అంతర్జాతీయ బిర్యానీ దినోత్సవం.. తినేద్దామా మరోసారి!
ప్రపంచంలో హైదరాబాద్ గురించి తెలిసిన వారు..తెలుసుకున్న వారెవరైనా సరే.. వారి నోటి నుంచి వచ్చే మొదటి మాట బిర్యానీ. కోట్లాది మందిని తన వశం చేసుకున్న బిర్యానీకి ఈ రోజు అంతర్జాతీయ బిర్యానీ దినోత్సవం.
By: Garuda Media | 5 July 2026 11:33 AM ISTఫుడ్ లవ్వర్స్.. అందునా హైదరాబాదీ అంటే చాలు.. బిర్యానీ.. చాయ్.. ఉస్మాన్ బిస్కెట్.. ఈ మూడు లేకుండా హైదరాబాదీ ఉండడు. హైదరాబాద్ కు ఎవరైనా వచ్చినా.. ఈ ముత్యాల నగరంలో భాగస్వామి అయితే.. ఆటోమేటిక్ గా ఈ మూడింటి ప్రేమలో పడిపోతారంతే. ప్రపంచంలో హైదరాబాద్ గురించి తెలిసిన వారు..తెలుసుకున్న వారెవరైనా సరే.. వారి నోటి నుంచి వచ్చే మొదటి మాట బిర్యానీ. కోట్లాది మందిని తన వశం చేసుకున్న బిర్యానీకి ఈ రోజు అంతర్జాతీయ బిర్యానీ దినోత్సవం.
జులై మొదటి ఆదివారాన్ని అంతర్జాతీయ బిర్యానీ దినోత్సవంగా జరుపుకోవటం కొంతకాలంగా ఉన్నదే. మొఘల్.. తెలంగాణ రుచుల సమ్మేళానికి నిజాం కిచెన్ వేదికగా మారి తయారైన బిర్యానీ.. ఫుడ్ లవ్వర్స్ మాత్రమే కాదు.. ఎవరినైనా తన వశం చేసుకుంటుంది. అందుకే.. హైదరాబాద్ కు వచ్చే సామాన్యుడు మొదలు సెలబ్రిటీల వరకు.. అంతర్జాతీయ ప్రముఖుల వరకు అందరూ కచ్ఛితంగా ట్రై చేయాలనుకునే ఏకైక ఫుడ్ బిర్యానీ. ఇదెలా పుట్టింది? అనే దానిపై బోలెడన్ని వాదనలు ఉన్నాయి. అన్నింటిలోనూ కామన్ గా కనిపించే అంశం.. నిజాం కిచెన్ నుంచే ఈ అద్భుత వంటకం వచ్చిందన్న విషయంలో ఎవరికి ఎలాంటి సందేహం లేదు.
హైదరాబాద్ బిర్యానీ మూడు రకాలుగా కనిపిస్తుందని చెబుతారు. కచ్చీ ఘోష్ బిర్యానీ.. పక్కీ ఘోష్ బిర్యానీ.. సూఫియానీ. బిర్యానీలో మసాలాలు ఒక ఎత్తు అయితే.. దాన్ని తయారు చేసే విధానం మిగిలిన వాటికి కాస్త భిన్నంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అథెంటిక్ హైదరాబాదీ బిర్యానీలో కుంకుమపువ్వును కాస్త వాడతారు. అత్యంత ఖరీదైన ఈ కుంకుమ పువ్వు బిర్యానీకి మరింత రుచిని చేకూరుస్తుందని చెప్పాలి. కాకుంటే.. ఖరీదు ఎక్కువ కావటంతో కుంకుమ పువ్వు పేరుతో నకిలీలు వాడకమే ఎక్కువన్న మాట వినిపిస్తుంటుంది.
గతంలో కాలా భత్ అనే రకం బియ్యంతో బిర్యానీ వండేవారు. ఇప్పుడు బాస్మతీ బియ్యాన్ని వాడుతున్నారు. నిజానికి హైదరాబాద్ బిర్యానీ అన్నంతనే మటన్ బిర్యానీగానే ఫేమస్. కాకుంటే మారిన కాలానికి తగ్గట్లు మర్యానీ బిర్యానీకి అదననంగా చికెన్ బిర్యానీ వచ్చేసింది. ఇటీవల కాలంలో వెజ్ బిర్యానీ.. పన్నీర్ బిర్యానీ.. కాజు పన్నీర్ బిర్యానీ ఇలా బోలెడన్ని ఆప్షన్లు వచ్చేశాయి. ఏమైనా బిర్యానీ లవ్వర్స్ ఈ రోజు బిర్యానీ తినేందుకు ఒక చక్కటి కారణం ఉందని చెప్పటంతో ఎలాంటి సందేహం లేదు. ఇంకెందుకు ఆలస్యం.. ఇంకోసారి బిర్యానీ ట్రై చేసేద్దామా?
