Begin typing your search above and press return to search.

ఏపీకి బీపీ, షుగర్ ముప్పు.. కోటి మందికి పైగా బాధితులు! సర్వేలో షాకింగ్ నిజాలు!

ఏపీలో 2.86 కోట్ల మందికి నిర్వహించిన ఎన్‌సీడీ 4.0 సర్వేలో 59.63 లక్షల మందికి బీపీ, 48.95 లక్షల మందికి మధుమేహం ఉన్నట్లు వెల్లడైంది. వీరిలో 34 లక్షల మందికి రెండు వ్యాధులూ ఉన్నాయి. మొత్తంగా 12,768 క్యాన్సర్ కేసులు గుర్తించారు. యువతలోనూ బీపీ, షుగర్ కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

By:  Tupaki Political Desk   |   16 Nov 2026 1:56 AM IST
ఏపీకి బీపీ, షుగర్ ముప్పు.. కోటి మందికి పైగా బాధితులు! సర్వేలో షాకింగ్ నిజాలు!
X

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వెరసి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఎన్సీడీ 4.0 (Non-Communicable Diseases) సర్వే ఫలితాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. రాష్ట్రంలో పెరుగుతున్న జీవనశైలి వ్యాధులు అంటే అధిక రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులు తీవ్రంగా ఉన్నాయని వెల్లడైంది. గత 14 నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.86 కోట్ల మందికి పరీక్షలు నిర్వహించి రూపొందించిన నివేదికను కుటుంబ సంక్షేమ కమిషనర్, ఎన్‌హెచ్‌ఎం ఎండీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు, రాష్ట్ర నోడల్ అధికారి శ్యామల కలిసి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు సమర్పించారు. ఇందులో గణాంకాలు గమనిస్తే ఏపీని బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి వ్యాధులు పట్టిపీడిస్తున్నట్లు అర్థమవుతోంది.

గణాంకాలు చెబుతున్న నిజాలు

రాష్ట్రంలోని 18 ఏళ్లు దాటిన మొత్తం 4.2 కోట్ల జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటే, ప్రస్తుతం రాష్ట్రంలో 13.93 శాతం మంది అధిక రక్తపోటు (బీపీ), 11.45 శాతం మంది మధుమేహం (షుగర్) తో బాధపడుతున్నారు. ఈ సర్వే ద్వారా కొత్తగా 12,23,185 మందికి అధిక రక్తపోటు, 11,58,632 మందికి మధుమేహం ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. ఇవి కాకుండా రాష్ట్రంలో మొత్తం బీపీ బాధితుల సంఖ్య 59.63 లక్షలకు, మధుమేహ బాధితుల సంఖ్య 48.95 లక్షలకు చేరింది. ఈ మొత్తం 1,08,58,000 మందిలో బీపీ, మధుమేహం రెండు కలిపి ఉన్నవారు 34 లక్షల మంది ఉండటం అత్యంత ఆందోళన కలిగించే అంశంగా చెబుతున్నారు. మరోవైపు, నోటి క్యాన్సర్‌కు సంబంధించి 3,339 కేసులు నమోదయ్యాయి. రొమ్ము క్యాన్సర్‌ పీడితులు 5,832, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ బాధితులు 3,597 మంది ఉన్నారు. మొత్తంగా ఈ సర్వేలో 12,768 క్యాన్సర్ కేసులు నిర్ధారణ అయ్యాయి.

యువతకూ తప్పని ముప్పు

సాధారణంగా వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులుగా భావించే బీపీ, షుగర్ ఇప్పుడు యువతను, మధ్యవయస్కులను సైతం వదలడం లేదు. 60 ఏళ్లు పైబడిన వారిలో గరిష్టంగా బీపీ 47.60 శాతం, షుగర్ 43.39 శాతం కేసులు నమోదైనప్పటికీ, 40 నుండి 59 ఏళ్ల మధ్య ఉన్న వారిలోనూ వీటి తీవ్రత అత్యధికంగా ఉంది.

వయస్సుల వారీగా నమోదైన కేసుల వివరాలు పరిశీలిస్తే.. 18–19 ఏళ్ళ మధ్య వయసు వారిలో అధిక రక్తపోటు కేసులు 11,827 నమోదయ్యాయి. 10,360 మందికి మధుమేహం ఉన్నట్లు గుర్తించారు. 0.20 శాతం మంది బీపీ, 0.21 శాతం మంది డయాబెటిస్ తో బాధపడుతున్నట్లు గుర్తించారు. అదేవిధంగా 20–29 ఏళ్ల వయసు వారిలో అధిక రక్తపోటు 81,983 మంది అంటే 1.37%, మధుమేహం 75,431 (1.54%) మందికి సోకింది. 30–39 ఏళ్ల వారిలో 2,89,865 మందికి బీపీ (4.86%), మధుమేహం 2,86,680 (5.86%) మందిలో వెలుగు చూసింది. 40–49 ఏళ్ల వారిలో అధిక రక్తపోటు 9,99,833 (16.77%), మధుమేహం 9,22,583 (18.84%) మందిలో ఉంది. అదేవిధంగా 50–59 ఏళ్ల వారిలో అధిక రక్తపోటు 17,41,147 (29.20%), మధుమేహం 14,76,353 (30.16%) మందిని బాధిస్తోంది. 60 ఏళ్లు, ఆపై వయస్సు వారిలో అధిక రక్తపోటు 28,38,552 (47.60%), మధుమేహం 21,24,428 (43.39%) మందిలో నమోదైంది.

జిల్లాల వారీగా పరిస్థితి: కోస్తా జిల్లాల్లో అధిక తీవ్రత

రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల పరంగా చూస్తే తూర్పుగోదావరి, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, కాకినాడ, ఏలూరు, వైఎస్సార్ కడప జిల్లాలు బీపీ, మధుమేహం కేసుల్లో ముందున్నాయి. అదేవిధంగా, ఈ NCD-4.0 సర్వే ద్వారా మాత్రమే కొత్తగా గుర్తించిన బీపీ కేసుల్లో విశాఖపట్నం (78,017), పశ్చిమగోదావరి (68,802), తిరుపతి (65,504), తూర్పుగోదావరి (64,116), వైఎస్సార్ కడప (63,141) జిల్లాలు ముందుండగా; మధుమేహం కేసుల్లో విశాఖపట్నం (80,692), పశ్చిమగోదావరి (67,935), తిరుపతి (67,827), వైఎస్సార్ కడప (66,914), ప్రకాశం (61,415) జిల్లాలు అగ్రస్థానంలో నిలిచాయి.

సర్వే సాగిన తీరు.. సాంకేతికత వినియోగం

గత ఏడాది సెప్టెంబర్ 17న విశాఖపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించిన సర్వే, నవంబర్ 10 వరకు 14 నెలల పాటు నిరంతరాయంగా సాగింది. గ్రామ, వార్డు స్థాయిలో కమ్యూనిటీ హెల్త్ అధికారులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి వేలి నుంచి రక్తం సేకరించి పరీక్షలు నిర్వహించారు. రక్తంలో చక్కెర స్థాయి 140 mg/dL కంటే ఎక్కువగా ఉన్నవారిని, బీపీ 140/90 mmHg కంటే ఎక్కువగా ఉన్నవారిని వైద్యాధికారుల వద్దకు పంపించి వ్యాధిని నిర్ధారించారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ వేదికలను సమర్థవంతంగా వినియోగించింది. ఆరోగ్య వివరాల నమోదుకు ముందు ఆధార్ ఓటీపీ లేదా వేలిముద్ర ద్వారా వ్యక్తుల గుర్తింపును నిర్ధారించారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, వైద్యుల కోసం ప్రత్యేక మొబైల్ యాప్‌లను, ద్వితీయ స్థాయి ఆసుపత్రుల్లో ఎన్‌సీడీ యాప్‌ను, సర్వజన ఆసుపత్రులలో ప్రత్యేక వెబ్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ సర్వే కోసం క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి వైద్య నిపుణుల వరకు వేలాది మందికి ప్రత్యేక శిక్షణ అందించారు.

క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు

క్షేత్రస్థాయి సిబ్బంది గుర్తించిన 9.96 లక్షల నోటి క్యాన్సర్ అనుమానిత కేసులను వైద్యాధికారులు పరీక్షించి, 23,009 మందిని పెద్ద ఆసుపత్రులకు పంపగా 3,339 కేసులు నిర్ధారణ అయ్యాయి. రొమ్ము క్యాన్సర్ అనుమానితుల్లో 15,374 మందిని ఆసుపత్రికి తరలించగా 5,832 కేసులు తేలాయి. అలాగే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు సంబంధించి 19,429 కేసులను పరిశీలించి పెద్ద ఆసుపత్రులకు పంపగా 3,597 కేసులు నిర్ధారణ అయ్యాయి.

జీవనశైలి వ్యాధుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. బీపీ, మధుమేహం వంటి వ్యాధులను తొలిదశలోనే గుర్తించి, వాటి తీవ్రత పెరగకుండా అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. క్యాన్సర్ కేసులను కూడా ప్రాథమిక దశలోనే గుర్తించేలా పరీక్షలను విస్తృతంగా నిర్వహిస్తున్నామని, వ్యాధులు గుర్తించిన వారికి ప్రభుత్వం ఉచితంగా వైద్య సేవలు అందిస్తోందని, ప్రజల ఆరోగ్య పరిరక్షణే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.