పరుగుల జీవితంలో మానసిక కల్లోలం!
పరుగులు పెడుతున్న ఆధునిక జీవనశైలిలో మనిషి బాహ్య ప్రపంచంలో ఎంత అభివృద్ధి చెందుతున్నా? అంతర్గతంగా మాత్రం తీవ్రమైన మానసిక సంఘర్షణను ఎదుర్కొంటున్నాడు.
By: Srikanth Kontham | 15 Oct 2026 6:42 PM ISTపరుగులు పెడుతున్న ఆధునిక జీవనశైలిలో మనిషి బాహ్య ప్రపంచంలో ఎంత అభివృద్ధి చెందుతున్నా? అంతర్గతంగా మాత్రం తీవ్రమైన మానసిక సంఘర్షణను ఎదుర్కొంటున్నాడు. `ఓపెన్ మ్యాగజైన్` ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం ప్రస్తుతం సమాజంలో మానసిక ఆందోళన (72.1%), తీవ్రమైన ఒత్తిడి (67.5%), నిరాశ లేదా నిరుత్సాహం (58.3%) వంటి సమస్యలు సర్వసాధారణంగా మారి ప్రతి ఒక్కరి జీవితాన్ని కమ్మేస్తున్నాయి.
ఏ ఇంటికి వెళ్లినా? ఏ కార్యాలయాన్ని చూసినా? మానసిక సమస్యల బారిన పడిన బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండటం ఆందోళనకరం. ఈ సమస్యల తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే? కేవలం ఒక్క మానసిక ఆందోళనే కాకుండా సరైన నిద్రలేకపోవడం.. ఏ విషయాలపైనా ఏకాగ్రత సారించలేకపోవడం వంటి రుగ్మతలు ఒకేసారి మనిషిని చుట్టుముడుతున్నాయి. ఈ దీర్ఘకాలిక సమస్యల కారణంగా కేవలం 12.3% మంది మాత్రమే ప్రశాంతంగా తమ దైనందిన బాధ్యతలను నిర్వర్తించగలుగుతున్నారని వైద్యులు చెబుతున్నారు.
మిగిలిన వారందరూ ఏదో ఒక రకమైన మానసిక వేదనను అనుభవిస్తూ రోజువారీ పనులను పూర్తి చేయడానికి కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ మానసిక సమస్యలు కేవలం మనసును మాత్రమే కాకుండా మనిషిలోని సంతోషాన్ని, ప్రశాంతతను పూర్తిగా హరిస్తున్నాయి. ఏ పనైనా ఉత్సాహంగా చేద్దామన్నా చేతకాని నిస్సహాయ స్థితి, నిత్యం భవిష్యత్తు గురించిన భయాలు మనుషులను మానసికంగా కుంగదీస్తున్నాయి. దీంతో వ్యక్తిగత జీవితం, కుటుంబ సంబంధాలు , వృత్తిపరమైన బాధ్యతలు కూడా తీవ్రంగా దెబ్బతింటున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ రకమైన విపరీతమైన ఒత్తిడి నుంచి బయటపడేందుకు చాలామంది వ్యాయామం లేదా ధ్యానం వంటి ఆరోగ్యకరమైన మార్గాలను ఎంచుకుంటున్నారు. మరికొందరు మొబైల్ ఫోన్లు, స్క్రీన్ టైమ్ పెంచడం లేదా నిద్రపోవడానికి ప్రయత్నించడం వంటి పద్ధతులను ఆశ్రయిస్తున్నారు. అయితే ఇవి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయని..అసలు సమస్యను వేర్లతో సహా తొలగించలేవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మనం జీవిస్తున్న డిజిటల్ యుగంలో మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం ప్రాణాంతక పరిణామాలకు దారితీస్తుంది. శారీరక ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో? మానసిక ప్రశాంతతకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. నిపుణుల సలహాలు తీసుకోవడం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం , ఒత్తిడిని తట్టుకునే జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా మాత్రమే మానసిక సంక్షోభం నుంచి బయటపడగలం.
