బర్నింగ్ సిండ్రోమా?...బాబూ జాగ్రత్త
మనిషి పనిలో పడి యంత్రంగా మారిపోతున్నాడు. యంత్రమైనా నిర్విరామంగా పనిచేస్తుంటే కొద్ది కాలానికి కదలకుండా మొరాయిస్తుంది.
By: Tupaki Political Desk | 16 Jan 2026 11:00 PM ISTమనిషి పనిలో పడి యంత్రంగా మారిపోతున్నాడు. యంత్రమైనా నిర్విరామంగా పనిచేస్తుంటే కొద్ది కాలానికి కదలకుండా మొరాయిస్తుంది. సింపుల్ గా పనిచేయదు అంతే. అంతెందుకు మిషన్ హీటెక్కితే వెంటనే దానికి కాస్త రెస్ట్ ఇస్తాము. లోడ్ ఎక్కువైంది అంటాం. కానీ మనిషికి మాత్రం అలాంటివేం లేవనే అనుకుంటుంటాం. అదే చివరికి ప్రాణాలమీదకు వస్తుంది. ప్రమాద ఘంటికలు మోగుతున్నా...బాధ్యతల పేరిట, తప్పనిసరి పరిస్థితుల పేరిట పట్టించుకోం. దేహం యంత్రాల కన్నా సున్నితమైందని మరచిపోతాం. అది సూచనలు, వార్నింగ్ లు తనదైన శైలిలో ఇచ్చి చూస్తుంది పట్టించుకోకుంటే...ఓసారి తీవ్ర అనారోగ్యంగా మారిపోతుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా లాభం ఉంటుందా? పరిస్థితి ఇంత దూరం తెచ్చు కున్నాక ఎంత డబ్బు ఖర్చుపెట్టినా, క్షీణించిన ఆరోగ్యం మెరుగవదు. ఒక్కోసారి పూర్తి ప్రమాదస్థితిలో వెళ్ళిపోతాం. ఇలా దేహాన్ని, కాలాన్ని లెక్కచేయకుండా పనిలో మునిగిపోయే జబ్బునే బర్నింగ్ సిండ్రోమ్ అంటున్నారు.
ఓ విద్యార్థి పోటీ పరీక్షలో ఎలాగైనా సరే లక్ష్యం సాధించాలి సీటు కొట్టాలి అన్న తపనతో కసితో రోజులు తరబడి, గంటల తరబడి ఓ గదిలో బందీగా కూర్చుండిపోతాడు. తిండీతిప్పలు మానేసి మరీ చదువుపై దృష్టి పెడతాడు. సరే అంత కష్టానికి ఫలితంగా సీటు వచ్చిందే అనుకుందాం. కానీ అప్పటి దాకా తన శక్తుల్ని మొత్తం నిర్దాక్షిణ్యంగా మరిగించేసున్న విద్యార్థికి అతి తక్కువ సమయంలోనే అనారోగ్య సమస్యలు చుట్టుముడుతాయి...అప్పుడు ఆరోగ్య పరిరక్షణ కోసం సాధించిన సీటును కూడా త్యాగం చేయాల్సిన దుస్థితి తలెత్తుతుంది.
ఒక ఐటీ ఉద్యోగి రోజూ నాలుగ్గంటలు ప్రయాణానికే ఖర్చు చేస్తుంటాడు. ఆఫీసులో ల్యాప్ టప్ కు అతుక్కుపోయి మరీ ఉద్యోగం చేస్తాడు. పై అధికారి లక్ష్యం కోసం వేధిస్తున్న కొద్దీ పనిగంటలు పెంచుకు పోతుంటాడు. చివరికి నిద్రలేమి, తిండి సమస్య వల్ల అనారోగ్యం పాలవుతాడు. ఆ ఏడాది ఉత్తమ ఉద్యోగిగా అవార్డు అందుకున్నా...దాన్ని ఆస్వాదించలేనంత అనారోగ్యంతో మంచాన పడతాడు. ఈ బర్నింగ్ సిండ్రోమ్ వల్ల ఏం ప్రయోజనం?
పైరెండు అంశాలు కేవలం ఉదాహరణలు కాదు...భారతదేశంలో ప్రతి యువత ఎదుర్కొంటున్న తీవ్ర మానసిక సమస్య. పుట్టింది మొదలు చివరి దాకా ప్రతి క్షణం పోటీగానే ఉంటోంది జీవితం. చిన్నప్పుడు చదువుల్లో పోటీ, పెరిగాక పరీక్షల్లో పోటీ, ఆ తర్వాత ఉద్యోగం కోసం పోటీ, అక్కడితో ఆగిపోలేదు...ఉద్యోగంలో స్థిరపడ్డం కోసం, జీతాల పెంపు కోసం., ఖర్చు కోసం, పొదుపు కోసం ప్రతి సందర్భం పోటీగా ఉంటుంది. ఈ పోటీ ప్రపంచంలో స్థిమితంగా ఉంటూ తన పని తాను చేసుకుపోయే వారి సంఖ్యను వెళ్ళపై లెక్కపెట్టవచ్చు. అలాంటి వారిని చేతకాని వారిగా, అసమర్థులుగా ముద్ర వేసి పక్కన పెట్టేస్తాం. కానీ ఈ పోటీలో ఎదుర్కోవలసని అదిపెద్ద సవాలు మానసిక ఒత్తిడి. ఈ ఒత్తిడి మనిషిని చిత్తు చిత్తు చేసేస్తుంది. అందుకే పనిని వ్యసనంగా మార్చేసుకుంటాం. దానికి వర్క్ హాలిక్ అని ముద్దుపేరు కూడా పెట్టుకుంటాం. కానీ నిరంతరం పనిధ్యాసలో పడి ఆరోగ్యాన్ని అసలు పట్టించుకోం. ఇది మరింత సమస్యకు మూలకారణం అవుతోంది. ఇవాళ రేపు చాలా మంది యువత మానసిక ఆందోళన తట్టుకోలేక...ఎన్నో మానసిక రుగ్మతలకు లోనవుతున్నారు. అందులో బర్నింగ్ సిండ్రోమ్ ప్రధానమైంది. వ్యక్తి జీవన నాణ్యతను, నైపుణ్యాన్ని ఘోరంగా దెబ్బతీసే బర్న్ అవుట్ విధానాన్ని చాలా మంది తమ విజయంగా అభివర్ణించు కుంటుంటారు. కానీ ఇది వ్యక్తిగత వైఫల్యం. ఇదో తీవ్ర సామాజిక సమస్య.
ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ బర్నింగ్ సిండ్రోమ్ దీర్ఘకాలిక విద్య ఉద్యోగ వత్తిడి వల్లే అని తేల్చి చెబుతోంది. తాజాగా భారత్ లో నిర్వహించిన ఓ సర్వేలో 24.9శాతం మంది యువ, మహిళలు ఈ బర్నింగ్ సిండ్రోమ్ కు గురవుతున్నట్లు తేలుతోంది. ప్రపంచ స్థాయిలో పోటీ పడాల్సిన సందర్బాలు అనేకం ఉన్నందున విద్యార్థులు ఈ పోటీ ప్రపంచంలో మనలేక వదల లేక చాలా ఇబ్బందులు పడుతున్నట్లు అధ్యయనంలో తెలుస్తోంది. ఐఐటీలు,ఐఐెంలు ప్రభుత్వోద్యోగాలు, విదేశీ చదువులు జీవిత పరమార్థం ఇవేనన్న భావన చాలామంది యువతలో విపరీతమైన ఒత్తిడిని పెంచుతోంది. స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియాలో పొద్దస్తమానం కాలం గడపడం, కంప్యూటర్ స్క్రీన్ లేదా మొబైల్ స్క్రీన్ కు గంటల తరబడి అతుక్కుపోయి కూర్్చోడం ఈ సిండ్రోమ్ కు ప్రధాన కారణాలు. అలాగే పరీక్షల్లో తక్కువ మార్కులు, ప్రతి సందర్భంలో తలిదండ్రులు, చుట్టుపక్కల వాళ్ళతో పోల్చి చూడ్డం, తక్కువ చేసి మాట్లాడ్డం కూడా ఈ సిండ్రోమ్ రావడానికి కారణాలుగా నిలుస్తున్నాయి.
ఈ సిండ్రోమ్ వచ్చిందా అని గుర్తించడానికి కొన్ని లక్షణాలను మనం గమనిస్తే తెలుస్తుంది. శరీరంలో శక్తి తగ్గిపోయి నీరసంగా ఉండటం, నిత్యం అలసటగా ఉండటం, శరీరం విశ్రాంతి కోరుకుంటుండం, చదువు లేదా చేసే పనిపై ఆసక్తి తగ్గిపోవడం, నిద్రలేమి లేదా అధిక నిద్ర, టెన్షన్ తప్పించుకోడానికి విపరీతంగా తినడం, ఒబెసిటీ రావడం, మనం ఏం చేసినా సక్సస్ కాము అనే స్వయం నిర్ఱారణకు రావడం, తలనొప్పి, కడుపునొప్పి తదితర లక్షణాలు కనిపిస్తే మీరుబర్నింగ్ సిండ్రోమ్ కు గురయినట్లే లెక్క...పరిష్కారం ఇకనైనా జాగ్రత్తగా ఉండి...ఈ సిండ్రోమ్ నుంచి బైటికి రావడం.
