Begin typing your search above and press return to search.

రొమ్ము క్యాన్సర్.. షాకిచ్చే లైఫ్ స్టైల్

మహిళల్ని వేధించే రొమ్ము క్యాన్సర్ కేసులు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. జీవనశైలిలో వచ్చే మార్పులకు కేరాఫ్ అడ్రస్ గా రొమ్ము క్యాన్సర్ ను చెప్పొచ్చు.

By:  Garuda Media   |   14 Oct 2025 11:00 AM IST
రొమ్ము క్యాన్సర్.. షాకిచ్చే లైఫ్ స్టైల్
X

మహిళల్ని వేధించే రొమ్ము క్యాన్సర్ కేసులు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. జీవనశైలిలో వచ్చే మార్పులకు కేరాఫ్ అడ్రస్ గా రొమ్ము క్యాన్సర్ ను చెప్పొచ్చు. సామాన్యులతో పోలిస్తే సంపన్న మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. నాణ్యమైన ఆహారాన్ని తీసుకుంటారన్న అపోహతో ఉంటారే తప్పించి.. తాము తినే ఫాస్ట్ ఫుడ్.. అతిగా శుద్ధి చేసిన ఆహారం తమ ప్రాణాల మీదకు తెస్తుందన్న విషయాన్ని చాలామంది గుర్తించారు.

సహజ సిద్ధ ఆహారం కంటే ప్రాసెస్ చేసిన ఫుడ్ ను ఎక్కువగా వినియోగించే మహిళలు రొమ్ము క్యాన్సర్ బారిన పడుతుంటారు. దీంతో పాటు వారిని ఊబకాయం కూడా వేధిస్తూ ఉంటుంది. ఏడాదికేడాదికి పెరుగుతున్న రొమ్ము క్యాన్సర్ కేసులకు సంబంధించి తాజాగా వెలువడిన రిపోర్టును చూస్తే.. దేశంలో ఎంత భారీగా ఈ కేసులు పెరుగుతున్నాయన్న విషయం అర్థమవుతుంది.

2019లో దేశ వ్యాప్తంగా 2 లక్షల బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు వెలుగు చూస్తే.. రెండేళ్ల స్వల్ప వ్యవధిలో అంటే 2022లో ఈ రొమ్ము క్యాన్సర్ కేసుల సంఖ్య 2.16 లక్షలకు చేరగా.. తర్వాతి ఏడాది అంటే 2023లో ఈ కేసుల సంఖ్య 2.21 లక్షలుగా తేలాయి. దేశంలో అత్యధిక రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదయ్యే రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నిలిస్తే.. తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర 19,530.. పశ్చిమ బెంగాల్ మూడో స్థానంలో (17,399 కేసులతో) నిలిచింది.

రొమ్ము క్యాన్సర్ కేసుల్లో రెండు తెలుగు రాష్ట్రాలు కాస్త వెనుకనే ఉన్నాయని చెప్పాలి. అలా అని ముప్పు లేదని చెప్పలేని పరిస్థితి. మరి ముఖ్యంగా తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో రొమ్ము క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదు కావటం గమనార్హం. ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. దేశంలోని ప్రధాన మెట్రో నగరమైన ఢిల్లీ రాష్ట్రంలో రొమ్ము క్యాన్సర్ కేసులు తక్కువగా నమోదు కావటం. దేశంలో టాప్ టెన్ రాష్ట్రాల్లో ఏపీ తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఏటా ఈ రాష్ట్రంలో 11,921 కేసులు నమోదు అవుతుంటే.. తెలంగాణలో మాత్రం 8,066 కేసులు నమోదు అవుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో అతి తక్కువగా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో కేరళ.. తెలంగాణ రాష్ట్రాలు నిలవటం గమనార్హం. ఈ విషయంలో ఏపీ పరిస్థితి ఆందోళన కలిగించేలా ఉందని చెప్పక తప్పదు.