Begin typing your search above and press return to search.

బెల్లీ ఫ్యాట్‌తో మెదడుకు ముప్పు.. హెచ్చరిస్తున్న నిపుణులు

పొత్తికడుపు చుట్టూ పేరుకుపోయే కొవ్వు (బెల్లీ ఫ్యాట్) కేవలం మీ శరీర రూపాన్ని చెడగొట్టడమే కాకుండా గుండె ఆరోగ్యానికి చేటు చేస్తుందని మాత్రమే మనకు తెలుసు.

By:  A.N.Kumar   |   23 July 2026 3:39 PM IST
బెల్లీ ఫ్యాట్‌తో మెదడుకు ముప్పు.. హెచ్చరిస్తున్న నిపుణులు
X

పొత్తికడుపు చుట్టూ పేరుకుపోయే కొవ్వు (బెల్లీ ఫ్యాట్) కేవలం మీ శరీర రూపాన్ని చెడగొట్టడమే కాకుండా గుండె ఆరోగ్యానికి చేటు చేస్తుందని మాత్రమే మనకు తెలుసు. అయితే ఈ విసెరల్ ఫ్యాట్ మీ మెదడు పనితీరును, జ్ఞాపకశక్తిని కూడా తీవ్రంగా దెబ్బతీస్తుందని తాజా వైద్య పరిశోధనలు దిగ్భ్రాంతికర నిజాలను వెల్లడిస్తున్నాయి.

బెల్లీ ఫ్యాట్ మెదడుపై ఎలా ప్రభావం చూపుతుంది?

న్యూరాలజిస్టుల ప్రకారం పొత్తికడుపులో పేరుకుపోయే అంతర్గత కొవ్వు సాధారణమైనది కాదు. ఇది శరీరంలో మంటను పెంచే కొన్ని రకాల హానికర రసాయనాలను విడుదల చేస్తుంది. రక్తప్రసరణ ద్వారా ఈ రసాయనాలు మెదడుకు చేరుకుని అక్కడి నాడీ కణాల (న్యూరాన్స్) పనితీరును మందగించేలా చేస్తాయి.

ప్రధానంగా కనిపించే సమస్యలు

దీనివల్ల జ్ఞాపకశక్తి మందగిస్తుంది. పాత విషయాలను లేదా రోజువారీ పనులను మర్చిపోతారు. ఏకాగ్రత లోపించడం.. పనిపై శ్రద్ధ పెట్టలేకపోవడం.. త్వరిత నిర్ణయాలు తీసుకోలేకపోవడం జరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఇబ్బంది పడుతారు. మెదడు గ్రహణ శక్తి తగ్గిపోతుంది.

డిమెన్షియా, అల్జీమర్స్ ప్రమాదం

దీర్ఘకాలంగా అధిక బెల్లీ ఫ్యాట్‌తో బాధపడేవారిలో డిమెన్షియా మతిమరుపు, అల్జీమర్స్ వంటి తీవ్రమైన న్యూరోడిజెనరేటివ్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు పొత్తికడుపు కొవ్వు విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి.

మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మార్గాలు

అదృష్టవశాత్తూ సరైన జీవనశైలి మార్పులతో ఈ ప్రమాదం నుండి తప్పించుకోవచ్చని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. రోజువారీగా 30 నుండి 45 నిమిషాల పాటు వేగంగా నడవడం, జాగింగ్, సైక్లింగ్ లేదా ఈత కొట్టడం ద్వారా పొత్తికడుపు కొవ్వును వేగంగా కరిగించవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. పీచుపదార్థాలు ఫైబర్ , తాజా కూరగాయలు, పండ్లు, సంపూర్ణ ధాన్యాలు, ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని మీ డైట్‌లో భాగం చేసుకోండి. మైదా, పంచదార, జంక్ ఫుడ్, నూనెలో వేగించిన పదార్థాలు, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని పూర్తిగా తగ్గించాలి. సరైన నిద్ర , ఒత్తిడి లేని జీవితం అలవర్చుకోవాలి. రోజుకు 7 నుండి 8 గంటల ప్రశాంతమైన నిద్ర మెదడును రీఛార్జ్ చేస్తుంది. యోగా, ధ్యానం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవడం, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటం అత్యంత అవసరం.

బెల్లీ ఫ్యాట్ ఒక్కటే డిమెన్షియాకు నేరుగా కారణం కాకపోయినప్పటికీ అది మెదడు క్షీణతకు ప్రధాన ప్రేరేపకాల్లో ఒకటిగా పనిచేస్తుంది. కాబట్టి ఈరోజే మీ జీవనశైలిని మార్చుకోండి.. బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకుని మెదడును మరింత చురుగ్గా, ఆరోగ్యంగా ఉంచుకోండి..