మానవ మెదడు రహస్యాలను డీకోడ్ చేసిన సంచలన పరిశోధన!
స్టాన్‌ఫర్డ్ మెడిసిన్ పరిశోధకులు మానవ మెదడు పరిణామానికి సంబంధించి ఒక అద్భుతమైన.. సరికొత్త విషయాన్ని వెల్లడించారు.
By: Sivaji Kontham | 10 Oct 2026 10:57 PM ISTస్టాన్‌ఫర్డ్ మెడిసిన్ పరిశోధకులు మానవ మెదడు పరిణామానికి సంబంధించి ఒక అద్భుతమైన.. సరికొత్త విషయాన్ని వెల్లడించారు. దశాబ్దాలుగా మానవ మెదడు ఒకే రకమైన ఏకరీతి కణాల నుంచి అభివృద్ధి చెందిందని శాస్త్రవేత్తలు భావిస్తూ వచ్చారు. అయితే ప్రఖ్యాత శాస్త్రవేత్త కైల్ లో నేతృత్వంలోని పరిశోధక బృందం పిండ దశ ప్రారంభంలోనే మెదడు కణాలు రెండు వేర్వేరు స్వతంత్ర మూలాల నుండి ఏర్పడతాయని కనుగొంది. నేచర్ న్యూరోసైన్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం.. మెదడు ఆవిర్భావం గురించిన సాంప్రదాయ ఆలోచనలను పూర్తిగా మార్చివేసింది.
ఈ పరిశోధన ప్రకారం.. ఒక సమూహం ముందు.. మధ్య మెదడును నిర్మించగా.. మరొక ప్రత్యేక సమూహం వెనుక మెదడును అభివృద్ధి చేస్తుంది. ఈ రెండు ప్రాంతాలు పిండ దశ ప్రారంభం నుంచే భిన్నమైన కణజాల మార్గాల ద్వారా అభివృద్ధి చెందుతాయి. అంటే మనం ప్రస్తుతం చూస్తున్న మానవ మెదడు ఒకే సమ్మేళనంగా కాకుండా.. పరిణామ క్రమంలో ఒకదానికొకటి దగ్గరగా వచ్చి విలీనమైన రెండు వేర్వేరు ప్రాచీన నాడీ వ్యవస్థల సమ్మేళనంగా ఏర్పడిందని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది.
ఈ విస్మయకరమైన పరిణామ క్రమం కేవలం మనుషులకే పరిమితం కాకుండా.. చేపలు, పక్షులు.. సుమారు 550 మిలియన్ సంవత్సరాల క్రితం నాటి సముద్ర జీవులలో కూడా కనిపిస్తుందని పరిశోధకులు నిరూపించారు. అంటే ఈ ద్వంద్వ మూలాల వ్యవస్థ చాలా ప్రాచీనమైనదని.. పరిణామ క్రమంలో కాలక్రమేణా ఈ రెండు వేర్వేరు నాడీ వ్యవస్థలు కలిసిపోయి నేడు ఒకే మెదడులా పనిచేస్తున్నాయని ఈ అధ్యయనం ద్వారా వెల్లడైంది.
శాస్త్రవేత్తలు ఇప్పటివరకు ల్యాబ్‌లో వెనుక మెదడు (బ్యాక్ బ్రెయిన్) కణాలను విజయవంతంగా సృష్టించలేకపోయారు. అయితే ఈ కొత్త ఆవిష్కరణతో వెనుక మెదడు కణాలు వేరే మార్గంలో అభివృద్ధి చెందుతాయని గుర్తించి.. మొట్టమొదటిసారిగా ల్యాబ్‌లో మానవ వెనుక మెదడు మోటార్ న్యూరాన్లను విజయవంతంగా పెంచగలిగారు. ఈ పురోగతి వైద్య రంగానికి ఒక మైలురాయిగా నిలిచింది.
ఈ పరిశోధన ద్వారా అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ (ఏఎల్ఎస్) , స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (ఎస్.ఎం.ఏ) వంటి తీవ్రమైన నరాల సంబంధిత వ్యాధులపై లోతుగా అధ్యయనం చేయడానికి కొత్త మార్గాలు ఏర్పడ్డాయి. భవిష్యత్తులో ఈ ప్రాణాంతక వ్యాధులకు సరికొత్త చికిత్సలను, పునరుత్పత్తి వైద్య విధానాలను కనుగొనేందుకు ఈ అధ్యయనం ఎంతగానో దోహదపడుతుందని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు
