Begin typing your search above and press return to search.

ఒక ఇంజక్షన్.. మూడు వేల ప్రాణాలు భద్రం!

గత ఏడాది జూన్ 1 నుంచి ఈ నెల 15వ తేదీ వరకు రాష్ట్రంలోనే అత్యధికంగా అనంతపురం జిల్లాలో 617 మందికి స్టెమీ చికిత్స లభించింది. గుంతకల్లు ఏరియా ఆసుపత్రిలో ఈ సంఖ్య 124 వరకు ఉంది.

By:  Tupaki Political Desk   |   27 Nov 2025 5:00 AM IST
ఒక ఇంజక్షన్.. మూడు వేల ప్రాణాలు భద్రం!
X

ఆకస్మాత్తుగా వచ్చే గుండెనొప్పితో ప్రాణాలకు గండమే.. తక్షణ వైద్యం అందితేనే గుండెపోటు నుంచి ప్రాణాలను రక్షించుకోవచ్చు. అందుబాటులో ఆస్పత్రులు.. ఖరీదైన ఇంజక్షన్లు ఉంటేనే ప్రాణాలు నిలబడతాయి. గ్రామీణ ప్రాంతాలు, ఓ మోస్తరు పట్టణాల్లో గుండెపోటు వచ్చిన వారు ప్రాణాలు కాపాడుకోవడం అంటే ఒకప్పుడు గగనమే.. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో గుండెపోటు బాధితులకు గోల్డెన్ అవర్ లోనే వైద్యం అందుతోంది. గుండెపోటు లక్షణాలు కనిపించిన గంట వ్యవధిలోనే సత్వర చికిత్స అందజేయాల్సివుంటుంది. దీన్నే గోల్డెన్ అవర్ అంటారు. ఇప్పటివరకు ఈ గోల్డెన్ అవర్ వైద్యం అందక గ్రామీణ ప్రాంతాల వారు హై రిస్క్ ఎదుర్కొనేవారు. ఈ సమస్యను గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో గుండెపోటు రోగులకు సత్వర వైద్య చికిత్స అందకుండా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రాకూడదని నిర్ణయించారు.

రాష్ట్రంలో 238 ప్రభుత్వ CHCలు, ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రుల్లో 'స్టెమీ' విధానం కింద ఖరీదైన 'టెనెక్టెప్లస్‌' ఇంజెక్షన్లను అందుబాటులో ఉంచారు. సుమారు 45 వేల రూపాయల విలువైన ఈ ఇంజక్షన్ ను పూర్తి ఉచితంగా ఇవ్వనున్నారు. ఈ ఇంజక్షన్ల వల్ల గత మూడు నెలల కాలంలో రాష్ట్రవ్యాప్తం సుమారు మూడు వేల మంది ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఛాతీనొప్పి లక్షణాలతో ఆసుపత్రులకు వచ్చిన వారిలో 3 వేల 155 మందికి 'టెనెక్టె ప్లేస్' ఇంజక్షన్ చేస్తే, వారిలో 3 వేల 27 మంది ప్రాణ గండం నుంచి తప్పించుకున్నారు. అంటే దాదాపు 96 శాతం మంది ప్రాణాలను చంద్రబాబు సర్కారు కాపాడగలిగిందని పరిశీలకులు వ్యాఖ్యనిస్తున్నారు. ఆస్పత్రులకు వచ్చేవారే కాకుండా.. హృద్రోగ లక్షణాలు ఉన్నవారిని ముందే గుర్తించి గుండె నొప్పి రాకుండా ముందుగానే మేల్కొనేలా ప్రభుత్వం వైద్యశాఖను అప్రమత్తం చేస్తోంది. దీంతో భవిష్యత్తులో ఆకస్మిక మరణాల రేటును బాగా తగ్గించాలని సీఎం చంద్రబాబు ఆలోచిస్తున్నారు.

ఆసుపత్రుల్లో సౌకర్యాలు, పరికరాల కోసం రూ.16.60 కోట్లు వ్యయం

స్టేమీ విధానాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు 238 ఆసుపత్రుల్లో అవసరమైన పరికరాలు, యంత్రాల కోసం ప్రభుత్వం రూ.16.60 కోట్లు మంజూరు చేసింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇంజక్షన్ ధర రూ. 40 వేల నుంచి 45 వేల వరకు ఉంది. ఇతర ఖర్చులు అద‌నం. అయితే ప్రభుత్వం ఇంత విలువైన ఇంజెక్షన్లను టెండర్ ద్వారా తక్కువ ధరకే కొనుగోలు చేస్తోంది. ఒక్కొక్క ఇంజెక్షన్ కు ప్రభుత్వం సుమారుగా రూ.19 వేలు, అదనంగా ఇతర మందుల కోసం రూ. 6 వేలు ఖర్చు చేస్తోంది. దీని ప్రకారం ఇప్పటివరకు లబ్ధిపొందిన 3,155 మందికి కలిపి రూ.7.88 కోట్ల వరకు ప్రభుత్వం వ్యయం చేసింది. వారందిరి ప్రాణాలను రక్షించింది.

సిద్ధంగా ఇంజెక్షన్లు

ప్రతి సీహెచ్సీలో 3, ఏరియా ఆసుపత్రిలో 4, జిల్లా ఆసుపత్రిలో 5 చొప్పున ఈ ఇంజెక్షన్లు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. అవసరాలకు అనుగుణంగా అదనంగా అవసరమైతే తక్షణమే పొందే విధంగా ఇంజెక్షన్లు జిల్లా మందుల గిడ్డంగుల్లో సిద్దం ఉంచుతున్నారు. స్టెమీ చికిత్స కింద ప్రతి నెలా సగటున 175 మంది ప్రభుత్వాసుపత్రుల్లో టెనెక్ట్ ప్లేస్‌ ఇంజెక్షన్ పొందుతున్నారు. ఈ ఏడాది ఆగస్టులో 201, సెప్టెంబరులో 217, అక్టోబరులో 186 మంది చొప్పున ఇంజక్షన్ పొందారు. ఈనెల 15వ తేదీ వరకు 99 మందికి ఇంజెక్షన్ ఇచ్చినట్లు డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధర్ బాబు వెల్లడించారు.

జిల్లాల వారీగా

గత ఏడాది జూన్ 1 నుంచి ఈ నెల 15వ తేదీ వరకు రాష్ట్రంలోనే అత్యధికంగా అనంతపురం జిల్లాలో 617 మందికి స్టెమీ చికిత్స లభించింది. గుంతకల్లు ఏరియా ఆసుపత్రిలో ఈ సంఖ్య 124 వరకు ఉంది. దూర ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడి ఆసుపత్రికి వచ్చి అత్యవసర వైద్యం పొంది, ప్రాణాలు దక్కించుకున్నారు. విశాఖ జిల్లాలో 416, కర్నూలు-412, గుంటూరు-354, కాకినాడ-346, తిరుపతి-213, ఎన్టీఆర్-205, శ్రీకాకుళం-203, కడప-147, ఒంగోలు-134, నెల్లూరు జిల్లాల్లో 108 మందికి చొప్పున 'స్టెమీ' వైద్యం అందించినట్లు డీయస్ హెచ్ చక్రధర్‌ బాబు వివరించారు. స్టెమీ విధానంలో చికిత్స పొందిన వారి గురించి 108 కాల్ సెంట‌ర్‌ ద్వారా వారి ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు వాకబు చేస్తున్నారు. వీరి వివరాలను ఇకపై ఎఎన్ఎం, సచివాలయాలకు పంపుబోతున్నామని అధికారులు మంత్రి సత్యకుమార్ యాదవుకి తెలిపారు.

రక్తం గడ్డను కరిగించినందున..

రక్త ప్రసరణ తగ్గి.... గుండె పోటుకు గురైన వారికి తక్షణ వైద్యం కింద స్టెమీ విధానంలో చికిత్స అందిస్తున్నారు. స్టెమీ చికిత్సలో భాగంగా టెనెక్ట్ ప్లేస్ ఇంజెక్షన్ ద్వారా గడ్డ కట్టిన రక్తాన్ని కరిగిస్తున్నారు. దీనివల్ల గుండెకు రక్త ప్రసరణ యథావిధిగా జరగడమే కాకుండా సకాలంలో పెద్దాసుపత్రుల్లో ఉన్నత వైద్యాన్ని పొందడంవల్ల బాధితులు ప్రాణాపాయ పరిస్థితుల నుంచి బయటపడుతున్నారు.

‘యాప్’ ద్వారా కార్డియాలజిస్టులకు వివరాలు

డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ పరిధిలోని సామాజిక, ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రు (238)ల్లో స్టెమీ విధానం అమల్లో ఉంది. ఈ ఆసుపత్రులకు గుండెనొప్పితో బాధపడుతూ వచ్చిన వారి ఆరోగ్య వివరాలను అక్కడి వైద్య సిబ్బంది తమ పరిధిలోని బోధనాసుపత్రుల్లోని కార్డియాలజీ విభాగానికి 'స్టెమీ' యాప్ ద్వారా (ఈసీజీ, ఇతర సమాచారాన్ని) పంపుతున్నారు. అక్కడి నిపుణులు వాటిని పరిశీలించి, ఇంజెక్షన్ ఇవ్వాలా? వద్దా? ఇంజెక్షన్ ఇస్తే తదుపరి చికిత్స ఎలా? ఏమీ చేయాలన్న దానిపై విలువైన సలహాలు, సూచనలు వైద్య సిబ్బందికి ఇస్తున్నారు. ఇంజెక్షన్ పొందిన అనంతరం రోగులు బోధనాసుత్రులు లేదా డాక్ట‌ర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ పరిధిలోని, ప్రైవేట్ అనుబంధ ఆసుపత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్నారు.