ఐఫోన్ ధరలు చూసి జనం పారిపోతున్నారా? యాపిల్ బాస్‌కు నిద్ర పట్టట్లేదట..
ఇక ఈ పోటు చాలదన్నట్లుగా.. ఈ నెల 23న మరింత భారీ ధరతో 'ఫోల్డబుల్ ఫోన్'ను మార్కెట్లోకి తీసుకురావాలని యాపిల్ ప్లాన్ చేస్తోంది.
By: A.N.Kumar | 10 Oct 2026 1:18 PM ISTస్మార్ట్‌ఫోన్ అనగానే మన గుండెల్లో మెరిసే పేరు యాపిల్. జేబులో ఐఫోన్ ఉంటే చాలు.. పక్కవాడికి గుండెల్లో రైళ్లు పరిగెత్తాల్సిందే.. అంతలా బ్రాండ్ ఇమేజ్‌ను మైండ్‌లోకి ఎక్కించేసింది ఈ టెక్ దిగ్గజం. కొత్త మోడల్ మార్కెట్లోకి వస్తోందంటే చాలు.. కిడ్నీలు అమ్మడానికైనా రెడీ అయిపోయే వీరాభిమానులు కోట్లల్లో ఉంటారు. ఏటా కొత్త ఐఫోన్ కోసం క్యూ కట్టే జనాలను చూసి కంపెనీ కూడా ఎగిరిగంతలేసింది. కానీ ఏంటో కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.. ఇప్పుడు యాపిల్ టెక్ దిగ్గజానికి కునుకు కరవయ్యేలా పరిస్థితులు మారుతున్నాయి.
ఫీచర్లు అదుర్స్.. కానీ రేట్లు చూస్తే హార్ట్ ఎటాక్
తాజాగా మార్కెట్లోకి వచ్చిన 'ఐఫోన్ 18 ప్రో', 'ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్' మోడళ్ల ధరలు చూసి సామాన్యులే కాదు.. టెకీలు సైతం బెంబేలెత్తిపోతున్నారు. ఫీచర్లు అదుర్స్ అనిపించినా.. రేట్లు మాత్రం నేరుగా చుక్కలను తాకుతున్నాయి. లక్షలు పోసి కొనేవాడే కానీ ఇప్పుడు ఆ రేట్లకు తగినంత మ్యాజిక్ లేదా అంటూ జనం లెక్కలు వేయడం మొదలుపెట్టారు. దీంతో నెల తిరగకుండానే ఐఫోన్ విడిభాగాల ఉత్పత్తిని ఏకంగా 15 నుంచి 20 శాతం వరకు తగ్గించేయాలంటూ సరఫరాదారులకు యాపిల్ సైలెంట్‌గా క్లాస్ పీకిందట.. ఒకప్పుడు "ధర ఎంతైతే నాకేంటి.. బ్రాండ్ ముఖ్యం" అన్న జనం.. ఇప్పుడు "అంత సీను లేదమ్మా" అంటూ బడ్జెట్ బాట పడుతున్నారు.
బ్రాండ్ ముఖ్యామే.. కానీ జేబు గుల్ల కాకూడదు కదా..
ఒకప్పుడు ఐఫోన్ కొనుగోలు చేయడం అంటే కేవలం ఫోన్ మార్చుకోవడం కాదు.. సమాజంలో ఒక రేంజ్ హోదాను పెంచుకోవడం. కెమెరా నాణ్యత, రాకెట్ లాంటి ప్రాసెసర్ వేగం, సెక్యూరిటీ ఇవన్నీ యాపిల్‌ను పీక్స్‌లో నిలబెట్టాయి. కానీ ఇప్పుడు మార్కెట్ మారింది. జనం ఆలోచన విధానం కూడా మారింది. తమ చేతిలోని ఫోన్ సరిగ్గా పనిచేస్తున్నప్పుడు.. ఏటా కొత్త మోడల్ కోసం వేల రూపాయలు తగలేయడం దేనికని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. ప్రత్యామ్నాయ బ్రాండ్లు తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లు ఇస్తుండటంతో.. యాపిల్ రేట్ల మోతపై కన్నెర్రజేస్తున్నారు.
ఫోల్డబుల్ ఫోన్.. మరో పెద్ద పరీక్ష
ఇక ఈ పోటు చాలదన్నట్లుగా.. ఈ నెల 23న మరింత భారీ ధరతో 'ఫోల్డబుల్ ఫోన్'ను మార్కెట్లోకి తీసుకురావాలని యాపిల్ ప్లాన్ చేస్తోంది. ఉన్న ఫ్లాగ్‌షిప్ ఫోన్లకే దిక్కులేదు.. ఇక మడతపెట్టే ఫోన్లొస్తే వాటి ధరలు ఏ గెలాక్సీలో ఉంటాయో ఊహించడానికే భయమేస్తోంది. ఈ కొత్త ప్రయోగాన్ని జనం ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్‌గా మారింది. కొత్త టెక్నాలజీపై ఆసక్తి ఉన్న పది మంది ముందుకు వచ్చినా సగటు వినియోగదారుడిని ఆకట్టుకోవాలంటే ఈ ధరల మోతను తగ్గించక తప్పదు.
అసలు సమస్యేంటంటే..
యాపిల్ ముందున్న అసలు సవాలు ఏంటంటే.. ఫోన్‌లో ఎన్ని ఫీచర్లు కుమ్మరించామన్నది కాదు.. ఆ ఫీచర్ల కోసం జనం జేబులు ఎంతవరకు గుల్ల చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నదే.. ఉత్పత్తిని గుడ్డిగా పెంచితే అమ్ముడుకాని ఫోన్లు గోడౌన్లలో పేరుకుపోతాయి. అలా అని తగ్గిస్తే డిమాండ్ పెరిగినప్పుడు కొరత వస్తుంది. మొత్తానికి ప్రీమియం మార్కెట్‌లోనూ ధరకు తగిన విలువ ఇవ్వకపోతే.. ఎంతటి టెక్ సామ్రాజ్యమైనా కుదేలవుతుందనే హెచ్చరికను ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. మరి ఈ రేట్ల దెబ్బ నుంచి యాపిల్ తన కొత్త వ్యూహాలతో ఎలా బయటపడుతుందో వేచి చూడాలి.
