Begin typing your search above and press return to search.

17 ఏళ్లు నిండాయా? ఈ ఒక్క టెస్ట్‌తో మీ గుండె పదిలం

ఒకప్పుడు గుండె జబ్బులు అంటే కేవలం వయసు పైబడిన వారికి మాత్రమే వచ్చేవి అనే నమ్మకం ఉండేది. కానీ ప్రస్తుత కాలంలో సీన్ పూర్తిగా మారిపోయింది.

By:  A.N.Kumar   |   10 July 2026 3:47 PM IST
17 ఏళ్లు నిండాయా? ఈ ఒక్క టెస్ట్‌తో మీ గుండె పదిలం
X

ఒకప్పుడు గుండె జబ్బులు అంటే కేవలం వయసు పైబడిన వారికి మాత్రమే వచ్చేవి అనే నమ్మకం ఉండేది. కానీ ప్రస్తుత కాలంలో సీన్ పూర్తిగా మారిపోయింది. మారుతున్న జీవనశైలి, విపరీతమైన మానసిక ఒత్తిడి, జంక్ ఫుడ్ సంస్కృతి, శారీరక శ్రమ లేకపోవడం వంటి రకరకాల కారణాల వల్ల 20, 30 ఏళ్ల యువత కూడా గుండెపోటు బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ కార్డియాలజిస్టులు గుండె ఆరోగ్యంపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరమని హెచ్చరిస్తున్నారు.

17 ఏళ్లు దాటితే 'లిపిడ్ ప్రొఫైల్' తప్పనిసరి

వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రతి ఒక్కరూ 17 ఏళ్ల వయసు నిండిన తర్వాత కనీసం ఒక్కసారైనా కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకోవడం మంచిది. ఈ బ్లడ్ టెస్ట్ ద్వారా శరీరంలోని మంచి కొలెస్ట్రాల్ ఇది గుండెను రక్షిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ఇది ధమనులలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. ట్రైగ్లిసరైడ్స్ అనేది రక్తంలో ఉండే ఒక రకమైన కొవ్వు... వీటి స్థాయిలను ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఈ రిపోర్టుల ఆధారంగా భవిష్యత్తులో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎంతవరకు ఉందో వైద్యులు ముందే అంచనా వేసి, తగిన జాగ్రత్తలు సూచించగలరు.

ఈ లక్షణాలు ఉన్నవారు మరింత అలర్ట్‌గా ఉండాలి..

కుటుంబంలో ఎవరికైనా గుండె జబ్బుల చరిత్ర ఉన్నా, లేదా మధుమేహం , అధిక రక్తపోటు వంటి సమస్యలతో బాధపడుతున్నా మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు 30 ఏళ్ల వయసు నుంచే క్రమం తప్పకుండా గుండె పరీక్షలు చేయించుకోవాలి. అవసరమైతే సిటీ కరోనరీ కాల్షియం స్కాన్ చేయించుకోవడం ద్వారా గుండె ధమనుల్లో ఏమైనా కొవ్వు పేరుకుపోయిందా లేదా అనే విషయాన్ని ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చు. దీనివల్ల భవిష్యత్తులో వచ్చే గుండెపోటు వంటి ముప్పుల నుండి ప్రాణాలను కాపాడుకోవచ్చు.

జిమ్‌కు వెళ్లేవారు, క్రీడాకారులు కూడా జాగ్రత్త

ఇటీవల కాలంలో జిమ్‌లలో కసరత్తులు చేస్తూ, ఆటలు ఆడుతూ అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అందుకే క్రీడాకారులు, జిమ్‌లో తీవ్ర స్థాయిలో వ్యాయామం చేసే వారు తమ గుండె ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. అధిక శారీరక శ్రమ చేసే వారిలో కూడా కొన్ని అంతర్గత గుండె సమస్యలు ఉండే అవకాశం ఉంది కాబట్టి వారు కూడా రెగ్యులర్‌గా మెడికల్ చెకప్స్ చేయించుకోవడం చాలా అవసరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఒక్కసారి టెస్ట్ నార్మల్ వస్తే.. 10 ఏళ్లు ఢోకా లేదు

వైద్యుల ప్రకారం ఒకవేళ మీరు పరీక్షలు చేయించుకున్న తర్వాత రిపోర్టులన్నీ సాధారణంగా వస్తే, వచ్చే 7 నుంచి 10 సంవత్సరాల వరకు గుండె ఆరోగ్యంపై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. అయితే ఈ మధ్యకాలంలో కూడా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం ముఖ్యం.

గుండెను పదిలంగా ఉంచే సూత్రాలు

సమతుల్య ఆహారంగా ఆకుకూరలు, కూరగాయలు, నట్స్ వంటి పౌష్టికాహారం తీసుకోవాలి. కనీసం రోజుకు 30 నిమిషాల పాటు నడక లేదా వ్యాయామం చేయాలి. దురలవాట్లకు దూరంగా ధూమపానం , మద్యపానానికి పూర్తిగా దూరంగా ఉండాలి. ఊబకాయం రాకుండా బరువును ఎప్పటికప్పుడు అదుపులో ఉంచుకోవాలి.

"నివారణ కంటే నిరోధమే ఉత్తమం" అనే సామెత గుండె ఆరోగ్యానికి వందకు వంద శాతం వర్తిస్తుంది. గుండె జబ్బు వచ్చిన తర్వాత హాస్పిటల్స్ చుట్టూ తిరగడం కంటే చిన్న వయసు నుంచే అవసరమైన పరీక్షలు చేయించుకుని, మన జీవనశైలిని మార్చుకోవడం ద్వారా గుండెను దీర్ఘకాలం సురక్షితంగా, ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు. కాబట్టి నిర్లక్ష్యం చేయకండి.. వెంటనే డాక్టర్‌ను సంప్రదించి మీ గుండె ఆరోగ్యాన్ని పరీక్షించుకోండి