డాక్టర్ ఏఐ: మీ పర్సనల్ హెల్త్ కోచ్!
టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో మన రోజువారీ జీవితంలో స్పష్టంగా కనిపిస్తోంది.
By: A.N.Kumar | 21 Aug 2025 8:00 PM ISTటెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో మన రోజువారీ జీవితంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు కేవలం స్టెప్స్, హార్ట్ రేట్, నిద్ర గంటలు మాత్రమే చూపించిన వేరబుల్స్ (స్మార్ట్ వాచ్‌లు, రింగ్‌లు, ఫిట్‌నెస్ ట్రాకర్స్) ఇప్పుడు కొత్త రూపంలోకి వస్తున్నాయి. ఇకపై ఇవి కేవలం డేటా చూపించేవి మాత్రమే కాదు, పర్సనల్ హెల్త్ కోచ్‌లుగా పనిచేయబోతున్నాయి.
- ట్రాకింగ్ నుంచి గైడెన్స్ వరకు
మన రోజువారీ నడక, నిద్ర నాణ్యత, హార్ట్ బీట్, స్ట్రెస్ లెవెల్స్ వంటి డేటాను ఈ స్మార్ట్ గాడ్జెట్లు సేకరిస్తాయి. అయితే ఈ గణాంకాలను మనం అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఇకపై ఆ పనిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చూసుకుంటుంది. మీరు సరిగ్గా నిద్రపోలేదా? మీ స్క్రీన్‌టైమ్ ఎక్కువైందా? డైట్‌లో ఏమైనా లోపాలున్నాయా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికి, వాటిని విశ్లేషించి మీకు తగిన సూచనలు వెంటనే ఇస్తుంది. జిమ్‌లో కోచ్ ఇచ్చే సలహాలు, ఇంట్లో ఫ్యామిలీ డాక్టర్ ఇచ్చే గైడెన్స్ ఇప్పుడు మీ వాచ్ లేదా స్మార్ట్ ఫోన్‌లోనే లభిస్తాయి.
- గూగుల్ పరిశోధన ఫలితాలు
గూగుల్ ఇటీవల పర్సనల్ హెల్త్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (PHLLM) అనే సిస్టమ్‌ని టెస్ట్ చేసింది. 850 కేసులను విశ్లేషించిన తర్వాత దాని పనితీరు ఈ విధంగా ఉంది. నిద్ర డేటాపై 79% సరిగా అంచనా వేసింది. ఫిట్‌నెస్ సూచనల్లో 88% కచ్చితత్వం చూపించింది. హార్ట్ రేట్ డేటాలో 76% సరిగ్గా విశ్లేషించింది. నిపుణుల సలహాలకు దగ్గరగా ఉన్న ఈ స్థాయి, ఏఐ హెల్త్ కోచింగ్ ఎంత సమర్థవంతంగా పనిచేయగలదో చూపిస్తోంది.
- సురక్షా సమస్యలు
అయితే ఏఐ ఇచ్చే సూచనలు 100% డాక్టర్ల నిర్ణయాల మాదిరిగా ఉండకపోవచ్చు. అందుకే నిపుణులు కొన్ని హెచ్చరికలు చేస్తున్నారు. ఏఐ సలహాలు కేవలం మార్గదర్శకాలుగా మాత్రమే తీసుకోవాలి. పిల్లల విషయంలో తప్పనిసరిగా పేరెంటల్ కంట్రోల్స్ ఉండాలి. ప్రైవసీ సెట్టింగ్స్ కట్టుదిట్టంగా చూసుకోవాలి. హెల్త్ డేటా లీక్ అయితే అది సైబర్ ముప్పుగా మారే అవకాశం ఉంది.
- రాబోయే విప్లవం
యాపిల్ కూడా iOS 18లో ఆరోగ్య సంబంధిత ఏఐ టూల్స్, న్యూట్రిషన్ ట్రాకింగ్ ఫీచర్లు అందించేందుకు సిద్ధమవుతోంది. గూగుల్ ఇప్పటికే రియల్‌టైమ్ డేటాతో పాటు యూజర్ల గత ఆరోగ్య చరిత్రను కూడా విశ్లేషిస్తోంది. దీని వల్ల వినియోగదారులకు ఒక ఫ్యామిలీ డాక్టర్‌లా వ్యక్తిగత వైద్య గైడెన్స్ అందే అవకాశం ఉంది.
స్మార్ట్ వాచ్‌లు, రింగులు కేవలం గాడ్జెట్లే కాదు.. రేపటి రోజుల్లో ఇవే మన ఆరోగ్యానికి సురక్షా కవచం కానున్నాయి. డేటా ప్రైవసీ రక్షణ, డిజిటల్ అక్షరాస్యత కలిపి ఉంటే ఏఐ హెల్త్ కోచ్‌లు నిజంగానే ఆరోగ్య రంగంలో విప్లవం సృష్టించగలవు.
