పిల్లల్లో బీపీ రేటు రెట్టింపు... కారణాలు, పరిష్కారాలూ ఇవే!
ఈ సందర్భంగా తెరపైకి వచ్చిన ఘణాంకాలు షాకింగ్ గా ఉన్నాయి. దీనికి సంబంధించిన పరిశోధనల వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
By: Raja Ch | 14 Nov 2025 7:00 PM ISTమారుతున్న ఆహారపు అలవాట్లో, మారిన జీవన శైలి, వయసుతో సంబంధం లేకుండా పెరుగుతున్న ఒత్తిడి... కారణం ఏదైనా చిన్నారులు, టీనేజర్లలో అధిక రక్తపోటు బారిన పడుతున్న వారి సంఖ్య గత రెండు దశాబ్ధాలలో రెండింతలు అయ్యిందని ఓ అధ్యయనం పేర్కొంది. ఈ సందర్భంగా తెరపైకి వచ్చిన ఘణాంకాలు షాకింగ్ గా ఉన్నాయి. దీనికి సంబంధించిన పరిశోధనల వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
అవును... ది లాన్సెట్ చైల్డ్ & అడోలసెంట్ హెల్త్ జర్నల్ లో ప్రచురితమైన ఒక కొత్త అధ్యయనం ప్రకారం.. గత రెండు దశాబ్దాలలో 19 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారిలో రక్తపోటు రేటు దాదాపు రెట్టింపు అయింది. ఇందులో భాగంగా... ఈ రేటు 2000లో 3.2% గా ఉండగా... అది కాస్తా 2020లో 6.2%కి పెరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా 114 మిలియన్ల మంది పిల్లలను ప్రభావితం చేసిందని చెబుతున్నారు.
పరిశోధన ఏం చెబుతోంది..?:
అధిక రక్తపోటు అనేది పెద్దల వ్యాధిగా తొలుత పరిగణించేవారు. ఓ 50 ఏళ్లు దాటిన తర్వాత వచ్చే వ్యాధిగానే అప్పట్లో చూసేవారు! అయితే... తాజాగా వెలుగులోకి వచ్చిన విషయాలు అలా ఆలోచించడం ఇకపై సురక్షితం కాదని సూచిస్తున్నాయి. 21 దేశాలలో 4,43,000 కంటే ఎక్కువ మంది పిల్లలపై చేసిన 96 అధ్యయనాలతో కూడిన విశ్లేషణ కీలక విషయాలు వెల్లడిస్తోంది.
ఈ అధ్యయనంలో 8.2% మంది పిల్లలు ప్రీ-హైపర్ టెన్షన్ వర్గంలోకి వస్తారని.. టీనేజ్ ప్రారంభంలో రక్తపోటు స్థాయిలు బాగా పెరుగుతాయని.. ప్రధానంగా 14 సంవత్సరాల వయస్సులో గరిష్ట స్థాయికి చేరుకుంటాయని తేలిందని వెల్లడించింది.
కారణాలు!:
ఈ వయసులో అధిక రక్తపోటుకు ఒక కారణం ఊబకాయం, అధిక బరువు అని అంటున్నారు. ఆరోగ్యకరమైన బరువు ఉన్న పిల్లలలో 3% కంటే తక్కువ మందితో పోలిస్తే.. ఊబకాయం ఉన్న పిల్లలు, కౌమారదశలో ఉన్నవారిలో సుమారు 19% మందికి రక్తపోటు ఉన్నట్లు కనుగొనబడిందని అధ్యయనం వెల్లడించింది.
దీనితోపాటు ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోవడం.. అధిక ఉప్పు, అధిక చక్కెర స్నాక్స్ తీసుకోవడంతోపాటు శారీరక శ్రమ తగ్గడం అధిక రక్తపోటుకు విస్తృతంగా దోహదపడే అంశాలని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే... ప్రపంచవ్యాప్తంగా పిల్లలు తక్కువ శారీరక శ్రమ కలిగి ఉండటంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుదలకు దోహదపడుతుందని అధ్యయనం పేర్కొంది!
తక్షణ శ్రద్ధ అవసరం!:
వాస్తవానికి బాల్యంలో అధిక రక్తపోటు ప్రమాదకరం కానప్పటికీ... యువతలో రక్తపోటు పెరగడం వల్ల పెద్ద వయసులో హృదయ సంబంధ వ్యాధులు, స్ట్రోక్, మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదాన్ని పెంచుతుందని చెబుతున్నారు. ఉదాహరణకు.. ఏడేళ్ల వయసులో అధిక రక్తపోటు ఉన్న పిల్లలు మధ్య వయయసులో హృదయ సంబంధ మరణాల ప్రమాదాన్ని గణనీయంగా పెంచినట్లు చెబుతున్నారు!
అందువల్ల.... పిల్లలలో, ముఖ్యంగా ఊబకాయం, కుటుంబ చరిత్ర వంటి అధిక ప్రమాదం ఉన్నవారిలో క్రమం తప్పకుండా బీపీ తనిఖీలు చేయడం మంచిదని చెబుతున్నారు. ఇదే సమయంలో... ఉప్పు తక్కువగా తీసుకోవడం, ప్రాసెస్ చేసిన ఆహారం తక్కువగా తినడంతోపాటు పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం చేయాలని సూచిస్తున్నారు. అదేవిధంగా... శారీరక శ్రమ పెంచడం, కూర్చునే సమయాన్ని తగ్గించడం చాలా అవసరం అని చెబుతున్నారు.
