ఫ్రెంచ్ ఫ్రైస్ తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త.. ఆ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందంటూ!
అయితే ఇప్పుడు మరో అధ్యయనం ఊహించని నిజాన్ని బయటపెట్టి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
By: Madhu Reddy | 8 Aug 2025 1:45 PM ISTఫ్రెంచ్ ఫ్రైస్.. పిల్లలను మొదలుకొని పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినే స్నాక్. చూడడానికే కాదు తినడానికి కూడా అంతే రుచికరంగా ఉంటుంది. కాబట్టి దీనిని తినడానికి ఎంతోమంది ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన స్నాక్ ఐటమ్ గా గుర్తింపు సొంతం చేసుకున్న ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ప్రాణానికే ముప్పు అని మీకు తెలుసా.. ? ఒక కప్పు ఫ్రెంచ్ ఫ్రైస్ 25 సిగరెట్లు కాల్చడంతో సమానమని.. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ తినడం వల్ల మానసిక సమస్యలు, బరువు పెరగడం, గుండె సమస్యలే కాదు ఏకంగా క్యాన్సర్ కి కూడా దారితీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అయితే ఇప్పుడు మరో అధ్యయనం ఊహించని నిజాన్ని బయటపెట్టి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా ఫ్రెంచ్ ఫ్రైస్ తినడం వల్ల ఆ వ్యాధి వచ్చే అవకాశం ఉంది అని కూడా హెచ్చరిస్తున్నారు. తాజాగా హార్వర్డ్, కేంబ్రిడ్జి యూనివర్సిటీలు దాదాపు 40 సంవత్సరాల సుదీర్ఘ పరిశోధన తర్వాత ఈ విస్తుపోయే నిజాన్ని బయటపెట్టారు.
అసలు విషయంలోకి వెళ్తే.. ఫ్రెంచ్ ఫ్రైస్ తినే వారిలో డయాబెటిస్ ముప్పు అధికంగా పెరుగుతోందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వారానికి మూడుసార్లు ఫ్రెంచ్ ఫ్రైస్ తినే వారిలో 20% డయాబెటిస్ ముప్పు పెరుగుతుందని తమ రీసెర్చ్ లో తేలింది అని పరిశోధకులు వెల్లడించారు. ఒక కప్పు ఫ్రెంచ్ ఫ్రైస్ లో ఇంత ప్రమాదం ఉందని, అయితే ఇంతే మోతాదులో బంగాళదుంపలను ఉడికించి లేదా కాల్చి తింటే ఈ స్థాయిలో ముప్పు ఉండదని కూడా పరిశోధకులు వెల్లడించారు. మొత్తానికైతే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ తో గుండెపోటు మాత్రమే కాదు డయాబెటిస్ కూడా వస్తుందని హెచ్చరిస్తున్నారు. మరి ఇకనైనా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి జంక్ ఫుడ్ కి దూరం అవుతారేమో చూడాలి.
ఇకపోతే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీలో ఉపయోగించే పద్ధతులే ఇలా ప్రాణాంతకంగా మారుతున్నాయని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫ్రెంచ్ ఫ్రైస్ అధిక ఉష్ణోగ్రతల వద్ద నూనెలో డీప్ ఫ్రై చేసి తయారుచేస్తారు. ఈ ప్రక్రియలో అనారోగ్య సమ్మేళనాలు ఎన్నో ఏర్పడతాయి. ముఖ్యంగా ఫ్రెంచ్ ఫ్రైస్ వేయడానికి హోటల్స్ లో ఏ నూనె ఉపయోగించారో తెలియదు.. ఆ నూనె ఎన్నిసార్లు ఉపయోగించారో తెలియదు. నూనెను పదేపదే వేడి చేయడం వల్ల ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఏర్పడతాయి. ఇవి గుండెకు హానిని కలిగిస్తాయి. ఈ ట్రాన్స్ ఫ్యాట్ శరీరంలో పేరుకుపోయి, కార్డియో వాస్కులర్ ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. అంతేకాదు ఇది ధూమపానం కంటే హానికరం. ఇందులో ఉండే అధిక ఉప్పు రక్తపోటును పెంచుతుంది. హైపర్ టెన్షన్ కారణంగా గుండె జబ్బులు, స్ట్రోక్ కి కారణం అవుతుంది. ఎక్కువ సోడియం గుండె రక్తనాళాలపై కూడా ఒత్తిడిని కలిగిస్తుంది.
అంతేకాదు అధిక క్యాలరీలు ఫ్రెంచ్ ఫ్రైస్ లో ఉంటాయి. ఇవి అనారోగ్యకర కొవ్వులు కాబట్టి క్రమం తప్పకుండా వీటిని తింటే బరువు పెరుగుతారు. ఇదిలా ఉండగా హార్వర్డ్ TH చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధ్యయనం ప్రకారం ఫ్రెంచ్ ఫ్రైస్ తినే వ్యక్తులు ఆరోగ్యకర స్నాక్స్ తినే వారితో పోల్చుకుంటే అధికంగా బరువు పెరిగినట్లు సమాచారం. 20 సంవత్సరాల పాటు 1,20,000 మంది పై అధ్యయనం నిర్వహించగా.. నాలుగు సంవత్సరాలకు సగటున 1.5 ఫౌండ్ల బరువు పెరిగినట్లు తమ అధ్యయనంలో కనుగొన్నారట. ఇలాంటి ప్రాణాంతక వ్యాధులను కలిగించే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ను తినకపోవడమే మంచిది అని కూడా చెబుతున్నారు.
