యూత్ కి బీపీ షుగర్...ఏంటీ జనరేషన్ !
ఏపీలో బీపీ, షుగర్ బాధితుల సంఖ్య కోటి దాటినట్లు ప్రభుత్వ ఆరోగ్య సర్వే వెల్లడించింది. 18 ఏళ్లు దాటిన వారిలో 13.93 శాతం మంది బీపీతో, 11.45 శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నారు. మారుతున్న ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గడం, పని ఒత్తిడి, నిద్రలేమి యువతలోనూ ఈ వ్యాధులు పెరగడానికి కారణమవుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
By: Satya P | 20 Nov 2026 9:06 AM ISTయువత అంటే కొండలను పిండి చేసే శారీరక దృఢత్వం కలిగి ఉంటారు అన్నది ఒక్కప్పటి మాటగా మారిపోతోంది. పట్టుమని పాతికేళ్ళు నిండక ముందే జబ్బుల బారిన పడుతున్నారు. హార్ట్ ఎటాక్స్ వెంటాడుతున్నాయి. ఇక జీవిత పర్యంతం తోడు నీడగా నిలిచేలా బీపీ షుగర్ వెంట వస్తున్నాయి. ఒకప్పుడు యాభై ఏళ్ళు నిండిన వారిలో కనిపించే బీపీలు చక్కెర వ్యాధులు ఇపుడు యువతని పట్టి పీడిస్తున్నాయి. అసలు ఎందుకిలా అంతా విస్తుబోవాల్సి వస్తోంది. ఈ తరానికి ఏమైంది అని ప్రశ్నించుకోవాల్సి వస్తోంది. ఇంతకీ ఈ జనరేషన్ కి ఏ శాపం తగిలింది అన్నది వేదాంతుల మాట కాదు వైద్య రంగం కూడా తరచి ప్రశ్నిస్తోంది.
సర్వే సంచలనం :
తాజాగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో చేసిన ఆరోగ్య సర్వే చూస్తే సంచలన విషయాలు వెల్లడి అయ్యాయి. ఏకంగా కోటి మందికి పైగా ప్రజలు బీపీ షుగర్ తో బాధపడుతున్నారు. ఏపీ జనాభా ఐదు కోట్లు అనుకుంటే అందులో ప్రతీ ఐదుగురిలో ఒకరి ఈ వ్యాధుల బాధితుడు అన్న మాట. అంతే కాదు పది శాతం మంది ఈ రెండు వ్యాధులతోనూ ఇబ్బంది పడుతున్నారు అని నివేదికలు చెబుతున్నాయి. ఇక కొత్త కేసులు చూస్తే అందులో యువత కూడా ఉండడం ఆశ్చర్యం కలిగితోంది. 18 ఏళ్లు దాటిన వారిలో బీపీ బాధితులు 13.93 శాతం ఉంటే షుగర్ బాధితులు 11.45 శాతం ఉన్నారని తేలింది. అలాగే 40–49 ఏళ్ల మధ్య వయస్కులలో బీపీ బాధితులు 9.99 లక్షల మంది ఉంటే షుగర్ వ్యాధిగ్రస్తులు 9.22 లక్షల మంది ఉన్నారు. అలాగే 18–39 ఏళ్ల యువతలోనూ లక్షలాది బీపీ షుగర్ కేసులు నమోదయ్యాయి.
పెరుగుతున్న బీపీ షుగర్ బాధితులు :
ఏపీలో నానాటికీ బీపీ షుగర్ బాధితులు పెరిగిపోతున్నారు. అందులో యువత మధ్య వయస్కులు ఎక్కువగా ఉంటున్నారు. దీనికి కారణం ఏమిటి అన్నది చూస్తే కనుక వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నది ప్రస్తుత కాలంలో మారిన జీవనశైలి అని. అలాగే అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో పాటు శారీరక శ్రమ తగ్గడం, తీవ్రమైన మానసిక ఒత్తిడి ప్రధాన కారణాల వల్ల అధిక రక్తపోటు, మధుమేహం వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని అంటున్నారు. ఈ రెండు వ్యాధులు ఒకదానితో ఒకటి లోతైన సంబంధాన్ని కలిగి ఉంటాయని చెబుతున్నారు.
ఆహారపు అలవాట్లతోనే :
ఇక ఆహారపు అలవాట్లు ఈ వ్యాధులకు మూలంగా ఉంటున్నాయి. ఈ రోజు అంతా తీసుకునే ఆహారంలో చక్కెర, ఉప్పు అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉండే ప్యాకేజ్డ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఉంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే పాలిష్ చేసిన బియ్యం, ఫైబర్ లేని పాలిష్ బియ్యం వాడడం. మైదా వంటి వాటి వినియోగం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరుగుతున్నాయని అంటున్నారు. అలాగే ఆధునిక సౌకర్యాలతో పాటు కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చుని పనిచేయడం వల్ల శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోయిందని అంటున్నారు. తిన్న ఆహారానికి తగినట్లుగా శ్రమ లేకపోవడంతో శరీరంలో కొవ్వు పేరుకుపోయి అనవసరంగా బరువు పెరుగుతున్నారు. ఇది శరీరంలో ఇన్సులిన్ నిరోధకతకు దారితీసి షుగర్ వ్యాధిని కలిగిస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే రక్తనాళాలపై ఒత్తిడి పెరిగి బీపీ వస్తుంది.
జీవన శైలితో కూడా :
అంతే కాకుండా జీవన శైలి కూడా ఈ రెండు జబ్బుల పెరుగుదలకు కారణం అవుతోంది. నిరంతరం పని ఒత్తిడి, ఆర్థిక సమస్యలు ఆందోళనల వల్ల శరీరంలో కార్టిసాల్, అడ్రినలిన్ వంటి హార్మోన్లు ఎక్కువగా విడుదలవుతాయని అంటున్నారు. ఇవి రక్తనాళాలు కుంచించుకుపోయేలా చేసి బీపీని పెంచడమే కాకుండా ఇన్సులిన్ పనితీరును దెబ్బతీసి షుగర్ స్థాయిలను పెంచుతాయని చెబుతున్నారు. అలాగే సరైన నిద్ర లేకపోవడం, రాత్రిపూట ఆలస్యంగా పడుకోవడం, కనీసం ఏడెనిమిది గంటల నాణ్యమైన నిద్ర లేకపోవడం వల్ల శరీర జీవక్రియ దెబ్బతింటుందని అంటున్నారు. ఇక నగరాలకు వలసలు పెరగడం, కాలుష్యం, ధూమపానం, మద్యపానం అలవాటు పడటం వల్ల బీపీ షుగర్ వ్యాధులు చిన్న వయసులోనే రావడానికి కారణమవుతున్నాయి. ఇక రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ కాలం అదుపులో లేకపోతే రక్తనాళాలు గట్టిపడి, మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుందని కూడా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా షుగర్ ఉన్నవారిలో సుమారు 50 శాతం నుండి 70 శాతం మందికి బీపీ కూడా తోడవుతోందని మెడికల్ జర్నల్స్ నివేదికలు చెబుతున్నాయి.
