Begin typing your search above and press return to search.

హైదరాబాద్‌లో వ్యాపిస్తున్న ఇన్‌ఫ్లుయెంజా A !

హైదరాబాద్ నగరంలో ఇన్‌ఫ్లుయెంజా ఎ వైరస్ వ్యాపిస్తున్నది. వాతావరణంలో వస్తున్న ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులు, తేమ, చలిగాలుల వంటి మార్పుల మూలంగా ఇది వేగంగా వ్యాపిస్తోంది.

By:  Garuda Media   |   13 Oct 2026 12:46 PM IST
హైదరాబాద్‌లో వ్యాపిస్తున్న ఇన్‌ఫ్లుయెంజా A !
X

హైదరాబాద్ నగరంలో ఇన్‌ఫ్లుయెంజా ఎ వైరస్ వ్యాపిస్తున్నది. వాతావరణంలో వస్తున్న ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులు, తేమ, చలిగాలుల వంటి మార్పుల మూలంగా ఇది వేగంగా వ్యాపిస్తోంది. వైరల్ జ్వరాలు, ఫ్లూ లక్షణాలతో ఉన్న కేసులు పెరుగుతున్నాయి.

ప్రధానంగా హైదరాబాద్ లోని నీలోఫర్ ఆసుపత్రితో పాటు, ఇతర ప్రైవేటు ఆసుపత్రులు, చిన్నపిల్లల ఆసుపత్రుల్లో రోజుకు దాదాపు 100 మంది ఈ లక్షణాలతో చేరుతున్నారు. పిల్లలతో పాటు 60 ఏళ్లు దాటిన వృద్ధులు ఎక్కువగా చేరుతున్నారు. అధిక జ్వరం, గొంతు నొప్పి, మంట, పొడి దగ్గు, తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు, తీవ్ర అలసట, ముక్కు కారడం, మూసుకోవడం, కొన్ని సార్లు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చాతి బిగువు వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి.

పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, షుగర్ పేషెంట్లు మరియు ఆస్తమా వ్యాధులు ఉన్నవారికి సమస్య అధికంగా ఉంటుంది. వైరస్ సోకిన వారు సాధారణంగా 3 నుండి 5 రోజులు, కొందరు 7 నుంచి 10 రోజుల్లో కోలుకుంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు.

చాలా మందిలో ఇది సాధారణ ఫ్లూ లాగానే ఉంటుంది. కానీ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో న్యుమోనియా, బ్రాంకైటిస్, రెస్పిరేటరీ ఫెయిల్యూర్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. సాధారణ జ్వరంగా పరిగణించి నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

దగ్గు, తుమ్ముల ద్వారా, చేతులు శుభ్రంగా ఉంచుకోకపోవడం, రద్దీ ప్రాంతాల్లో, పాఠశాలలు, గాలి ప్రసరణ లేని గదుల్లో వేగంగా వ్యాపిస్తుంది. చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, రద్దీ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం, అనారోగ్యంగా ఉన్న పిల్లలను పాఠశాలకు పంపొద్దని సూచిస్తున్నారు. విటమిన్ సి ఉన్న పండ్లు, పౌష్టికాహారం తీసుకోవడం, వేడి నీరు సేవించాలని చెబుతున్నారు.

జ్వరం 2 లేదా మూడు రోజుల్లో తగ్గకుంటే లేదా శ్వాస సమస్య, అధిక అలసట ఉంటే ఆసుపత్రికి వెళ్లాలని సూచిస్తున్నారు. ఇది సాధారణ సీజనల్ ఇన్‌ఫ్లుయెంజా అయినా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.