Begin typing your search above and press return to search.

ఐఫోన్ డూయో సంచలనం.. 11 వేల సార్లు ఫోల్డ్ చేసినా చెక్కుచెదరని మన్నిక..

సాధారణ స్మార్ట్‌ఫోన్లతో పోలిస్తే ఫోల్డబుల్ ఫోన్లలో డిస్‌ప్లే క్రీజ్ , హింజ్ వ్యవస్థ మన్నికపై ఎల్లప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది.

By:  A.N.Kumar   |   22 Oct 2026 9:52 PM IST
ఐఫోన్ డూయో సంచలనం.. 11 వేల సార్లు ఫోల్డ్ చేసినా చెక్కుచెదరని మన్నిక..
X

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఫోల్డబుల్ మొబైళ్లకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. అయితే ఫోల్డబుల్ ఫోన్ల మన్నికపై వినియోగదారుల్లో ఉండే అనుమానాలను పటాపంచలు చేస్తూ చైనా టెక్ ఇన్‌ఫ్లుయెన్సర్ టిమ్ పాన్ చేసిన ఒక రివ్యూ వీడియో ప్రస్తుతం టెక్ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. ఆపిల్ నుంచి వచ్చిన 'ఐఫోన్ డూయో' ఫోల్డబుల్ మొబైల్‌పై ఆయన రూపొందించిన ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ఫోన్ స్టామినాను నిరూపించేందుకు ఆయన ఏకంగా 11 వేల సార్లు దాన్ని ఓపెన్ చేసి.. క్లోజ్ చేయడం టెక్ ప్రియులను తీవ్ర విస్మయానికి గురిచేస్తోంది.

సాధారణ స్మార్ట్‌ఫోన్లతో పోలిస్తే ఫోల్డబుల్ ఫోన్లలో డిస్‌ప్లే క్రీజ్ , హింజ్ వ్యవస్థ మన్నికపై ఎల్లప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. పదేపదే ఫోన్‌ను మడవడం వల్ల స్క్రీన్ దెబ్బతింటుందా లేదా హింజ్ వదులైపోతుందా అనే సందేహాలు చాలామందిని వేధిస్తుంటాయి. ఈ నేపథ్యంలో టిమ్ పాన్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫాం 'ఎక్స్' లో అపారమైన స్పందనను రాబట్టుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ వీడియోకు కేవలం 18 గంటల్లోనే 1.95 కోట్ల వ్యూస్ రావడం విశేషం. ఫోల్డబుల్ ఐఫోన్‌పై టెక్ లోకానికి ఉన్న విపరీతమైన ఆసక్తికి ఈ గణాంకాలే ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నాయి.

రోజువారీ వాడకంలో వినియోగదారులు ఫోల్డబుల్ ఫోన్లను రోజుకు డజన్ల కొద్ది మడుస్తుంటారు. కాలక్రమేణా ఆ మెకానిజం ఎలా మారుతుందనేది తెలుసుకోవడానికి టిమ్ పాన్ ఈ వినూత్న పరీక్షకు పూనుకున్నారు. ఫోన్‌ను ఏకంగా 11 వేల సార్లు తెరిచి మూసినప్పటికీ దాని పనితీరులో ఎలాంటి లోపం తలెత్తలేదని ఆయన స్పష్టం చేశారు. ఇన్నిసార్లు ఫోల్డ్ చేసినా ఫోన్ హింజ్ , డిస్‌ప్లే ఎక్కడా దెబ్బతినకుండా సరికొత్త ఫోన్‌లాగే పనిచేస్తోందని ఆయన వెల్లడించారు. ఈ రివ్యూతో ఫోల్డబుల్ మొబైళ్ల మన్నికపై ఇప్పటివరకు ఉన్న కొన్ని అపోహలు తొలగిపోయినట్లైంది.

అయితే ఈ వైరల్ వీడియో ఫోల్డబుల్ ఫోన్ల మన్నికపై సానుకూల చర్చకు తెరలేపినప్పటికీ కొనుగోలుదారులు కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. కేవలం ఒక రివ్యూ వీడియో లేదా స్ట్రెస్ టెస్ట్ ఆధారంగా ఫోన్ దీర్ఘకాలిక లైఫ్‌స్పాన్‌ను పూర్తిగా అంచనా వేయలేము. వాస్తవ ప్రపంచంలో ఎదురయ్యే వివిధ రకాల వాతావరణ పరిస్థితులు, ధూళి, ఏళ్ల తరబడి చేసే నిరంతర వినియోగంపైనే తుది ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అంతేకాకుండా ఆపిల్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే వరకు ఈ ఫోన్ ధర, వారంటీ, స్పెక్స్ , రిపేర్ ఖర్చుల వంటి కీలక అంశాలపై పూర్తి స్పష్టత లభించదు. టిమ్ పాన్ చేసిన ఈ రివ్యూ ఫోల్డబుల్ ఐఫోన్ పై అంచనాలను భారీగా పెంచేసింది.