చర్మ కణాలతో అండాలు, వీర్యం.. శాస్త్రవేత్తల ముందగుడు..
మారుతున్న జీవనవిధానం పునరుత్పత్తి శక్తిని పూర్తిగా నాశనం చేస్తోంది. మనిషి రోజు వారి పనులు ఒత్తిడిని పెంచి సంతానక్రియకు అడ్డం పడుతోంది.
By: Tupaki Political Desk | 1 Oct 2025 1:00 PM ISTమారుతున్న జీవనవిధానం పునరుత్పత్తి శక్తిని పూర్తిగా నాశనం చేస్తోంది. మనిషి రోజు వారి పనులు ఒత్తిడిని పెంచి సంతానక్రియకు అడ్డం పడుతోంది. దీంతో చాలా పరిణామాలు చోటు చేసుకుంటాయి. అటు వ్యక్తి గత నష్టంతో పాటు ఇటు దేశ పరిస్థితులు కూడా చాలా దెబ్బతింటుంది. యంగ్ జనరేషన్ అనేది ఉండదు. మానవ జీవితంలో సంతానోత్పత్తి అనేది అత్యంత సహజమైన ప్రక్రియ. సంతానలేమితో బాధపడే దంపతులు సొంత జన్యువులతో కూడిన సంతానం కావాలనే ఆతృత వారికి ఉండడం సహజమే. ఈ నేపథ్యంలో అమెరికా శాస్త్రవేత్తలు చేపట్టిన ప్రయోగం వారిలో ఆశలు నింపుతోంది. చర్మకణాల సాయంతో అండాలను రూపొందించడంపై పరిశోధనలు చేశారు.. అయితే అందులో కొంత ముందడుగు వేశారు.
ప్రయోగం విజయవంతం..
అయితే, ఈ ప్రయోగం విజయవంతమైందా? అన్న ప్రశ్నకు సమాధానం ‘అవును’ అని చెప్పలేం. ఎందుకంటే ల్యాబ్‌లో రూపొందించిన అండాలు తొలిదశలో విజయవంతంగా కనిపించినా.. క్రోమోజోముల అసమానతల కారణంగా సాధారణ పిండాలుగా ఎదగలేకపోయాయి. ఇది శాస్త్రం ఎదుర్కొంటున్న పెద్ద సవాలు. సహజసిద్ధంగా అండం, వీర్యం ఒక్కో సెట్ క్రోమోజోములతో కలుసుకోవాలి. కానీ చర్మకణంలో మాత్రం రెండు సెట్లు ఉంటాయి. అదనంగా ఉన్న సెట్లను తొలగించేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నించినా.. అది పూర్తి స్థాయిలో సాధ్యం కాలేదు. ఇందులో ఇంకా పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉన్నా.. ఇది మాత్రం ఈ దిశగా ముందడుగనే చెప్పవచ్చు. ఇది భవిష్యత్తు వైద్య శాస్త్రానికి కొత్త మార్గాన్ని చూపిస్తోంది.
సంతాన లేమికి చెక్..
మొదటిది, సంతానలేమి సమస్యకు ఇది వెలుగని చెప్పవచ్చు. సహజ పద్ధతుల్లో లేదంటే ఐవీఎఫ్ సాంకేతికతలో ఫలితం రాని జంటలు, భవిష్యత్తులో ఈ విధానంతో కూడా ట్రై చేయవచ్చు. ఇక రెండోది, స్వలింగ సంపర్క జంటలకు కూడా తాము ఇద్దరూ జన్యుపరంగా భాగస్వాములమయ్యే సంతానం కలిగే వీలు ఉంటుంది.
ప్రకృతికి పూర్తి భిన్నంగా ప్రయోగం..
ఈ విధానం పూర్తిగా ప్రకృతికి విరుద్ధం. మానవ సృష్టి ప్రక్రియలో ప్రకృతిని మించి శాస్త్రం పయనిస్తుంది. ఒకవేళ శాస్త్రవేత్తలు పిండాన్ని పూర్తిగా సాధారణ స్థాయిలో తయారు చేయగలిగితే ‘ప్రకృతికి వ్యతిరేకంగా మనుషులు సృష్టించడం’ అవుతుంది. లేక ఇది మానవ సమాజానికి మరొక నైతిక సంకటంగా మారుతుందా? అనే ప్రశ్నలు ఇప్పుటి నుంచే మొలకెత్తుతున్నాయి.
వికృత ఫలితాలు ఏర్పడుతాయా..?
ఈ విధమైన ప్రయోగాలు విజయవంతమైతే జన్యు సంబంధ మార్పులు, కొత్త పద్ధతులు వృద్ధి చెందుతాయి. సైన్స్ ఫిక్షన్ సినిమాలో చూసినట్లు తల్లిదండ్రులు వారి పిల్లల్లో ఉండాల్సిన లక్షణాలను ముందుగానే ఎంచుకోవచ్చు. ఇది వైద్య శాస్త్రం విషయంలో పరిశీలిస్తే ముందడుగే అయినా, సమాజంలో అసమానతలను పెంచే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తుంది.
ఒక్క అడుగు దూరంలో ప్రయోగం..
మొత్తం మీద, చర్మకణాలతో అండాలను రూపొందించే ఈ ప్రయోగం పూర్తికాలేదు. ఇది ఒకవైపు వైద్య రంగంలో విప్లవాత్మక పరిణామాలకు దారి తీస్తే, మరోవైపు నైతిక, సామాజిక చర్చలను రేకెత్తిస్తోంది. శాస్త్రం ఎంత దూరం ముందుకు వెళ్లాలి..? మానవ సమాజం ఎంతవరకు అంగీకరించాలి..? అనే ప్రశ్నలకు సమాధానమే రాబోయే దశాబ్దపు సవాలు అవుతుంది.
