Begin typing your search above and press return to search.

వైరస్ తో 1700 మంది మృతి.. ప్రపంచానికి మరో విపత్తు

ఆఫ్రికా దేశం డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో లో ఎబోలా వైరస్ మరోసారి తీవ్ర కలకలం రేపుతోంది.

By:  A.N.Kumar   |   4 Aug 2026 8:09 PM IST
వైరస్ తో 1700 మంది మృతి.. ప్రపంచానికి మరో విపత్తు
X

ఆఫ్రికా దేశం డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో లో ఎబోలా వైరస్ మరోసారి తీవ్ర కలకలం రేపుతోంది. గతంలో ప్రపంచాన్ని వణికించిన ఈ ప్రాణాంతక వైరస్ ప్రస్తుతం అత్యంత వేగంగా వ్యాపిస్తున్న వ్యాధిగా ఆరోగ్య సంస్థలు హెచ్చరిస్తున్నాయి. తాజా ప్రభుత్వ గణాంకాల ప్రకారం మే 15 నుంచి ఇప్పటివరకు 3,802 ఎబోలా కేసులు నమోదవగా 1,707 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ , ఆఫ్రికా సీడీసీ అప్రమత్తమయ్యాయి.

ఈ ఎబోలా వ్యాప్తికి బుండిబుగ్యో వైరస్ కారణమని అధికారులు గుర్తించారు. ఆందోళనకర విషయం ఏమిటంటే ఈ వైరస్‌కు ప్రస్తుతం ఆమోదం పొందిన టీకా లేదా నిర్దిష్ట చికిత్స అందుబాటులో లేదు. దీంతో వ్యాధి నియంత్రణ మరింత సవాలుగా మారింది. ప్రస్తుతం రెండు వ్యాక్సిన్ ట్రయల్స్ యూకే, కెనడాలో కొనసాగుతుండగా బాధితులకు చికిత్స అందించేందుకు ఔషధాలపై క్లినికల్ ట్రయల్స్ కూడా కొనసాగుతున్నాయి.

ఈ వ్యాప్తి ఎక్కువగా తూర్పు కాంగోలోని ఇటూరి ప్రావిన్స్‌లో కేంద్రీకృతమైంది. నమోదైన మొత్తం కేసుల్లో దాదాపు 90 శాతం ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. అయితే కిసంగాని వంటి ప్రధాన నగరంతో పాటు మరో ఐదు ప్రావిన్సుల్లో కూడా కేసులు నమోదవడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. వైరస్ సోకిన వారితో సంబంధం ఉన్న 17 వేల మందికి పైగా వ్యక్తులను పర్యవేక్షిస్తున్నారు. అయితే కొత్తగా నమోదవుతున్న కేసుల్లో దాదాపు 80 శాతం కాంటాక్ట్ ట్రేసింగ్ ద్వారా కాకుండా నేరుగా కమ్యూనిటీ వ్యాప్తి వల్ల వస్తుండటం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. ఈ అంశంపై ఆఫ్రికా సీడీసీ డైరెక్టర్ జనరల్ జీన్ కసేయా ప్రత్యేకంగా ఆందోళన వ్యక్తం చేశారు.

వ్యాధి నియంత్రణలో అనేక అవరోధాలు ఎదురవుతున్నాయి. ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సాయుధ ఘర్షణలు, ప్రజల వలసలు, అక్రమ మైనింగ్ కార్యకలాపాలు, ఆరోగ్య సిబ్బందిపై దాడులు, స్థానిక ప్రజల్లో అవగాహన లోపం కారణంగా కాంటాక్ట్ ట్రేసింగ్ సమర్థవంతంగా జరగడం లేదు. ఇప్పటివరకు 100 మందికి పైగా ఆరోగ్య సిబ్బందికి కూడా ఎబోలా సోకడం పరిస్థితి తీవ్రతను మరింత పెంచింది.

మరోవైపు జీతాలు చెల్లించలేదని ఆరోపిస్తూ ప్రభావిత ప్రాంతాల్లోని కొందరు ఆరోగ్య కార్యకర్తలు ఆందోళనకు దిగడం కూడా వైద్య సేవలపై ప్రభావం చూపుతోంది. ఇదే సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానమ్ ఘెబ్రేయేసస్ కాంగో పర్యటన చేపట్టి పరిస్థితిని సమీక్షించనున్నారు.

గతంలో 2014-16 మధ్య జరిగిన అతిపెద్ద ఎబోలా వ్యాప్తిలో 28 వేల మందికి పైగా వైరస్ బారిన పడగా 11 వేల మందికిపైగా మరణించారు. అయితే ప్రస్తుత వ్యాప్తిలో మరణాల రేటు గతంతో పోలిస్తే మరింత వేగంగా పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. వైరస్‌ను అదుపులోకి తీసుకురావడానికి అంతర్జాతీయ సహకారం, వేగవంతమైన వైద్య చర్యలు.. ప్రజల్లో అవగాహన అత్యంత కీలకమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.