Begin typing your search above and press return to search.

మానవ సంబంధాలు ముఖ్యం.. ఒంటరితనంపై అలర్ట్!

నలుగురిలో నవ్వే క్షణాలు తగ్గినా, ఒంటరిగా గడిపే గంటలు పెరిగినా అది మనసుకే కాకుండా శరీరానికి కూడా తీవ్ర ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

By:  Madhu Reddy   |   3 Sept 2026 6:00 PM IST
మానవ సంబంధాలు ముఖ్యం.. ఒంటరితనంపై అలర్ట్!
X

నలుగురిలో నవ్వే క్షణాలు తగ్గినా, ఒంటరిగా గడిపే గంటలు పెరిగినా అది మనసుకే కాకుండా శరీరానికి కూడా తీవ్ర ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ కాలం ఒంటరిగా జీవించడం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి తీవ్రమైన నరాల సంబంధిత వ్యాధులు వస్తాయని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇష్టం లేని ఒంటరితనం మెదడు, రోగనిరోధక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నందున, మానవ సంబంధాల ప్రాముఖ్యతను తెలుసుకోవడం ఇప్పుడు చాలా అవసరం. ఆ వివరాలు చూద్దాం..

మెదడు, జ్ఞాపకశక్తిపై పడే ప్రతికూల ప్రభావం:

సుదీర్ఘకాలం పాటు సామాజిక సంబంధాలకు దూరంగా ఉండటం వల్ల ఆలోచనా సామర్థ్యం, నిర్ణయాలు తీసుకునే శక్తి క్రమంగా తగ్గుతాయి. రోజువారీ సంభాషణలు లేకపోతే మెదడుకు అందాల్సిన ఉత్తేజం తగ్గిపోతుంది. అంతేకాకుండా ఒంటరితనం వల్ల శరీరంలో 'కార్టిసోల్' అనే ఒత్తిడి హార్మోన్ పెరిగిపోతుంది. ఇక దీనివల్ల నిద్రలేమి, ఏకాగ్రత లోపించడం, జ్ఞాపకశక్తి మందగించడం వంటి సమస్యలు మొదలవుతాయి.

డిమెన్షియా ప్రమాదం, శారీరక నొప్పి:

ఇటీవలి అధ్యయనాలు ఒంటరితనాన్ని డిమెన్షియా వ్యాధికి ఒక ప్రధాన కారణమని చెబుతున్నాయి. మనం ఒంటరిగా ఉన్నప్పుడు మెదడులో కలిగే భావోద్వేగ బాధ, మనకు శారీరకంగా దెబ్బతగిలినప్పుడు వచ్చే నొప్పితో సమానంగా ఉంటుందని బ్రెయిన్ స్కాన్ పరీక్షల్లో తేలింది. ఇక స్ట్రోక్, పార్కిన్సన్స్ వంటి వ్యాధులతో బాధపడేవారికి ఒంటరితనం తోడైతే వారి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉంటుంది.

ధూమపానంతో సమానమైన డేంజర్:

సుమారు 30 లక్షల మందిపై జరిపిన విశ్లేషణ ప్రకారం, దీర్ఘకాలిక ఒంటరితనం వల్ల అకాల మరణ ముప్పు ఏకంగా 26 శాతం పెరుగుతుంది. ఆరోగ్య పరంగా చూస్తే ఇది ఊబకాయం, సిగరెట్లు తాగడం వల్ల కలిగే హానితో సమానమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఒంటరిగా ఉండేవారు అనారోగ్యకరమైన ఆహారం, మద్యం లేదా ఇతర వ్యసనాల వైపు త్వరగా ఆకర్షితులయ్యే అవకాశం కూడా ఉంటుంది.

బంధాలు పెంచుకోవడమే అసలైన పరిష్కారం:

ఈ సమస్యకు ముగింపు పలకాలంటే మన జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. సోషల్ మీడియా వాడకాన్ని తగ్గించి, నేరుగా మనుషులతో స్నేహాలను ప్రోత్సహించాలి. వందల మంది పరిచయస్థులు ఉండక్కర్లేదు, మనకంటూ కష్టసుఖాలు పంచుకునే కొద్దిమంది నమ్మకమైన వ్యక్తులు ఉన్నా చాలు. ఇక కొత్త విషయాలు నేర్చుకోవడం, వ్యాయామం చేయడం, కుటుంబ సభ్యులతో సమయం గడపడం ద్వారా మెదడును ఎప్పుడూ చురుగ్గా ఉంచుకోవచ్చు.

ఒంటరితనం అనేది కేవలం ఒక భావోద్వేగ సమస్య మాత్రమే కాదు, అది మన ఆయుష్షును తగ్గించే ఒక నిశ్శబ్ద శత్రువు. మన చుట్టూ ఉన్నవారితో బంధాలను బలపరచుకోవడం, కష్టసుఖాలు పంచుకోవడం ద్వారానే మనస్సును, మెదడును ఆరోగ్యంగా ఉంచుకోగలము. ఇక ఇప్పటికైనా డిజిటల్ లోకంలోంచి బయటకు వచ్చి, నిజమైన మానవ సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వడమే ఆరోగ్యకరమైన జీవితానికి పునాది.