మార్కెట్ ట్రెండ్: దిగొచ్చిన బంగారం - వెండి ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఈ వారం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.5,950 తగ్గి రూ.1,37,620కి, 22 క్యారెట్ల బంగారం రూ.5,450 తగ్గి రూ.1,26,150కి చేరింది. కిలో వెండి ధర రూ.10,000 తగ్గి రూ.1,95,000 వద్ద కొనసాగుతోంది. పెళ్లిళ్ల సీజన్‌లో ఈ తగ్గుదల కొనుగోలుదారులకు ఊరటనిస్తోంది.
By: Sivaji Kontham | 16 Nov 2026 12:57 AM ISTపెళ్లిళ్లు, వేడుకల కోసం బంగారం, వెండి కొనాలనుకునేవారికి ఇది శుభవార్త. బంగారం - వెండి ధరల్లో చెప్పుకోదగ్గ రీతిలో తగ్గుదల కనిపించడం ఒక పెద్ద ఊరట. మళ్లీ దేశీయంగా డిమాండ్ పెరిగే కొద్దీ ధరలు మారేందుకు కూడా ఛాన్సుంటుంది. అంతర్జాతీయంగా మారుతున్న మార్కెట్ పరిణామాలు దీనికి కారణం.
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఈ వారం భారీగా తగ్గి కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిచ్చాయి. గత కొద్ది రోజులుగా ఆకాశాన్ని తాకిన పసిడి ధరలు ఒక్కసారిగా దిగిరావడంతో ఆభరణాల ప్రియుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వివాహాలు, శుభకార్యాల సీజన్ నేపథ్యంలో బంగారం- వెండి రేట్లు తగ్గుముఖం పట్టడం సామాన్య- మధ్యతరగతి ప్రజలకు కలిసొచ్చే అంశం.
ఈ వారంలో బంగారం ధరల పతనాన్ని పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా రూ.5,950 తగ్గి రూ.1,37,620 వద్దకు చేరుకుంది. అలాగే ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.5,450 తగ్గి రూ.1,26,150 పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న ఆర్థిక పరిణామాలు.. డాలర్ విలువలో మార్పుల ప్రభావం భారతదేశ మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తోంది.
బంగారం బాటలోనే వెండి ధర కూడా భారీగా పతనమైంది. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర ఈ వారంలో ఏకంగా రూ.10,000 తగ్గి రూ.1,95,000 వద్ద కొనసాగుతోంది. ఒకే వారంలో వెండి ధర పది వేల రూపాయల మేర తగ్గడం మార్కెట్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. పారిశ్రామిక డిమాండ్ కాస్త నెమ్మదించడం కూడా వెండి ధరల తగ్గుదలకు ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే బంగారం- వెండి ధరలు ప్రాంతాలను బట్టి స్వల్పంగా మారే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. కొనుగోలుదారులు ఆభరణాలు కొనుగోలు చేసే సమయంలో ఈ ధరలకు అదనంగా 3 శాతం జీఎస్టీ .. అలాగే షోరూమ్‌లను బట్టి తరుగు- మజూరీ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ధరలు భారీగా తగ్గిన ఈ తరుణంలో బంగారంపై పెట్టుబడి పెట్టేవారికి... ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశంగా మారింది.
