‘విషం’ లెక్క తేల్చే కిట్ వచ్చేసింది.. ఎవరు తయారు చేశారంటే?
ఇప్పటివకే దీనిపై పలు క్లినికల్ అధ్యయనాలు నిర్వహించగా నూటికి నూరు శాతం కచ్ఛితత్వాన్ని ఈ కిట్ నమోదు చేసింది.
By: Garuda Media | 13 Dec 2025 3:24 PM ISTపాము కరిస్తే అది విషపూరితమా? కాదా? అన్నది గుర్తించేందుకు ఇప్పటివరకు అందుబాటులో ఉన్న ప్రక్రియకు చాలానే సమయం పట్టే పరిస్థితి. దీంతో చికిత్స అందించే అంశంలో చిక్కులతో పాటు.. భయంతో చాలామంది ప్రాణాలు పోగొట్టుకునే విషాద ఉదంతాలు చూస్తుంటాం. ఇలాంటి వాటికి చెక్ పెట్టేలా బెంగళూరుకు చెందిన ఒక డాక్టర్ రూపొందించిన కిట్ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో పాము కాటు కారణంగా ప్రాణాలు పోగొట్టుకునే వారు చాలామందే ఉంటారు. పాము కరిచిన తర్వాత ఆసుపత్రికి తీసుకొచ్చిన అనంతరం.. తమను పాము కరిచిందన్నభయంతో ప్రాణాలు పోగొట్టుకునేటోళ్లు పలువురు ఉంటారు.
ఈ సమస్యకు పరిష్కారాన్ని రూపొందించారు బెంగళూరు మహానగరానికి చెందిన డాక్టర్ షామా భట్. ఆయన రూపొందించిన కిట్ ప్రత్యేకత ఏమంటే.. పాము కరిసినోళ్ల రెండు రక్తం చుక్కలతో కరిసిన పాము విషపూరితమా? కాదా? అన్నది ఇట్టే చెప్పేస్తుంది. భట్ బయోటెక్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కు చెందిన డాక్టర్ షామా భట్ ఈ పరికరాన్ని రూపొందించారు. బయోటెక్నాలజీ రంగంలో 35 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఆయన.. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి.. అక్కడ పని చేసే వారికి సాయం చేసేందుకు వీలుగా ఈ కిట్ ను తయారు చేశారు.
ఇప్పటివకే దీనిపై పలు క్లినికల్ అధ్యయనాలు నిర్వహించగా నూటికి నూరు శాతం కచ్ఛితత్వాన్ని ఈ కిట్ నమోదు చేసింది. ర్యాపిడ్ స్నేక్ వీనం టెస్టు, స్నేక్ బైట్కిట్ అనేవి గ్రామీణ భారతాన్ని.. వారి ఆరోగ్య సంరక్షణను ఉద్దేశించి రూపొందించినట్లుగా డాక్టర్ షామా భట్ చెబుతున్నారు. ఈ కిట్ మరింత పాపులర్ కావటం ద్వారా మరింత మంది ప్రాణాల్ని నిలిపేలా చేయాలని కోరుకుందాం.
