ప్రపంచ క్రిప్టోకరెన్సీ మార్కెట్లలో పెను తుఫాను
ఈ భారీ పతనానికి మూలకారణం అమెరికా ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన తాజా ఉద్యోగాల డేటా అని మార్కెట్ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. సెప్టెంబర్ నెలలో నిరుద్యోగం ఊహించిన దాని కంటే ఎక్కువగా నమోదైంది.
By: A.N.Kumar | 23 Nov 2025 11:14 AM ISTప్రపంచ క్రిప్టోకరెన్సీ మార్కెట్లలో పెను తుఫాను చెలరేగింది. అమెరికా ఆర్థిక వ్యవస్థపై నెలకొన్న తీవ్ర అనిశ్చితి కారణంగా క్రిప్టో మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూశాయి. ఈ ప్రభావంతో ప్రపంచంలోనే అత్యంత విలువైన డిజిటల్ ఆస్తి బిట్‌కాయిన్ ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత అత్యంత కనిష్ట స్థాయికి చేరుకుంది. పెట్టుబడిదారులు సేఫ్ హేవెన్ ఆస్తులపై దృష్టి సారిస్తూ ప్రమాదకర ఆస్తులైన క్రిప్టో నుంచి మూలధనాన్ని ఒక్కసారిగా వెనక్కి తీసుకోవడంతో మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి అనూహ్యంగా పెరిగింది.
బిట్‌కాయిన్, ఈథర్‌లకు భారీ నష్టం
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌లో క్రిప్టో మార్కెట్లలో 'బ్లాక్ ఫ్రైడే' వాతావరణం కనిపించింది. ప్రముఖ డిజిటల్ ఆస్తులైన బిట్‌కాయిన్, ఈథర్‌తో సహా దాదాపు అన్ని ఆల్ట్‌కాయిన్లు కిందకు జారాయి. బిట్‌కాయిన్ 7.18% పడిపోయి 85,966 డాలర్లకు చేరింది. శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌లో బిట్‌కాయిన్ తీవ్ర పతనాన్ని చవిచూసింది. బిట్ కాయిన్ ధర $85,966.75 డాలర్లకు చేరింది. దాదాపు 7.18% పతనమైంది. మార్కెట్ విలువ $1.71 ట్రిలియన్ కు చేరింది. 24 గంటల వాల్యూం $94 బిలియన్ లకు చేరింది.
తాజా పతనంతో బిట్‌కాయిన్ 2025లో సాధించిన ఎక్కువ శాతం లాభాలు ఒక్క వారంలోనే ఆవిరైపోయాయి. అలాగే రెండో అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన ఈథర్ ఆగస్టు నెలలో నమోదైన తన గరిష్ట స్థాయి నుంచి దాదాపు 40% క్షీణించింది.
పతనానికి ప్రధాన కారణం: ఫెడ్ వడ్డీ రేట్లపై అనుమానం
ఈ భారీ పతనానికి మూలకారణం అమెరికా ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన తాజా ఉద్యోగాల డేటా అని మార్కెట్ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. సెప్టెంబర్ నెలలో నిరుద్యోగం ఊహించిన దాని కంటే ఎక్కువగా నమోదైంది. ఈ ప్రతికూల డేటా పెట్టుబడిదారులను కలవరపెట్టింది. నిరుద్యోగం పెరగడంతో, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ త్వరలో వడ్డీ రేట్లలో కోత విధిస్తుందనే నమ్మకం సన్నగిల్లింది. వడ్డీ రేట్లు అధికంగా ఉంటే, రుణ ఖర్చులు పెరిగి క్రిప్టో లాంటి ప్రమాదకర ఆస్తులపై పెట్టుబడి తగ్గుతుంది. దీని ఫలితంగా, ఇన్వెస్టర్లు క్రిప్టో వంటి 'రిస్క్-ఆన్' ఆస్తుల నుంచి డబ్బును వెనక్కి తీసుకుని, బంగారం లేదా అమెరికా డాలర్ వంటి 'సేఫ్ హేవెన్' (సురక్షితమైన) ఆస్తులలో పెట్టుబడి పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. వారం మొత్తం ఒత్తిడిని ఎదుర్కొన్న బిట్‌కాయిన్ మంగళవారం తొలిసారిగా $90,000 మార్కు దిగువకు పడిపోయింది. తాజా పతనం మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత బలహీనం చేసింది.
అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు కొనసాగుతున్నంత కాలం క్రిప్టో మార్కెట్‌లో ఈ ఒడిదుడుకులు కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. బిట్‌కాయిన్ , ఈథర్ వంటి ప్రముఖ కాయిన్లు కూడా భారీగా నష్టపోతుండటంతో పెట్టుబడిదారులు అత్యంత జాగ్రత్తతో తమ పెట్టుబడులను నిర్వహిస్తున్నారు. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ముందు మార్కెట్ స్థిరీకరణ కోసం వేచి చూడాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.
