భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో నవంబర్ 20న బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.5,120 తగ్గి రూ.1,25,570కి, 22 క్యారెట్ల బంగారం రూ.4,700 తగ్గి రూ.1,15,100కి చేరింది. కిలో వెండి ధర రూ.5,000 తగ్గి రూ.1,75,000గా నమోదైంది. ధరలు మరింత తగ్గవచ్చన్న అంచనాలతో కొనుగోలుదారులు వేచి చూస్తున్నారు.
By: Madhu Reddy | 20 Nov 2026 12:13 PM ISTప్రత్యేకించి భారతదేశంలో బంగారం, వెండి లోపాలకు ప్రజలు పెద్ద ఎత్తున ప్రాముఖ్యతను ఇస్తున్న విషయం తెలిసిందే. బిడ్డ పుట్టిన వేళ అయినా పెళ్లీడు సమయమైనా ఏదైనా సరే శుభకార్యం జరిగింది అంటే కచ్చితంగా బంగారం లేదా వెండి వస్తువులను కొనుగోలు చేయాల్సిందే. గత కొన్ని శతాబ్దాలుగా ఇది ఆనవాయితీగా వస్తోంది అనే కామెంట్లు మన పెద్దల నుంచి ఎప్పటికప్పుడు వినిపిస్తూ ఉంటాయి. అయితే ప్రతి ఒక్కరూ తమ స్థాయికి తగ్గట్టుగా కొనుగోలు చేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి అంటే కట్న కానుకల కింద బంగారం తప్పనిసరి అయిపోయింది. అయితే ఇలాంటి బంగారం కొనుగోలు చేయాలి అంటే గత కొన్ని నెలలుగా సామాన్య ప్రజలను మొదలుకొని ధనవంతులు కూడా వెనకడుగు వేశారు. కారణం 10 గ్రాముల బంగారం ఏకంగా లక్షన్నర దాటడమే.
ఒకప్పుడు 30,000 కూడా దాటని ఈ 10 గ్రాముల బంగారం ధర విలువ అమాంతంగా ఈ రేంజ్ కు పెరిగిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అసలు బంగారం కొంటామా భవిష్యత్తులో అనే భయం కూడా చుట్టుకుంది అనే కామెంట్లు వ్యక్తం అయ్యాయి. అయితే ఎప్పుడైతే భారత ప్రధాని నరేంద్ర మోడీ కొంతకాలం బంగారం కొనడం ఆపేయండి అని సలహా ఇచ్చారో..అప్పటినుంచి దాదాపు బంగారం కొనుగోళ్లు తగ్గించారనే చెప్పాలి. అయితే ఇప్పుడు సడన్గా గత రెండు వారాలుగా గమనించుకున్నట్లయితే బంగారం ధరలు భారీగా పతనమవుతుండడం సామాన్య ప్రజలకు కూడా భారీ ఊరటను కలిగిస్తోంది.
అటు బంగారంతో పాటు వెండి ధరలు కూడా క్రమంగా తగ్గుతూ రావడం హర్షదాయకం. ఇకపోతే నవంబర్ 20న బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయానికి వస్తే.. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి . 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.5,120 తగ్గి రూ.1,25,570 కి చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల ఆభరణాల బంగారంపై ఏకంగా రూ.4,700 తగ్గి రూ.1,15,100 కి చేరుకుంది.
అటు వెండి ధరల విషయానికి వస్తే.. సుమారుగా రెండున్నర లక్షకు పైగా కేజీ వెండి ధర వెళ్ళగా.. ఇప్పుడు ఆ వెండి ధరలు దాదాపుగా పడిపోయాయి. నిన్న ఒక్కరోజే ఏకంగా రూ.5000 తగ్గి కేజీ వెండి విలువ రూ.1,75,000 కి చేరుకుంది. అయితే ప్రాంతాలను బట్టి ఈ ధరలలో స్వల్ప తేడాలు కూడా ఉండొచ్చు. పైగా ఈ ధరలపై మూడు శాతం అదనపు జిఎస్టి కూడా పడుతుంది అని కొనుగోలుదారులు గమనించాలి.
మరి బంగారం తగ్గుతున్న వేళ కొనడానికి ఇది సరైన సమయమా అంటే ఇంకా కొంచెం ఆగాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు అంచనాలు అలాగే అమెరికన్ డాలర్ బలపడుతున్న నేపథ్యంలోనే బంగారం ధరలు తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బంగారం పై ఎలాంటి స్థిర వడ్డీ రాదు కాబట్టి అమెరికా ప్రభుత్వ బ్రాండ్లపై రాబడి పెరుగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు కూడా బంగారాన్ని అమ్మి బ్రాండ్లలో పెట్టుబడి పెడుతున్నారు. అంతేకాదు ఇటు భూములపై కూడా ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్న నేపథ్యంలోనే ఈ బంగారు ధరలు తగ్గుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఏది ఏమైనా ధరలు వేగంగా పడిపోతుండడంతో ఇంకా తగ్గుతాయేమో అనే ఆలోచనతో అటు వ్యాపారులు ఇటు వినియోగదారులు కొనుగోళ్లను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు సమాచారం.
