Begin typing your search above and press return to search.

మెదడు సమస్యలకు నిద్రలేమి ఏ స్థాయిలో కారణమో తెలుసా?

అవును... ప్రస్తుత కాలంలో మనిషి ప్రశాంతంగా 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోలేకపోతున్నాడు! ప్రధానంగా నగరవాసులు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నారని అంటున్నారు.

By:  Raja Ch   |   6 Oct 2025 6:00 AM IST
మెదడు సమస్యలకు నిద్రలేమి ఏ స్థాయిలో కారణమో తెలుసా?
X

ప్రస్తుత కాలంలో చాలా వరకూ మారిపోయిన జీవనశైలి, ఆహరపు అలవాట్లు, ఉద్యోగ సమయాలు.. ఇలా పలు రకాల కారణాల వల్ల మనిషి జీవితంలో సరిగా నిద్రపోలేకపోతున్నారు. కనీసం రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోవాల్సిన వేళ.. కేవలం 4 నుంచి 5 గంటలు మాత్రమే నిద్రపోతున్న పరిస్థితి. ఆ 4 - 5 గంటల్లోనూ మధ్య మధ్యలో ఫోన్ కాల్స్ కూడా అంటెంఫ్ట్ చేయాల్సిన పరిస్థితి కొందరిది!

అవును... ప్రస్తుత కాలంలో మనిషి ప్రశాంతంగా 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోలేకపోతున్నాడు! ప్రధానంగా నగరవాసులు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నారని అంటున్నారు. ఈ సమయంలో... మెదడు వయసు పెరగడానికి నిద్రలేమితో సంబంధం ఉన్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. ఈ మేరకు యూకే బయోబ్యాంక్ ఈ కీలక విషయాలను తాజాగా వెల్లడించింది.

సుమారు 27,500 మంది మధ్య వయస్కులు, వృద్ధులను పరిశోధించిన బృందం.. అధునాతన అల్గారిథమ్‌ లను ఉపయోగించి, పరిశోధనలో పాల్గొనేవారి వాస్తవ వయస్సుతో పోలిస్తే నిద్రలేమి అనంతర వయస్సును అంచనా వేయడానికి 1,000 కంటే ఎక్కువ మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (ఎంఆర్ఐ) ఫినోటైప్‌ లను విశ్లేషించింది. తద్వారా నిద్ర ఆరోగ్య స్థితికి కారణమైన అసమానతలను ఆవిష్కరించింది.

ఈ పరిశోధనల ప్రకారం.. నిద్ర నాణ్యత స్థిరంగా లేకపోవడం వల్ల న్యూరోఇన్‌ ఫ్లమేటరీ క్యాస్కేడ్‌ లు ప్రేరేపించబడవచ్చు లేదా తీవ్రతరం కావచ్చని చెప్పిన శాస్త్రవేత్తలు... నాడీ కణజాలాలలో సెల్యులార్ వృద్ధాప్యాన్ని వేగవంతం చేయవచ్చని తెలిపారు. ఇటువంటి న్యూరోడిజనరేషన్ అల్జీమర్స్ వ్యాధి, ఇతర చిత్తవైకల్య వ్యాధులకు కారణం అవ్వొచ్చని తెలిపారు!!

ఈ సందర్భంగా... తమ పరిశోధనలు పేలవమైన నిద్ర మెదడు వృద్ధాప్యాన్ని వేగవంతం చేయడానికి దోహదపడుతుందని తేలిందని.. అందువల్ల రోజుకి కనీసం 7 - 8 గంటల పాటు నిద్రపోతే ఈ సమస్య నుంచి బయట పడొచ్చని.. ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన కరోలిన్స్కా ఇనిస్టిట్యూట్‌ లోని న్యూరోబయాలజీ, కేర్ సైన్సెస్, సొసైటీ విభాగంలో పరిశోధకురాలు అబిగైల్ డోవ్ వివరించారు.

ఇక.. ఈ అధ్యయనం స్వీడిష్ స్కూల్ ఆఫ్ స్పోర్ట్ అండ్ హెల్త్ సైన్సెస్, టియాంజిన్ మెడికల్ యూనివర్సిటీ, చైనాలోని సిచువాన్ యూనివర్సిటీతో పాటు పరిశోధకుల సహకారంతో నిర్వహించబడింది. దీనికి అల్జీమర్స్ ఫౌండేషన్, డిమెన్షియా ఫౌండేషన్, స్వీడిష్ రీసెర్చ్ కౌన్సిల్, లూ అండ్ హాన్స్ ఓస్టర్మాన్ ఫౌండేషన్ ఫర్ మెడికల్ రీసెర్చ్ & నాలెడ్జ్ ఫౌండేషన్ నిధులు సమకూర్చాయి!