Begin typing your search above and press return to search.

ప్రపంచాన్ని అప్పు ట్రాప్ లో పడేస్తున్న చైనా

ప్రపంచానికి పెద్దన్న అమెరికా మొదలు సంపన్న యూరోపియనే దేశాలు మాత్రమే కాదు.. ప్రపంచంలోని 80 దేశాలు డ్రాగన్ రుణవలయంలోకి చిక్కుకున్న విషయం వెలుగు చూసింది.

By:  Garuda Media   |   28 Nov 2025 1:00 PM IST
ప్రపంచాన్ని అప్పు ట్రాప్ లో పడేస్తున్న చైనా
X

ప్రపంచానికి పెద్దన్న అమెరికా మొదలు సంపన్న యూరోపియనే దేశాలు మాత్రమే కాదు.. ప్రపంచంలోని 80 దేశాలు డ్రాగన్ రుణవలయంలోకి చిక్కుకున్న విషయం వెలుగు చూసింది. ప్రపంచంలోని దాదాపు 80 శాతం దేశాల్లోని కంపెనీలకు చైనా బ్యాంకులు భారీస్థాయిలో అప్పులు ఇవ్వటం.. వాటిని అడ్డు పెట్టుకొని ఆ కంపెనీలను.. ఆయా దేశాల్ని చైనా ప్రభావితం చేస్తున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అమెరికాలోని విలియం అండ్ మేరీ కాలేజీకి చెందిన రీసెర్చ్ విభాగం ఎయిడ్ డేటా పేరుతో తాజాగా విడుదల చేసిన నివేదిక షాకింగ్ అంశాల్ని వెల్లడించింది.

సుమారు మూడేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ ఆర్థిక సంస్థలు.. ఇతర మార్గాల ద్వారా సేకరించిన సమాచారంతో ఈ రిపోర్టును తయారు చేశారు. 2000 నుంచి 2023 వరకు అంటే 23 ఏళ్లలో చైనా ప్రపంచంలోని దేశాలకు ఏ మేరకు రుణాన్ని ఇచ్చింది.. అందులోని అంశాల్ని ఈ రిపోర్టులో పేర్కొన్నారు. చైనా నుంచి భారీ స్థాయిలో అప్పులు తీసుకున్న టాప్ దేశాల జాబితా తెలిస్తే ఆశ్చర్యంతో నోట మాట రాదంతే. ప్రపంచానికి పెద్దన్నలా వ్యవహరించే అమెరికా.. చైనా నుంచి అప్పు తీసుకున్న దేశాల్లో మొదటిస్థానంలో ఉండటం గమనార్హం. ఆ తర్వాతి దేశాల్లో రష్యా.. ఆస్ట్రేలియా.. వెనెజువెలా.. పాకిస్థాన్ దేశాలు ఉన్నాయి.

చైనా మొదట్లో పేద.. డెవలప్ అవుతున్న దేశాలకు భారీగా రుణాల్ని ఇచ్చేది. ఆయా దేశాలు.. అక్కడి వనరులపై పెత్తనం చెలాంయించేది. 2000 నుంచి మాత్రం తన వ్యూహాన్ని మార్చుకుంది. దాని ఫోకస్ మొత్తం సంపన్న దేశాలు.. స్పీడ్ గా డెవలప్ అవుతున్న దేశాలకు రుణాల్ని పెంచుకుంటూ వచ్చింది. మొదట్లో పేద.. మధ్య ఆదాయ దేశాలకు 90 శాతం రుణాలు ఇవ్వగా.. ఇప్పుడు 75 శాతానికి పైగా ఆ దేశం ఇచ్చే రుణాలన్నీ సంపన్న దేశాలకు.. పెద్ద దేశాలకే ఇవ్వటం గమనార్హం.

ఇలా అప్పులు ఇచ్చి.. ఆయా దేశాల్లోని సంస్థలు.. వాటి ద్వారా ఆ దేశాలను తమకు అనుకూలంగా వ్యవహరించేలా చేయటం.. తమపై ఎలాంటి చర్యలు చేపట్టలేని విధంగా చైనా ప్లాన్ చేసింది. అగ్రరాజ్యం అమెరికా సంగతే తీసుకుంటే అమెరికాలోని 2500 సంస్థలు.. ప్రాజెక్టులకు చైనా రూ.18.1 లక్షల కోట్ల రుణాల్ని ఇచ్చింది. 27 యూరోపియన్ దేశాల కూటమికి చెందిన 1800 కంపెనీలు.. ప్రాజెక్టులకు రూ.14.4 లక్షల కోట్లు అప్పులు ఇవ్వగా.. ఈ రుణాల్లో 95 శాతానికి పైగా చైనా ప్రభుత్వ బ్యాంకులు.. ఆర్థిక సంస్థలు ఇచ్చినవే కావటం గమనార్హం.

చైనా ప్రభుత్వ బ్యాంకులు. . ఆర్థిక సంస్థలు ఇస్తున్న రుణాల్ని గమనిస్తే.. ఆయా దేశాల్లోని మౌలిక వసతులు.. సెమీ కండక్టర్ తయారీ టెక్ కంపెనీలు.. అరుదైన ఖనిజాలకు సంబందించిన కంపెనీలు.. ప్రాజెక్టులకే అందటం గమనార్హం. ఇందుకోసం షెల్ కంపెనీలు. అంతర్జాతీయ బ్యాంక్ సిండికేట్లను చైనా వాడుతున్న విషయాన్ని రిపోర్టు వెల్లడించింది.ఆయా కంపెనీల్లో వాటాలు పెంచుకోవటం.. లేదంటే వాటిని సొంతం చేసుకోవటం ద్వారా సంపన్న దేశాల్లోని కీలక రంగాలపై చైనా పట్టు సాధిస్తున్న వైనాన్ని కళ్లకు కట్టినట్లుగా తెలిపింది.

ప్రపంచంలో గుర్తింపు ఉన్న 217 దేశాలకు 179 దేశాలకు చైనా ప్రభుత్వ ఆర్థిక స ంస్థలు 196 లక్షల కోట్ల రూపాయిల రుణాల్ని ఇవ్వటం గమనార్హం. మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. అప్పులు ఇవ్వటమే కాదు భారీగా తిరిగి వసూలు చేస్తున్న దేశం కూడా చైనానే కావటం గమనార్హం. చైనా నుంచి భారత కంపెనీలకు అందిన రూ.1.6లక్షల కోట్ల రుణాల్లో చాలా వరకు విద్యుత్.. ఆర్థిక రంగాల్లోని కంపెనీలకే అందినట్లుగా రిపోర్టు వెల్లడించింది.