Begin typing your search above and press return to search.

భారత్ దెబ్బకు పాకిస్తాన్ దివాళా తీసింది.. ఇవే సాక్ష్యాలు

ఒక దేశంపై ప్రత్యక్షంగా యుద్ధం చేయకుండానే.. కేవలం వాణిజ్య పరమైన వ్యూహాలతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ నడుం విరిచేయవచ్చా? అంటే భారత్-పాకిస్తాన్ మధ్య గత కొన్నేళ్లుగా జరుగుతున్న పరిణామాలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం.

By:  A.N.Kumar   |   2 Nov 2026 11:54 PM IST
భారత్ దెబ్బకు పాకిస్తాన్ దివాళా తీసింది.. ఇవే సాక్ష్యాలు
X

ఒక దేశంపై ప్రత్యక్షంగా యుద్ధం చేయకుండానే.. కేవలం వాణిజ్య పరమైన వ్యూహాలతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ నడుం విరిచేయవచ్చా? అంటే భారత్-పాకిస్తాన్ మధ్య గత కొన్నేళ్లుగా జరుగుతున్న పరిణామాలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. 2019 పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌కు భారత్ ఇచ్చిన 'మోస్ట్ ఫేవర్డ్ నేషన్' హోదాను రద్దు చేయడమే కాకుండా వాణిజ్య సంబంధాలను నిలిపివేసింది. భారత్ తీసుకున్న ఈ ఒక్క నిర్ణయం పాకిస్తాన్ పరిశ్రమలను.. అక్కడి ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బ తీసింది.

భారత్‌తో వాణిజ్యం నిలిచిపోవడం వల్ల గడచిన ఐదారేళ్లలో పాకిస్తాన్ సుమారు 40 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.3.50 లక్షల కోట్లు మేర వ్యాపార నష్టాన్ని చవిచూసిందని పాకిస్తాన్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ (పీఐబీసీ) ఛైర్మన్ నూర్ మహ్మద్ కసూరి స్వయంగా వెల్లడించారు. భౌగోళికంగా పక్కనే ఉన్న అతిపెద్ద మార్కెట్ నుంచి దిగుమతులు బంద్ కావడంతో పాక్ కంపెనీలు ఇప్పుడు అమెరికా, బ్రెజిల్, ఈజిప్ట్, చైనా వంటి దూరపు దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఫలితంగా రవాణా ఖర్చులు, కొనుగోలు వ్యయం విపరీతంగా పెరిగిపోయి ఉత్పత్తి వ్యయం ఆకాశాన్ని తాకుతోంది.

పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక లాంటి వస్త్ర పరిశ్రమ ప్రస్తుతం పత్తి దిగుమతుల కోసం ఇతర దేశాలపై ఆధారపడి ఏటా అదనంగా 5 బిలియన్ డాలర్ల భారాన్ని మోస్తోంది. అలాగే ఫార్మా రంగం భారత్ నుంచి ముడిసరుకులు దిగుమతి చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతోంది. భారత్‌తో వాణిజ్యం పునరుద్ధరింపబడితే తమ ఫార్మా పరిశ్రమకే ఏటా 2 నుంచి 3 బిలియన్ డాలర్ల వరకు ఆదా అవుతుందని పాక్ వ్యాపార వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. పత్తి, మందులే కాకుండా పెట్రోలియం, ఎరువులు, సిమెంట్, ఇనుము, కూరగాయల దిగుమతులపై కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

ఇప్పటికే విదేశీ అప్పులు, ద్రవ్యోల్బణం, కరెన్సీ క్షీణతతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌కు.. భారత్‌తో శత్రుత్వం వల్ల మరింత ఆర్థిక భారం తోడైంది. తీవ్రవాదానికి ఊతమిస్తూ పొరుగు దేశంతో వైరం పెంచుకుంటే చెల్లించాల్సిన మూల్యం ఎంతటి భయానకంగా ఉంటుందో పాకిస్తాన్ అనుభవపూర్వకంగా తెలుసుకుంటోంది. రాజకీయ ప్రయోజనాల కోసం స్వదేశీ ఆర్థిక ప్రయోజనాలను బలిపెట్టిన పాకిస్తాన్ పాలకులు.. ఇప్పటికైనా సరిహద్దు ఉగ్రవాదాన్ని వీడి దౌత్యపరమైన.. వాణిజ్యపరమైన పురోగతి వైపు అడుగులు వేస్తారో లేదో కాలమే నిర్ణయించాలి.