Begin typing your search above and press return to search.

సంచలనం... కప్ప కడుపులో పవర్ ఫుల్ క్యాన్సర్ మందు..!

ఈ సమయంలో.. ముందుగా కప్పల లోని గట్ బాక్టీరియాను ఎలకలకు బదిలీ చేయడం వల్ల ఏదైనా క్యాన్సర్ నిరోధక ప్రభావం ఉంటుందేమో చూడాలని ఫిక్సయ్యారు.

By:  Raja Ch   |   29 Dec 2025 10:00 PM IST
సంచలనం... కప్ప కడుపులో పవర్ ఫుల్  క్యాన్సర్ మందు..!
X

ప్రస్తుతం ఈ ప్రపంచంలోని అతి తీవ్రమైన వ్యాధులలో క్యాన్సర్ ఒకటనే సంగతి తెలిసిందే. ఇది ఓ మనిషిని శారీరకంగానే కాకుండా మానసికంగానూ తీవ్రంగా క్షీణింపచేస్తుందని అంటారు. ఈ సమయంలో జపనీస్ శాస్త్రవేత్తలు ఓ అద్భుతమైన విషయాన్ని గుర్తించారు. ఇందులో భాగంగా ఓ కప్ప కడుపులోని పేగుల్లో బాక్టీరియా.. క్యాన్సర్ కు అద్భుతంగా పని చేస్తుందని.. ఇదే సమయంలో శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతున్నట్లు గుర్తించారు! ఇప్పుడు ఈ విషయం సంచలనంగా మారింది!

అవును... జపాన్ లో ఆకు పచ్చ రంగులో ఉండే "ట్రీ ఫ్రాగ్"లో క్యాన్సర్ నిరోధక ప్రభావాలు ఉంటాయో లేదో చూడాలని భావించారు.. జపాన్ అడ్వాన్స్డ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు. ఈ సమయంలో.. ముందుగా కప్పల లోని గట్ బాక్టీరియాను ఎలకలకు బదిలీ చేయడం వల్ల ఏదైనా క్యాన్సర్ నిరోధక ప్రభావం ఉంటుందేమో చూడాలని ఫిక్సయ్యారు. అనుకున్నదే తడవుగా శాస్త్రవేత్తలు పని మొదలుపెట్టారు.

ఈ సమయంలో.. కప్పలు, బల్లులు, న్యూట్స్ వంటి వాటి నుంచి నుంచి మొత్తం 45 బాక్టీరియా జాతులను పరీక్షల కోసం షార్ట్ లిస్ట్ చేశారు. వీటిలో 9 జాతులు యాంటీ-ట్యూమర్ సామర్థ్యాలను గుర్తించదగినవిగా ఉన్నాయని గ్రహించారు. వీటిలో మరి ప్రధానంగా, అత్యంత ఆకర్షణీయమైన పెర్ఫార్మెన్స్ ఈ ట్రీ ఫ్రాగ్ లోని బాక్టీరియా "ఎవింగెల్లా అమెరికానా" లో గుర్తించినట్లు చెబుతున్నారు.

ఇతర జాతులు యాంటీ-ట్యూమర్ ప్రభావాలను స్వల్పకాలికంగా చూపించినప్పటికీ.. ఈ ఎవింగెల్లా అమెరికానా అద్భుతమైన ప్రభావం చూపిస్తుందని.. దీని ఒక మోతాదు చికిత్స.. ఎలుకలలోని కణతులను పూర్తిగా అదృశ్యం చేశాయని చెబుతున్నారు. పైగా ఇది తగ్గిన 30 రోజుల తర్వాత అదే ఎలుకలో మళ్లీ క్యాన్సర్ కణాలను ప్రవేశపెట్టినప్పుడు.. ఆ కణతులు అభివృద్ధి చెందకుండా కూడా ఈ ఎవింగెల్లా అమెరికానా బాక్టీరియా పనిచేసిందని చెబుతున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన శాస్త్రవేత్తలు... ఎవింగెల్లా అమెరికానా చాలా సురక్షితమైందిగా అనిపిస్తుందని.. దీనివల్ల ఎలుకల్లోని రక్తప్రవాహం నుంచి బాక్టీరియా త్వరగా తొలగించబడిందని.. ఇది ఆరోగ్యకరమైన అవయువాలను ఏమాత్రం ప్రభావితం చేసినట్లు కనిపించలేదని.. కీమోథెరపీ ఔషధం అయిన డోక్సోరోబిసిన్ తో సహా అనేక చికిత్సలకంటే ఎలుకలలో కణితులను తగ్గించడంలో ఈ ఎవింగెల్లా అమెరికానా ఇంజెక్షన్లు మరింత ప్రభావవంతంగా ఉన్నాయని అన్నారు!

ఈ పరిశోధనలో ఇవి ఇంకా ప్రారంభ రోజులే అని.. ఈ జంతు అధ్యయనాల ఫలితాలు మానవులకు అనువందించబడతాయో లేదో చూడటానికి ఇంకా చాలా పరీక్షలు అవసరమవుతాయని చెబుతున్నారు. ఇది సక్సెస్ అయితే మాత్రం.. క్యాన్సర్ కు బెస్ట్ మెడిసిన్ దొరికినట్లే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి!