షుగర్ బాధితులకు శుభవార్త.. రోజూ కాదు.. ఇకపై వారానికి ఒకసారి!
ఈ మధ్యకాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల్ని మొదలుకొని యుక్త వయసు వరకు అలాగే పెద్దవాళ్లలో కూడా తరచూ వినిపిస్తున్న సమస్య మధుమేహం.
By: Madhu Reddy | 27 Aug 2025 12:00 AM ISTఈ మధ్యకాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల్ని మొదలుకొని యుక్త వయసు వరకు అలాగే పెద్దవాళ్లలో కూడా తరచూ వినిపిస్తున్న సమస్య మధుమేహం. ఒక్కసారి వచ్చింది అంటే ఇక జీవితాంతం మందులు వాడాల్సిందే. అందుకే సాధ్యమైనంత వరకు ఈ షుగర్ వ్యాధి రాకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్త పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఉదయం లేచింది మొదలు జీవితం చాలించే వరకు మెడిసిన్ వాడుతూనే ఉండాలి. అందుకే ఎందుకు దీని బారిన పడ్డామని షుగర్ వ్యాధిగ్రస్తులు ఎప్పటికప్పుడు బాధపడుతూనే ఉంటారు. అయితే ఈ షుగర్ వ్యాధి రావడానికి కారణాలు ఎన్నో.. కానీ వచ్చిన తర్వాత నయం చేసుకోవడం మాత్రం కుదరడం లేదు. అయితే అలాంటి వారి కోసం ఇకపై రోజు కాదు వారానికి ఒకసారే అంటున్నారు వైద్యులు. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం.
షుగర్ వ్యాధిగ్రస్తులకు చక్కటి శుభవార్త..
ఇకపోతే గత కొన్ని సంవత్సరాలుగా మధుమేహ చికిత్సలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మధుమేహం వ్యాధిని తగ్గించడానికి ఇన్సులిన్ ఒకటే కాకుండా గ్లూకగాన్ లైక్ పెప్టైడ్ -1 (GLP -1) అనే ఒక కొత్త రకం ఇంజక్షన్ మందులు ఆపద్బాంధవుడిలా ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా వీటిని వారానికి ఒకసారి తీసుకుంటే చాలు.. ఇక మందు మోతాదులను బట్టి నెలకు ఒకసారి కూడా మార్చుకోవచ్చట. ఇవి గ్లూకోజ్ ను మాత్రమే కాదు.. మధుమేహంతో ముడిపడిన దుష్ప్రభావాలను కూడా తగ్గిస్తూ వ్యాధిగ్రస్తులకు మరింత ప్రయోజనాన్ని చేకూరుస్తున్నాయి. అయితే ఈ ఇంజక్షన్ ను కొంతమంది అధిక బరువు తగ్గడానికి ఉపయోగిస్తున్నారు. కానీ వీటితో కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయట. కాబట్టి ఆచితూచి వాడి తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని మధుమేహం నిపుణులు చెబుతున్నారు.
షుగర్ తో పాటు ఆ వ్యాధులకి కూడా..
ఈ జీఎల్పీ మందులు ఇన్సులిన్ విడుదలను ఇనుమడింప చేయడం, గ్లూకగాన్ ఉత్పత్తి నియంత్రించడం పేగుల నుంచి ఆహారాన్ని నెమ్మదిగా ఖాళీ చేయడం, ఆకలి తగ్గించడం ద్వారా గ్లూకోజ్ అదుపులో ఉండేలా చూస్తాయి. ముఖ్యంగా జీఎల్పీ ఇంజక్షన్లతో మంచి ఫలితాలు కనిపిస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే ప్రపంచ దేశాల ఆరోగ్య మార్గ నిర్దేశాలలో ఇవి భాగమైనట్లు తెలుస్తోంది. మధుమేహం బయటపడినప్పటి నుంచే వీటిని ఆరంభించాలని భావిస్తున్నారు కూడా. ఇకపోతే మధుమేహ చికిత్స పద్ధతులలో రక్తనాళాలు, నాడీ సమస్యలను అరికట్టడానికి మొదటి ప్రాధాన్యమిస్తారు. గుండెపోటు, పక్షవాతం, కిడ్నీ జబ్బు, గుండె వైఫల్యం, పాదాల వేళ్ళు కుళ్ళిపోవడం , అరికాళ్లలో మంట, కాళ్ల నొప్పులు వంటివి నివారించడానికి కూడా ఈ మందులు తోడ్పడుతున్నాయని పలు పరిశోధనలలో నిరూపితమయింది. మధుమేహం ఉన్నా.. లేకపోయినా కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం, కాలేయ క్యాన్సర్ ముప్పు, నిద్రలో కొద్దిసేపు ఊపిరి ఆగడం, నడి వయసులోనే మతిమరుపు , మహిళల్లో అండాశయాల్లో నీటి తిత్తులు వంటి సమస్యలకు కూడా వీటితో మంచి ఫలితం ఉన్నట్లు తెలుస్తోంది.
జిఎల్పి మందుల వల్ల దుష్ప్రభావాలు..
ఇకపోతే ఈ మందుల వల్ల ప్రయోజనాలే కాదు నష్టాలు కూడా ఉన్నాయట. వీటితో కొందరికి ఛాతిలో మంట, కడుపులో నొప్పి, మంట, తేన్పులు, వికారం, అజీర్తి, విరోచనాలు అప్పుడప్పుడు వాంతులు, మలబద్ధకం లాంటి సమస్యలు కూడా ఎదురవుతున్నట్లు సమాచారం. అయితే దీనికే అంతగా భయపడాల్సిన అవసరం లేదని, డాక్టర్ల సలహాతో తగిన మందులు వాడుతూ ఆహారంలో మార్పులు చేసుకుంటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. మొత్తానికైతే తగిన మోతాదులో మందులు వాడితే నిత్యం మందులు వాడకుండా.. వారానికి ఒకసారి ఉపయోగించి సమస్యను అధిగమించవచ్చు.
