డేంజరస్ హాంటావైరస్ ఎంట్రీ.. ఎలా వ్యాపిస్తుంది? ఎవరికెక్కువ ప్రమాదం?
అసలు ఈ వైరస్ ఎంత ప్రమాదకరం? ఎలుకల ద్వారా ఇది ఎలా వ్యాపిస్తుంది? మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
By: Madhu Reddy | 12 May 2026 12:09 PM ISTప్రపంచాన్ని మరో కొత్త వైరస్ భయం వణికిస్తోంది. 'ఎంవీ హోండియస్' అనే క్రూయిజ్ షిప్‌లో మొదలైన హాంటావైరస్ కలకలం ఇప్పుడు దేశాల సరిహద్దులు దాటుతోంది. ఇప్పటికే కొందరు ప్రాణాలు కోల్పోగా, అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అసలు ఈ వైరస్ ఎంత ప్రమాదకరం? ఎలుకల ద్వారా ఇది ఎలా వ్యాపిస్తుంది? మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
క్రూయిజ్ షిప్‌లో మొదలై:
2026 ఏప్రిల్‌లో అర్జెంటీనా నుంచి బయలుదేరిన 'ఎంవీ హోండియస్' అనే ఓడలో ఈ వైరస్ మొదటిసారి బయటపడింది. అక్కడ మొదలైన ఈ ఇన్ఫెక్షన్ వల్ల ఇప్పటికే ముగ్గురు చనిపోయారు. ఇక ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఓ ఫ్రెంచ్ మహిళకు, అమెరికన్ వ్యక్తికి కూడా పాజిటివ్ రావడంతో ప్రపంచ దేశాలు అలర్ట్ అయ్యాయి.
ఇది మనుషుల నుంచి వ్యాపిస్తుందా?:
అదృష్టవశాత్తూ, హాంటావైరస్ ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి అంత త్వరగా సోకదు. మనం మామూలుగా షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నా లేదా ఒకరినొకరు తాకినా ఇది వ్యాపించదు. ఇక సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (CDC) ప్రకారం, ఇది ప్రధానంగా గాలి ద్వారా వ్యాపిస్తుంది. అంటే వైరస్ ఉన్న ఎలుకల విసర్జితాలు గాలిలో కలిసినప్పుడు, ఆ గాలిని మనం పీల్చడం వల్ల ఈ ప్రమాదం పొంచి ఉంటుంది.
ఎలుకలే అసలైన విలన్లు
ఈ వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణం ఎలుకలే. ఎలుకల మూత్రం, మల విసర్జితాలు లేదా అవి గూడు కట్టుకునే పదార్థాలను మనం శుభ్రం చేస్తున్నప్పుడు, అందులోని చిన్న చిన్న వైరస్ కణాలు గాలిలోకి చేరతాయి. అరుదుగా ఎలుకలు కరిచినా లేదా అవి తిరిగిన చోట మనం తాకి ఆ చేతులతో నోరు, ముక్కు ముట్టుకున్నా ఇన్ఫెక్షన్ సోకే ఛాన్స్ ఉంది. ఇక అందుకే ఇంట్లో, గ్యారేజీలు శుభ్రం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
ఈ వైరస్ ఎక్కడ ఎక్కువగా ఉంటుంది?:
హాంటావైరస్ ప్రపంచవ్యాప్తంగా ఉంది, కానీ ప్రాంతాన్ని బట్టి దీని ప్రభావం మారుతుంది. అమెరికా దేశాల్లో ఇది ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది. ఇక యూరప్, ఆసియా దేశాల్లో అయితే కిడ్నీలకు సంబంధించిన సమస్యలను కలిగిస్తుంది. ఇక ముఖ్యంగా పొలాలు, పాత కొట్లు,దట్టమైన అడవులకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో నివసించే వారు ఈ వైరస్ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి.
లక్షణాలు ఎలా ఉంటాయి?:
వైరస్ సోకిన వారం నుంచి ఎనిమిది వారాల లోపు లక్షణాలు బయటపడతాయి. మొదట్లో జ్వరం, అలసట, ఒళ్లు నొప్పులు వంటి సాధారణ ఫ్లూ లక్షణాలు కనిపిస్తాయి. కానీ 4 నుంచి 10 రోజుల తర్వాత పరిస్థితి విషమిస్తుంది. ఇక ఊపిరితిత్తుల్లో నీరు చేరి శ్వాస తీసుకోవడం చాలా కష్టమవుతుంది. డబ్ల్యూహెచ్‌ఓ ప్రకారం ఈ స్టేజ్ చాలా ప్రమాదకరమైనది, మరణాల రేటు కూడా ఎక్కువే.
ఇక వైరస్ సోకిన తర్వాత భయపడటం కంటే రాకుండా చూసుకోవడమే మేలు. మన ఇల్లు, పరిసరాల్లో ఎలుకలు ఉండకుండా చూసుకోవడం, పాత సామాన్లను శుభ్రం చేసేటప్పుడు మాస్క్ ధరించడం వంటి చిన్న చిన్న జాగ్రత్తలు మనల్ని కాపాడతాయి. ఇక ఏవైనా అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించడం మర్చిపోవద్దు. జాగ్రత్త అవసరం.
