చిన్నారుల మరణం వెనుక ఆ డాక్టర్ కమీషనే కారణం.. వెలుగులోకి సంచలన విషయాలు..
ఇటీవల దగ్గుమందు కొంత మంది చిన్నారుల ఉసురుతీసిందని విన్నాం. కానీ ఆ దగ్గుమందును సజెషన్ చేసిన వారు సదరు కంపెనీ ఇస్తున్న కమీషన్ కు కక్కుర్తి పడి ప్రిక్షిప్సన్ చేస్తున్నారని తేలింది.
By: Tupaki Political Desk | 14 Oct 2025 1:51 PM IST‘వైద్యో నారాయణో హరి (వైద్యుడు భగవంతుడి శక్తి రూపం.. ఆయన చేతుల ద్వారా నారాయణుడు ప్రాణాలను రక్షిస్తాడు.)’ ఇది తరతరాలుగా వస్తున్న మాట. వైద్యుడు నిజంగా నారాయణుడే.. ప్రాణాలను సృష్టిని నడిపించడం నారాయణుడి డ్యూటీ. అలాంటి నారాయణుడే వైద్యుడి రూపంలో ఉన్నాడు. కాబట్టి తన ప్రాణాలకు ఎలాంటి హానీ లేదని రోగులు నమ్ముతారు. కానీ నేడు ఈ పదాన్ని మారుస్తున్నారు కొందరు వైద్యులు.. ‘వైద్యుడిని నమ్ముకుంటే నారాయణుడి వద్దకు పంపుతారని’ ఇది వైద్య వృత్తికి కలంకం తెచ్చే కొందరు చేస్తున్న పని.
ఇటీవల చిన్నారుల మరణాలపై దర్యాప్తు..
ఇటీవల దగ్గుమందు కొంత మంది చిన్నారుల ఉసురుతీసిందని విన్నాం. కానీ ఆ దగ్గుమందును సజెషన్ చేసిన వారు సదరు కంపెనీ ఇస్తున్న కమీషన్ కు కక్కుర్తి పడి ప్రిక్షిప్సన్ చేస్తున్నారని తేలింది. ఇది సదరు చిన్నారుల తల్లిదండ్రులను తీవ్రంగా కుంగదీసింది. మధ్యప్రదేశ్‌లో పుట్టిన ఈ విషాదం దేశవ్యాప్తంగా వైద్య వ్యవస్థను కలవరపరిచింది. ‘కోల్డ్‌రిఫ్’ దగ్గు మందు వల్ల 20 మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం కేవలం వైద్య తప్పిదం కాదు.. అది మానవత్వానికి మచ్చ.
షాకింగ్ విషయాలు
ఒక వైద్యుడు, రోగుల ప్రాణాలకంటే కమీషన్‌కి విలువ ఇచ్చాడు. దర్యాప్తు చేపట్టిన అధికారులు చెబుతున్నట్లు, డాక్టర్ సదరు దగ్గుమందు కంపెనీతో రహస్య ఒప్పందం చేసుకున్నాడు. తన వద్దకు వచ్చే రోగులకు కోల్డ్‌రిఫ్ దగ్గు మందు రాసి ఇస్తే, ఆ కంపెనీ అతనికి 10 శాతం కమీషన్ చెల్లిస్తుందని ఆ ఒప్పందం చేసుకున్నాడు. వైద్యం అనేది సేవా వృత్తి అది డబ్బు కోసం కాదు.. రోగిని కాపాడడంలో వైద్యులు ఎంతో పవిత్రంగా వ్యవహరించాలి. కానీ ఇక్కడ ఒక వైద్యుడు ప్రాణాలను వ్యాపార ఒప్పందంగా మలిచాడు. ఈ ఘటన వైద్య వ్యవస్థకు మచ్చగా మారింది.
నిబంధనలు ఉన్నా..
భారత ప్రభుత్వం 2023లోనే నాలుగేళ్ల లోపు పిల్లలకు
‘ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ (FDC)’ మందులు ఇవ్వరాదని స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. ఇలాంటి మందులు పిల్లల మూత్రపిండాల వైఫల్యాలు, లివర్ సమస్యలు కలిగిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఇవి తెలిసినా, సదరు డాక్టర్ ఆ సిరప్ రాశాడు. ఈ కేసులో సదరు డాక్టర్ పై న్యాయస్థానం ‘ప్రొఫెషనల్ నెగ్లిజెన్స్’గా కాకుండా మానవ తప్పదంగా పరిగణిస్తూ బెయిల్ నిరాకరించింది.
సేవా ధర్మమా.. వ్యాపారమా..?
ఈ కేసు ద్వారా సమాజం పెద్ద ప్రశ్నను ఎదుర్కొంటోంది. వైద్య వృత్తి పవిత్రమా..? లేక వ్యాపారమా..? అని ప్రైవేట్ ఆస్పత్రులు, ఫార్మా కంపెనీలు, ల్యాబ్‌లు లాభాల కోసం రోగులను ‘కస్టమర్లుగా’ చూస్తోంది.
ఒకప్పుడు ‘డాక్టర్ దేవుడి రూపం’ అని చెప్పేవారు.. ఇప్పుడు ‘డాక్టర్ కంపెనీ ఏజెంట్’ అని భావించే రోజులు వస్తున్నాయి. ఒక్కో మందు వెనుక వ్యాపార ఒత్తిడి, ప్రొమోషన్లు, లాభాల లెక్కలు ఇవన్నీ మనిషి ప్రాణాలకంటే ముందు నిలుస్తున్నాయి.
కోల్డ్‌రిఫ్ కేసు కేవలం ఒక వైద్యుని తప్పిదం కాదు.. ఇది వైద్య వ్యవస్థలోని వ్యాపార దోపిడీకి అద్దం. ప్రభుత్వం తక్షణం తీసుకోవాల్సిన చర్యలు ఫార్మా కంపెనీల కమీషన్ మోడల్‌పై సంపూర్ణ నిషేధం విధించాలి. పిల్లల మందులపై కఠిన లైసెన్సింగ్ పర్యవేక్షణ ఉండాలి. వైద్యుల కోసం ఎథికల్ కోడ్ ఆడిట్ వ్యవస్థ అవసరం. ప్రైవేట్ క్లినిక్‌ల రికార్డులపై నియమిత ఆడిట్లు తప్పనిసరిగా ఉండాలని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
