అలెర్ట్: కరోనాను మించి మరో ప్రాణాంతక వ్యాధి.. లక్షణాలు, జాగ్రత్తలు ఇవే!
గత 4 ఏళ్ల క్రితం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఎలా వణికించిందో చెప్పనక్కర్లేదు. కరోనా వల్ల ఎంతో మంది జీవితాలు అస్తవ్యస్తమైపోయాయి.
By: Madhu Reddy | 8 Dec 2025 12:15 PM ISTగత 4 ఏళ్ల క్రితం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఎలా వణికించిందో చెప్పనక్కర్లేదు. కరోనా వల్ల ఎంతో మంది జీవితాలు అస్తవ్యస్తమైపోయాయి. అయితే ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా లాంటి మరో మహమ్మారి ముంచుకొస్తోంది.. తాజాగా డబ్ల్యూహెచ్వో ఓ వైరస్ గురించి చేసిన హెచ్చరిక మళ్ళీ ప్రజల్లో గుబులు పుట్టిస్తోంది. అదే మార్బర్గ్ వైరస్.. దక్షిణ ఇథియోపియాలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ డిసెంబర్ 3 నాటికి ఏకంగా 8 మంది చావుకి కారణమైంది.మరో 13 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలోనే దక్షిణ ఇథియోపియాలోని సౌదీ రాయబార కార్యాలయం తమ పౌరులను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
ప్రయాణికులు, నివాసితులు భద్రతా చర్యలు పాటించడంతో పాటు స్థానిక అధికారుల సూచనలు పాటించాలని కోరారు.ఈ వైరస్ వల్ల మరణాల రేటు 88 శాతం ఉంటుందని అధికారులు తేల్చేశారు. ఇలాంటి వైరస్ ఎక్కువగా దక్షిణ ఇథియోపియా, సిడానా ప్రాంతాలలో గుర్తించబడ్డాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఆరోగ్య పర్యవేక్షణ మరియు ప్రజా భద్రత చర్యలు పెరుగుతున్నాయి. పైగా ఈ వైరస్ కు సంబంధించిన న్యూస్ వైరల్ గా మారడంతో ఇతర దేశాల అధికారులు కూడా అలర్ట్ అయిపోయారు.
ప్రభావిత ప్రాంతాలలో నివాసితులు మరియు సందర్శకులకు వ్యాప్తి చెందకుండా రక్షించడానికి సలహాలు మరియు ప్రయాణ హెచ్చరికలను జారీ చేశారు. వైరస్ సంకేతాలు ఉన్న ఎవరైనా ముందస్తు రోగ నిర్ధారణ, నియంత్రణను నిర్ధారించడానికి వెంటనే వైద్య సహాయం పొందాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
అయితే ఈ వైరస్ సోకిన వారిలో తీవ్రమైన కండరాల నొప్పి, అధిక జ్వరం, తలనొప్పి,అలసట వంటి లక్షణాలు ఉంటాయట. అయితే ఈ మార్బర్గ్ వైరస్ ఎక్కువగా జంతువుల నుండి మనుషులకు సోకి వారి ఉండి మరొకరికి సోకుతుందని తెలిపారు. అయితే ఈ వైరస్ ఎబోలా కుటుంబానికి చెందినది.ఇక ఎబోలా వైరస్ కి మెడిసిన్ గానీ సరైన చికిత్స గానీ, టీకా గానీ లేకపోవడం వల్ల మరణాల సంఖ్య కూడా అంచనా వేయలేమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి ఎలాంటి టీకా లేకపోవడం వల్ల జాగ్రత్తలు పాటించడమే మంచిదని అంటున్నారు. ఇక ఈ వైరస్ సోకిన వ్యక్తుల ద్వారా వచ్చే రక్తం, మూత్రం, లాలాజలం, ఇతర శారీరక ద్రవాలు నేలపై నేరుగా పడడం ద్వారా వ్యాపిస్తుంది. ఈ వైరస్ సోకిన వారిలో పైన చెప్పిన లక్షణాలు మాత్రమే కాకుండా కొంతమందిలో అతిసారం, వాంతులు, ఛాతి నొప్పి వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయట.
వైరస్ సోకిన వ్యక్తికి వ్యాధి తీవ్రత ఎక్కువైతే ఒక్కొక్కసారి రక్తస్రావం జరిగి అనేక అవయవాలు పనిచేయడం ఆగిపోతాయట. ఈ వైరస్ సోకిన వ్యక్తి దాదాపు 8 నుండి 9 రోజుల్లో మరణిస్తారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ మార్బర్గ్ వైరస్ ఇప్పుడు కాదు 1967 లోనే జర్మనీలో గుర్తించారు. జర్మనీలోని మార్బర్గ్ నగరంలో ప్రయోగశాలలో పనిచేసే కొంత మందికి ఓ అజ్ఞాత వైరస్ వల్ల అనారోగ్యం తలెత్తడంతో ఆ వైరస్ కి మార్బర్గ్ అనే పేరు పెట్టారు. గతంలో ఈ వైరస్ టాంజానియా, కాంగో, ఉగాండా,అంగోలా, కెన్యా, ఆఫ్రికా,ఘనా వంటి దేశాల్లో వ్యాప్తి చెందింది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరిస్తోంది.
