ఎం5 చిప్ తో యాపిల్ 'మ్యాక్ బుక్ ప్రో'... ప్రత్యేకతలివే!
యాపిల్ లేటెస్ట్ గా విడుదల చేసిన ఎం5 మ్యాక్ బుక్ ప్రో ఇప్పుడు టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది.
By: Raja Ch | 17 Oct 2025 9:50 AM ISTయాపిల్ లేటెస్ట్ గా విడుదల చేసిన ఎం5 మ్యాక్ బుక్ ప్రో ఇప్పుడు టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది. కాలేజ్ స్టూడెంట్స్, కంటెంట్ క్రియేటర్స్, కార్పొరేట్ వర్కర్స్ లో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ఈ మ్యాక్ బుక్ ప్రో.. సరికొత్తగా ముస్తాబైంది. ఈ కొత్త 14 అంగుళాల మోడల్, ఆన్ డివైజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పనితీరును పెంచడానికి రూపొందించబడింది. ఈ సందర్భంగా దీనిలోని ప్రత్యకతల గురించి తెలుసుకుందామ్...!
అవును... టెక్ దిగ్గజం యాపిల్ తన 14-అంగుళాల మ్యాక్ బుక్ ప్రో అప్డేటెడ్ వెర్షన్ ను ప్రకటించింది. దీనిలో ఇప్పుడు సరికొత్త ఎం5 చిప్ ను అందించింది. దీంతో ప్రతి కోర్ లో న్యూరల్ యాక్సిలరేటర్ తో నెక్స్ట్ జనరేషన్ జీపీయూని కలిగి ఉంది. ఇది లాస్ట్ జనరేషన్ ఎం4 చిప్ ల కంటే 3.5ఎక్స్ ఏఐ పనితీరును, 1.6ఎక్స్ స్పీడ్ గ్రాఫిక్స్ ను అందిస్తుంది. దీనితోపాటు 'ఐప్యాడ్ ప్రో', 'విజన్ ప్రో' హెడ్ సెట్ ను కూడా అప్డేట్ చేసింది.
ఇది లిక్విడ్ రెటినా ఎక్స్.డీ.ఆర్. డిస్ ప్లే, 12ఎంపీ సెంటర్ స్టేజ్ కెమెరా, 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్, విస్తృత శ్రేణి పోర్ట్ లతో వస్తుంది. ఈ డివైజ్ 24 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇదే సమయంలో... ఇమేజ్ ఫైల్స్ ఎక్స్ పోర్టింగ్ లేదా పెద్ద వీడియోల ఇంపోర్టింగ్ వంటి పనుల కోసం ఎం4 మ్యాక్ బుక్ ప్రో కంటే వేగవంతమైన ఎస్.ఎస్.డీ పనితీరును అందిస్తుంది. దీనిలో 4టీబీ వరకు స్టోరేజ్ ఆప్షన్ ను ఎంచుకోవచ్చు.
ఈ కొత్త ఎం5 చిప్ డీప్ లెర్నింగ్, డేటా మోడలింగ్, ఏఐ వీడియో మెరుగుదల వంటి అనేక రకాల ప్రో వర్క్ ఫ్లోలను కూడా వేగవంతం చేస్తుంది. దీనిలో వినియోగదారులు వేగవంతమైన టెక్స్ట్ టు ఇమేజ్ జనరేషన్ ఎక్స్ పీరియన్స్ ను పొందుతారు. ఇదే సమయంలో... ఎల్.ఎం స్టూడియో వంటి ప్రసిద్ధ యాప్ లలో ఎల్.ఎల్.ఎం లు మరింత వేగంగా నడుస్తాయని కంపెనీ చెబుతోంది. అదేవిధంగా... వివిధ భాషలలో కమ్యూనికేట్ చేయడానికి సహాయపడే లైవ్ ట్రాన్స్ లేషన్ ఫీచర్ కూడా ఉంది.
ఇక ధర విషయానికొస్తే... భారత మార్కెట్లో కొత్త మ్యాక్ బుక్ ప్రో బేస్ కాన్ఫిగరేషన్ ధర రూ.1,69,900 నుంచి ప్రారంభమవుతుంది. అయితే విద్యార్థులకు మాత్రం రూ. 1,59,900లకే అందిస్తోంది. ఆపిల్ వెబ్ సైట్, అధీకృత రిటైల్ ఛానెల్ లలో ప్రీ-ఆర్డర్ లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ ల్యాప్ టాప్.. స్పేస్ బ్లాక్, సిల్వర్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.
