Begin typing your search above and press return to search.

బయట తింటేనే కాదు.. ఇంట్లో వండుకున్నా ప్రాణాలకు ముప్పేనా? హైదరాబాద్ లో ఏంటీ దారుణం?

హైదరాబాద్‌లోని రామ్‌నగర్, ముషీరాబాద్, బేగంబజార్ చేపల మార్కెట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించి 95 కిలోల కుళ్లిన చేపలను గుర్తించి పారవేశారు. సరైన నిల్వ సదుపాయాలు, పరిశుభ్రత లేకపోవడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. చికెన్, మటన్ షాపుల్లోనూ తనిఖీలు నిర్వహించి ఆహార భద్రత ప్రమాణాలు అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

By:  A.N.Kumar   |   27 Nov 2026 10:42 PM IST
బయట తింటేనే కాదు.. ఇంట్లో వండుకున్నా ప్రాణాలకు ముప్పేనా? హైదరాబాద్ లో ఏంటీ దారుణం?
X

మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని.. బయట హోటళ్లలో కంటే ఇంట్లో వండుకునే ఆహారమే ఎంతో సురక్షితమని మనం బలంగా నమ్ముతాం. ఆదివారం వచ్చిందంటే చాలు.. ఎంతో ఇష్టంగా మార్కెట్‌కు వెళ్లి కుటుంబ సభ్యులందరి కోసం రుచికరమైన చేపలు, చికెన్, మటన్ తెచ్చి ప్రేమతో వండి వడ్డిస్తాం. కానీ ఆ ప్రేమతో వడ్డించే ఆహారంలోనే విషం దాగి ఉందని తెలిస్తే ఆ తల్లిదండ్రుల గుండె ఎంత తల్లడిల్లుతుంది? తాజాగా హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు చేపట్టిన తనిఖీలు ప్రతి సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.

ఇప్పటివరకు కేవలం హోటళ్లు, రెస్టారెంట్లపైనే దృష్టి సారించిన ఆహార భద్రత అధికారులు తాజాగా హైదరాబాద్ నగరంలోని రామ్‌నగర్, ముషీరాబాద్, బేగంబజార్ చేపల మార్కెట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి అధికారులే విస్తుపోయారు. ఏకంగా 95 కిలోల కుళ్లిన, పాడైపోయిన చేపలను గుర్తించి పారవేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. సరైన కూలింగ్ భద్రపరిచే సదుపాయాలు లేకపోవడం, చుట్టూ కంపు కొట్టే అపరిశుభ్ర వాతావరణం మధ్యే ప్రజల ప్రాణాలతో వ్యాపారులు చెలగాటమాడుతున్నారు. త్వరగా పాడైపోయే చేపలను సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయకపోతే వాటిలో ప్రాణాంతక బ్యాక్టీరియా పెరుగుతుంది. వాటిని మనం ఎంత శుభ్రంగా కడిగి.. ఎంత రుచిగా వండినా ఆ విషప్రభావం మన పిల్లల, పెద్దల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

ఒక హోటల్ వంటగది ఎంత అద్దంలా మెరిసిపోతున్నా అక్కడ వండే ముడిసరుకు కుళ్లిపోయినదైతే ఆ ఆహారం ఆరోగ్యాన్ని ఎలా ఇస్తుంది? ఇదే సూత్రం మన ఇళ్లకూ వర్తిస్తుంది. మార్కెట్ నుంచే నాణ్యత లేని సరుకు ఇంటికి వస్తుంటే ఇక సామాన్యుడికి రక్షణ ఎక్కడుంది? అందుకే చేపల మార్కెట్ల తరహాలోనే నగరంలోని ప్రతి గల్లీలో వెలిసిన చికెన్, మటన్ షాపులపై కూడా అధికారులు ఉక్కుపాదం మోపాలని ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. జనావాసాల మధ్యే బహిరంగంగా వేలాడదీసిన మాంసం.. వాటిపై వాలే ఈగలు, పేరుకుపోయిన వ్యర్థాలు చూస్తుంటేనే అసహ్యం వేస్తోంది. ఆహార భద్రత అనేది కేవలం జరిమానాలు విధించి.. నాలుగు రోజులు హడావుడి చేసి వదిలేసే చిన్న విషయం కాదు. ఇది కోట్లాది మంది ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న అత్యంత సున్నితమైన అంశం. చేపలు, మాంసం మార్కెట్లలో నిరంతర తనిఖీలు కొనసాగాలి. ప్రతి దుకాణంలో తప్పనిసరిగా రిఫ్రిజిరేషన్, పరిశుభ్రత ప్రమాణాలు పాటించేలా కఠిన నిబంధనలు అమలు చేయాలి. ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే వ్యాపారుల లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేయాలి.

మనం కష్టపడి సంపాదించే రూపాయిని పెట్టి కొనుగోలు చేసేది ఆహారాన్ని మాత్రమే కాదు.. మన కుటుంబ ఆరోగ్యాన్ని కూడా.. ఆహార భద్రత అనేది హోటల్ గేటు దగ్గర మొదలై మార్కెట్‌లోనే ఆగిపోకూడదు. ప్రతి పేద, మధ్యతరగతి ఇంటి కంచంలోకి చేరే ప్రతి ముద్ద సురక్షితంగా ఉన్నప్పుడే ఈ తనిఖీలకు నిజమైన సార్థకత ఉంటుంది.