బరువు తగ్గించే సూపర్ మెడిసిన్.. కానీ హెల్త్‌పై భారీ ప్రభావం ఉందా?
ఈ రోజుల్లో బరువు తగ్గడం అనేది ఒక పెద్ద సవాలుగా మారింది. వ్యాయామం చేసే ఓపిక, డైటింగ్ చేసే టైం లేక చాలామంది షార్ట్ కట్స్ వెతుక్కుంటున్నారు.
By: Madhu Reddy | 5 April 2026 7:00 PM ISTఈ రోజుల్లో బరువు తగ్గడం అనేది ఒక పెద్ద సవాలుగా మారింది. వ్యాయామం చేసే ఓపిక, డైటింగ్ చేసే టైం లేక చాలామంది షార్ట్ కట్స్ వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలోనే 'మౌంజారో' వంటి ఇంజెక్షన్లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. మూడు నెలల్లో 10 కిలోల బరువు తగ్గొచ్చన్న ప్రచారంతో యువత, ముఖ్యంగా పెళ్లికి సిద్ధమయ్యే వధువులు వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, అందం కోసం పడుతున్న ఈ ఆరాటం ప్రాణాల మీదకు తెస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ..
షార్ట్ కట్ వెయిట్ లాస్.. అసలు నిజం ఏంటి?:
మౌంజారో ఇంజెక్షన్ అనేది నిజానికి టైప్-2 డయాబెటిస్ ఉన్న రోగుల కోసం తయారు చేసిన మందు. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడానికి వాడతారు. అయితే, ఇది ఆకలిని తగ్గించి బరువు తగ్గడానికి కూడా తోడ్పడుతుందని తెలియడంతో, ఇప్పుడు బరువు తగ్గాలనుకునే వారు దీనిని ఒక మ్యాజిక్ డ్రగ్‌లా వాడుతున్నారు. ఇక కేవలం ఫ్యాన్సీ దుస్తుల్లో సన్నగా కనిపించాలని, ఫోటోలకు స్లిమ్‌గా ఫోజులివ్వాలని డాక్టర్ల సలహా లేకుండానే వీటిని తీసుకుంటున్నారు. కానీ ఇది మ్యాజిక్ కాదు, శరీర సహజ ప్రక్రియలను మార్చే ఒక మెడికల్ డ్రగ్ అని గుర్తించాలి.
ప్రాణాల మీదకు తెస్తున్న వెడ్డింగ్ ప్యాకేజీలు:
ప్రస్తుతం కొన్ని క్లినిక్‌లు లాభాల కోసం 'వెడ్డింగ్ వెయిట్ లాస్ ప్యాకేజీల' పేరుతో ఈ ఇంజెక్షన్లను విచ్చలవిడిగా ప్రోత్సహిస్తున్నాయి. పెళ్లికి నెల రోజుల ముందు జిమ్‌కు వెళ్లే టైం లేని వారికి ఇదొక వరమని నమ్మిస్తున్నారు. ముంబైలో ఒక యువతి ఇలాగే ఇంజెక్షన్ తీసుకుని 10 కిలోలు తగ్గింది కానీ, ఆ తర్వాత తీవ్రమైన హార్మోన్ల అసమతుల్యత, విపరీతమైన నీరసంతో తన పెళ్లి ఆనందాన్ని కూడా కోల్పోయింది. డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా ఇలాంటి షార్ట్ కట్స్ తీసుకోవడం వల్ల శరీరం లోపల పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది.
ఆకర్షణీయమైన ప్రకటనలు.. చేదు నిజాలు:
యూట్యూబర్లు తమ అనుభవాలను చెబుతూ ఈ ఇంజెక్షన్ల వల్ల అద్భుతాలు జరుగుతాయని ప్రచారం చేస్తున్నారు. అయితే, వారు కేవలం బరువు తగ్గడం గురించే చెబుతారు కానీ, ఆ తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి దాటవేస్తారు. ఇక ఈ మందులు ఆకలిని చంపేయడం వల్ల శరీరానికి అందాల్సిన పోషకాలు అందవు. ఫలితంగా జుట్టు రాలడం, చర్మం వాడిపోవడం, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇన్స్టంట్‌గా బరువు తగ్గడం అనేది చూడటానికి బాగున్నా, అది ఆరోగ్యానికి ఒక పెద్ద డిజాస్టర్ అని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
శాశ్వత మార్పు కావాలంటే సహజ మార్గమే మేలు:
బరువు తగ్గడం అనేది ఒక క్రమశిక్షణతో కూడిన ప్రక్రియ. ఇంజెక్షన్లతో పది కిలోలు తగ్గడం అనేది తాత్కాలికమే. ఆ మందు వాడటం ఆపేయగానే మళ్లీ బరువు పెరగడమే కాకుండా, మెటబాలిజం కూడా దెబ్బతింటుంది. నిజంగా ఫిట్‌గా ఉండాలనుకుంటే పోషకాహారం, సరైన వ్యాయామం మాత్రమే సరైన మార్గాలు. కేవలం ఒక రోజు పెళ్లి వేడుకలో బాగుండాలని జీవితకాలం అనారోగ్యంతో బాధపడటం అవివేకం. వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఇలాంటి మందులు వాడటం అంటే మన చేతులతో మనమే ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమే.
అందం కంటే ఆరోగ్యమే ముఖ్యం. ఇన్స్టంట్ బరువు కోసం షార్ట్ కట్స్ వెతికితే అవి షార్ట్ సర్క్యూట్‌లా మన జీవితాన్నే ఇబ్బందుల్లో పడేస్తాయి. కాబట్టి ప్రచారాలను నమ్మి మోసపోకుండా, సహజ పద్ధతుల్లో బరువు తగ్గడానికే ప్రాధాన్యత ఇవ్వండి. పది కిలోల వెయిట్ లాస్ కంటే, పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండటమే కదా అసలైన సక్సెస్!
