలాంటి సమస్యలు రాకుండా.. ? ఒకవేళ వస్తే ఏం చేయాలి ? అనే విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు.

ఇదిలా ఉండగా నెదర్లాండ్ లో ఒక ఆశ్చర్యకరమైన కేసు నమోదయింది. ఒక టీనేజ్ బాలుడు సాధారణ మోకాలి శస్త్ర చికిత్స అనంతరం తన తల్లిదండ్రులను గుర్తించకపోవడమే కాకుండా తన సొంత భాషను కూడా మాట్లాడలేకపోయాడు. పైగా ఇతర భాష అయిన ఇంగ్లీష్ మాట్లాడుతూ అందరిని ఆశ్చర్యపరిచారు.. అయితే అతని పరిస్థితి గమనించిన హాస్పిటల్ బృందం కొంతకాలం తర్వాత అతనిలో మార్పు వస్తుందని భావించారు. కానీ అది జరగలేదు. ఈ కేసును వైద్యులు నమోదు చేసుకోగా.. ఇది విదేశీ భాషా సిండ్రోమ్ గా గుర్తించారు. ఇది చాలా అరుదైన పరిస్థితి.

సొంత భాషను మర్చిపోయి ఇతర భాషను మాట్లాడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిజానికి 17 సంవత్సరాల వయసున్న ఆ బాలుడు ఫుట్బాల్ ఆడుతుండగా గాయపడ్డాడట. దీంతో మోకాలి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. చికిత్స పూర్తయిన తర్వాత అనస్థీషియా నుండి మేల్కొని ఇంగ్లీష్ లో మాట్లాడడం ప్రారంభించారు. ముఖ్యంగా తాను అమెరికాలో ఉన్నానని పదేపదే చెబుతూ అందరినీ ఆశ్చర్యపరిచారు. వాస్తవానికి ఆ బాలుడు మాతృభాష డచ్. కానీ ఈ భాషను మాట్లాడలేకపోవడమే కాకుండా అర్థం చేసుకోలేకపోవడం మరింత ఆశ్చర్యాన్ని కలగజేసింది

దీంతో ఈ వ్యాధి అతడికి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ సమస్య వచ్చినప్పుడు రోగులు అకస్మాత్తుగా తమ సొంత భాషను మార్చిపోయి ఇతర భాషను మాట్లాడడం మొదలు పెడతారట. ఇక ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అసలు ఏంటి ఈ విదేశీ భాషా సిండ్రోమ్.. ? దీని లక్షణాలు ఏంటి? చికిత్స ఏంటి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

విదేశీ భాషా సిండ్రోమ్ అనేది మెదడుకి గాయం అవడం లేదా తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణంగా ఏర్పడే అరుదైన నాడీ సంబంధిత వ్యాధి. ఈ వ్యాధి వచ్చినప్పుడు కొంతమంది వ్యక్తులు తమ మాతృభాషను మరిచిపోయి, అనుకోకుండా విదేశీ యాసతో మాట్లాడడం మొదలు పెడతారు. ముఖ్యంగా వారికి ఆ యాస రానప్పటికీ.. విదేశీయుడిలా అనిపించేలా ఈ వ్యాధి మార్చేస్తుంది. దీనినే విదేశీ భాషా సిండ్రోమ్ అని అంటారు.

విదేశీ భాషా సిండ్రోమ్ రావడానికి కారణాలు:

మానసిక ఒత్తిడి అధికమైనప్పుడు ఈ సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి.. అలాగే మెదడుకి కణతి ఏర్పడడం లేదా తలకు గాయం అవడం , మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి సమస్యలు ఏర్పడినప్పుడు కూడా ఈ వ్యాధి వస్తుంది. మెదడులోని భాషా నియంత్రణ వ్యవస్థలో ఇబ్బంది ఏర్పడినప్పుడు కూడా ఈ సమస్య వస్తుందట.

విదేశీ భాషా సిండ్రోమ్ లక్షణాలు..

మాతృభాషను మర్చిపోవడం, లేదా మాతృభాషను విదేశీ యాసతో మాట్లాడడం, నాలుక , దవడ కదలికలలో మార్పు, పదాలను తప్పుగా ఉపయోగించడం, విదేశీ యాస వచ్చినా ఆ భాష మాట్లాడడం రాకపోవడం , ముఖ్యంగా మాతృభాష మాట్లాడడంలో ఇబ్బంది కలగడం లాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.

విదేశీ భాషా సిండ్రోమ్ చికిత్స..

ఈ సమస్యకు చికిత్స విషయానికి వస్తే.. స్పీచ్ థెరపీ వల్ల మాట్లాడే విధానాన్ని మెరుగుపరచవచ్చు. అలాగే మానసిక ఇబ్బందులను పరిష్కరించడానికి నిపుణులతో కౌన్సిలింగ్ ఇప్పించాలి. ముఖ్యంగా మెదడుకి గాయం లేదా ఇతర సమస్యలు ఉన్నప్పుడు వెంటనే వాటికి చికిత్స చేయించాలి. ఇకపోతే ఇది చాలా అరుదైన పరిస్థితి. కాబట్టి ఇంకా దీనిపై పరిశోధనలు కొనసాగుతున్నట్లు సమాచారం.