Begin typing your search above and press return to search.

బ్రెయిన్ ఈటింగ్ అమీబా : 81 కేసులు, 21 మరణాలు.. కేరళలో ఏం జరుగుతోంది?

కేరళ రాష్ట్రంలో మరో అరుదైన, ప్రాణాంతక వ్యాధి ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫలైటిస్ ( PAM) కేసులు తీ

By:  A.N.Kumar   |   24 Sept 2025 4:57 PM IST
బ్రెయిన్ ఈటింగ్ అమీబా : 81 కేసులు, 21 మరణాలు.. కేరళలో ఏం జరుగుతోంది?
X

కేరళ రాష్ట్రంలో మరో అరుదైన, ప్రాణాంతక వ్యాధి ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫలైటిస్ ( PAM) కేసులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. దీనిని సాధారణంగా 'బ్రెయిన్ ఈటింగ్ అమీబా' అని పిలుస్తారు. ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు రాష్ట్రంలో 81 కేసులు నమోదవగా అందులో 21 మంది మరణించినట్లు అధికారిక సమాచారం.

నైగ్లేరియా ఫౌలెరి అంటే ఏమిటి?

ఈ ప్రాణాంతక వ్యాధికి కారణం నైగ్లేరియా ఫౌలెరి అనే అరుదైన అమీబా. ఇది సహజసిద్ధంగా తీయని నీటిలో , ముఖ్యంగా వెచ్చని సరస్సులు, నదులు, కాలువలు.. వేడి నీటి బుగ్గలలో నివసిస్తుంది. ఈ అమీబా కలుషితమైన నీటి ద్వారా మానవ ముక్కు లోకి ప్రవేశించి, అక్కడ నుండి నేరుగా మెదడును చేరుతుంది. మెదడులోకి చేరిన తరువాత, ఇది మెదడులోని నరాలను, కణజాలాన్ని వేగంగా నాశనం చేస్తుంది. ఇది కొన్ని రోజుల్లోనే ప్రాణాంతక పరిస్థితికి దారితీస్తుంది. అందుకే ఈ అమీబాకు 'బ్రెయిన్ ఈటింగ్ అమీబా' అనే పేరు వచ్చింది.

* వ్యాధి లక్షణాలు

పీఏఎం (PAM) వ్యాధి చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. దీని లక్షణాలు ఇన్ఫెక్షన్ సోకిన కొద్ది రోజుల్లోనే తీవ్రమవుతాయి. తీవ్రమైన తలనొప్పి, జ్వరం, వాంతులు, మెడ నొప్పి, భ్రాంతి , మూర్ఛలు లక్షణాలుంటాయి. ఈ వ్యాధి వేగంగా పెరిగే స్వభావం కలిగి ఉండటం వల్ల, వ్యాధి నిర్ధారణ, చికిత్సలో జాప్యం జరిగితే మరణాలు ఎక్కువగా నమోదవుతాయి.

ఆరోగ్య శాఖ స్పందన - నివారణ చర్యలు

రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ గారు ఎన్సెఫలైటిస్ కేసులపై పరిశోధనలు జరుగుతున్నాయని, ఖచ్చితమైన కారణం ఇంకా వెలుగులోకి రాలేదని తెలిపారు. అయితే ఈ అరుదైన వ్యాధి ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో వైద్య నిపుణులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరియు కింది నివారణ చర్యలు పాటించాలని సూచిస్తున్నారు.

కలుషితమైన లేదా పరిశుభ్రం చేయని నీటి వనరులలో ముఖ్యంగా నిలకడగా ఉన్న నీటిలో ఈత కొట్టడం తగ్గించాలి. ముక్కులోకి నీరు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకించి ఈత కొట్టేటప్పుడు నోస్ క్లిప్స్ వంటివి ఉపయోగించాలి. తాగునీటిని శుభ్రపరచడం (క్లోరినేషన్), బాగా మరిగించి చల్లార్చి తాగడం శ్రేయస్కరం. ఆరోగ్య విభాగం - స్థానిక సంస్థలు ఇచ్చే సూచనలను తప్పక పాటించాలి.

కేరళ ప్రభుత్వం ఈ అరుదైన 'బ్రెయిన్ ఈటింగ్ అమీబా' నుండి ప్రజలను రక్షించడానికి.. వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈ లక్షణాలు ఏవైనా కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం ముఖ్యం.