Begin typing your search above and press return to search.

వీసా.. మాస్టర్.. రూపే కార్డుల్లో ఏది ఎక్కువ యూజ్ ఫుల్?

భారత ప్రభుత్వం జారీ చేసే ఈ కార్డును యూపీఐతో లింకు చేయొచ్చు. ఈ సౌకర్యం వీసా.. మాస్టర్ కార్డులకు లేదన్నది మర్చిపోకూడదు.

By:  Garuda Media   |   19 Dec 2025 10:08 AM IST
వీసా.. మాస్టర్.. రూపే కార్డుల్లో ఏది ఎక్కువ యూజ్ ఫుల్?
X

రోజులు గడుస్తున్న కొద్దీ దేశంలో క్రెడిట్ కార్డుల వినియోగం పెరుగుతోంది. వినమయ ప్రపంచం విస్తరించే కొద్దీ క్రెడిట్ కార్డుల కోసం ప్రయత్నించే వారి సంఖ్య మరింత పెరుగుతుంటారు. ఇదిలా ఉంటే దేశంలో అందరికి అందుబాటులో ఉండే క్రెడిట్ కార్డుల్లో అత్యధికం వీసా.. మాస్టర్.. రూపే కార్డులన్న సంగతి తెలిసిందే. మరి.. ఈ మూడింటిలో ఏ కార్డు బెటర్? దేని కారణంగా మేలు జరుగుతుంది? ఏ కార్డుకు ఎలాంటి లక్షణాలు ఉంటాయి? అన్నది చూస్తే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.

సాధారణంగా క్రెడిట్ కార్డుల్ని అన్ని బ్యాంకులు జారీ చేస్తుంటాయి. అయితే.. ఈ కార్డుల నిర్వహణ.. కార్యకలాపాల్ని పర్యవేక్షించేవి మాత్రం వీసా.. మాస్టర్.. రూపే. క్రెడిట్ కార్డుకు కుడివైపున మీ కార్డు ఏ సంస్థ నిర్వహిస్తుందో ఇక్కడ కనిపిస్తుంటుంది. ఈ మూడు సంస్థలు పేమెంట్ నెట్ వర్కులు మాత్రమే. ఈ ఏడాది ఇప్పటివరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ కార్డుల మధ్య ప్రధానంగా ఉండే తేడాల్ని ఏ నెట్ వర్కుకు ఆ నెట్ వర్కుకు ఉన్న ప్రయోజనాలు లోపాల్ని చూస్తే.. ఏ కార్డుతో ఏమవుతుందన్నది ఇట్టే అర్థమవుతుంది.

రూపే కార్డు

భారత ప్రభుత్వం జారీ చేసే ఈ కార్డును యూపీఐతో లింకు చేయొచ్చు. ఈ సౌకర్యం వీసా.. మాస్టర్ కార్డులకు లేదన్నది మర్చిపోకూడదు. మన దేశం మొత్తంలో ఎక్కడైనా దీని యాక్సెసబులిటీ ఉన్నప్పటికీ.. విదేశాల్లో మాత్రం ఎంపిక చేసిన దేశాల్లోనే ఉంది. దీనికి లావాదేవీల మీద విధించే ఫీజు తక్కువ. అంతేకాదు.. డొమెస్టిక్ రివార్డ్స్ .. క్యాష్ బ్యాక్ ఎక్కువగా చెప్పాలి. మన దేశంలో ఖర్చులు పెట్టేందుకు ఈ కార్డు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు ఎక్కువగా చేసే వారికి ఇది అంత అనువుగా ఉండదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటికి మించి క్రెడిట్ కార్డులు వాడే వారు అత్యధికులు. అలాంటి వారు ఒక రూపే కార్డును తీసుకొని.. మిగిలినవి తీసుకుంటే బెటర్.

వీసా/మాస్టర్ కార్డులు

అమెరికాకు చెందిన బ్యాంకింగ్ దిగ్గజాల నిర్వహణలో ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా వీటి చెల్లుబాటుకు ఢోకా ఉండదు. ఒక అంచనా ప్రకారం 200 దేశాలకు పైనే వీటిని అంగీకరించటం కనిపిస్తుంది. ప్రీమియం బెనిఫిట్స్ ఎక్కువ. ప్రీమియం కార్డ్ ఆప్షన్స్ ఉంటాయి. లావాదేవీల మీద విధించే ఫీజు ఎక్కువ. యూపీఐ లింకు ఉండదు. భారతదేశంలో ఎక్కువగా కార్డు ఉపయోగించాలంటే రూపే కార్డు ఎలానో.. విదేశాల్లో ఎక్కువగా వినియోగించాలని భావించే వారికి ఈ కార్డు బెటర్. వీసా.. మాస్టర్ కార్డు అన్నది పక్కన పెడితే.. ఆయా బ్యాంకులు జారీ చేసే కార్డులు.. ఒక్కో బ్యాంకు ఒక్కో తరహాలో బెనిఫిట్స్ అందిస్తాయన్నది మర్చిపోకూడదు. క్రెడిట్ కార్డు తీసుకునేటప్పుడు.. అవి అందించే ప్రయోజనాల గురించి అవగాహన చాలా అవసరం. లేకుంటే అనవసర ఖర్చులు మీద పడతాయన్నది మర్చిపోకూడదు.