'పనీర్ విషం'పై ఫుడ్ సేఫ్టీ కొత్త నిబంధనలు.. 'నాన్ డెయిరీ పనీర్' నిషేధం!
భారత ఆహార భద్రత, ప్రమాణాల నియంత్రిత సంస్థ (FSSAI) వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
By: Sivaji Kontham | 25 Sept 2026 9:31 AM ISTభారత ఆహార భద్రత, ప్రమాణాల నియంత్రిత సంస్థ (FSSAI) వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పాలకు బదులుగా ఇతర పదార్థాలతో తయారైన నాన్-డెయిరీ ఉత్పత్తులను `పనీర్` పేరుతో విక్రయించడాన్ని దేశవ్యాప్తంగా నిషేధించాలని ప్రతిపాదించింది.
అనలాగ్ డెయిరీ ఉత్పత్తులు అంటే పాల పదార్థాలకు బదులుగా వృక్షజన్య నూనెలు, స్టార్చ్‌లు, కృత్రిమ రంగులు, రసాయన మిశ్రమాలను ఉపయోగించి తయారు చేసే ప్రత్యామ్నాయాలు. అసలైన పనీర్‌ను పోలి ఉండే ఈ నకిలీ ఉత్పత్తులను కొందరు వ్యాపారులు తక్కువ ధరకు విక్రయిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.
ఈ ఆహార మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు FSSAI రంగంలోకి దిగింది. `ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్స్`లో సవరణలు చేసి.. నాన్-డెయిరీ పదార్థాలతో తయారైన వస్తువులను మార్కెటింగ్ చేయడంలో లేదా ప్యాకింగ్ చేయడంలో `పనీర్` అనే పదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదని స్పష్టం చేసింది.
ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, తెలంగాణ వంటి పలు రాష్ట్రాలు అనలాగ్ పనీర్ తయారీ, విక్రయాలపై నిషేధం విధించాయి. జొమాటో వంటి ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థలు కూడా ఇలాంటి అనలాగ్ ఉత్పత్తులను తమ ప్లాట్‌ఫామ్‌లపై తొలగిస్తూ కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.
ప్రస్తుతం ఈ నిబంధనకు సంబంధించి FSSAI ఒక ముసాయిదాను విడుదల చేసింది. దీనిపై ప్రజలు- పరిశ్రమ వర్గాల నుంచి అభ్యంతరాలు, సలహాలను స్వీకరించేందుకు 60 రోజుల గడువును ప్రకటించింది. ఈ గడువు ముగిసిన తర్వాత తుది నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
పనీర్ ఆధారిత వంటకాల్లో, ముఖ్యంగా పాలక్ పనీర్ తయారీలో నాణ్యత పేరుతో జరుగుతున్న మోసాలు, నకిలీ పదార్థాల వినియోగానికి సంబంధించిన ప్రధాన మోసాలు పరిశీలిస్తే..
సింథటిక్ పాలు- పామాయిల్ తో తయారీ:
అసలైన పాలతో తయారు చేసే పనీర్‌కు బదులుగా.. రసాయనాలు కలిపిన సింథటిక్ పాలు..యూరియా, డిటర్జెంట్లు, చౌక రకమైన వృక్షం నుంచి తీసిన నూనెలు (పామాయిల్) ఉపయోగించి నకిలీ పనీర్‌ను తయారు చేసి పాలక్ పనీర్ తయారీదారులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు.
స్టార్చ్ - మైదా మిశ్రమం:
పనీర్ బరువును పెంచడానికి సాగే గుణాన్ని తెచ్చేందుకు స్టార్చ్, మైదా పిండి, సిట్రిక్ యాసిడ్‌లను కలిపి కృత్రిమ పనీర్‌ను తయారు చేసి రెస్టారెంట్లకు సప్లై చేస్తున్నారు.
ఎక్స్‌పైర్ అయిన స్టాక్‌ను రీప్యాకింగ్ చేయడం:
నాణ్యత లేని, చెడిపోయిన లేదా గడువు ముగిసిన డెయిరీ ఉత్పత్తులను పలు రాష్ట్రాల నుండి అక్రమంగా రవాణా చేసి.. వాటిని శుభ్రం చేసి `ఫ్రెష్ మిల్క్ పనీర్` లేదా `ప్రీమియం పనీర్` ముద్రలతో తిరిగి మార్కెట్లోకి , హోటళ్లకు పంపిస్తున్నారు.
పాలకూర రంగును బట్టి మోసపూరిత కవర్ చేయడం:
పాలక్ పనీర్‌లో పాలకూర ఆకుపచ్చ రంగు ఎక్కువగా ఉండటం వల్ల, లోపల ఉపయోగించే పనీర్ ఎంత నాసిరకమైనదో (అనలాగ్ లేదా కెమికల్ పనీర్) వినియోగదారులకు సులభంగా గుర్తించలేకపోతున్నారు. ఈ అస్పష్టతను ఆసరాగా చేసుకుని కొందరు హోటల్ యజమానులు ప్రమాదకరమైన నకిలీ పనీర్‌ను వంటకాల్లో వాడుతున్నారు.
లైసెన్సులు లేని అనధికార యూనిట్ల ద్వారా సరఫరా:
ఎలాంటి FSSAI అనుమతులు, పరిశుభ్రత ప్రమాణాలు పాటించకుండా అనధికారికంగా నిర్వహిస్తున్న చిన్నతరహా తయారీ కేంద్రాలు ఈ నకిలీ పనీర్‌ను తయారు చేసి... ప్రముఖ బ్రాండ్ల పేర్లతో లేదా ఎలాంటి లేబుల్స్ లేని ప్యాకెట్లలో విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి.
