దలాల్ చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఆఫరింగ్ కు జియో
భారీతనానికి కేరాఫ్ అడ్రస్ గా కొందరు నిలుస్తుంటారు. అందుకు దేశీయ కుబేరుడు ముకేశ్ అంబానీ ఒకరుగా చెప్పాలి.
By: Garuda Media | 31 July 2025 9:55 AM ISTభారీతనానికి కేరాఫ్ అడ్రస్ గా కొందరు నిలుస్తుంటారు. అందుకు దేశీయ కుబేరుడు ముకేశ్ అంబానీ ఒకరుగా చెప్పాలి. ఏం చేసినా.. బాక్సులు బద్ధలయ్యేట్లుగా ఆయన తీరు ఉంటుంది. తాను అడుగు పెట్టే రంగంలో తమ ముద్ర కొట్టొచ్చినట్లుగా కనిపించాలన్న తపన కనిపిస్తూ ఉంటుంది. ఊహించని రీతిలో నిర్ణయాలు తీసుకోవటంలో ఆయనకున్న టాలెంటే వేరు. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం ఈ కోవకు చెందింది.
దలాల్ చరిత్రలోనే ఇప్పటివరకు ఎప్పుడూ లేనట్టుగా.. అతి పెద్ద పబ్లిక్ ఆఫరింగ్ కు రిలయన్స్ జియో సిద్ధమవుతోంది. ఈ సంస్థకు చెందిన ఐదు శాతం వాటాను అమ్మకానికి సిద్ధం చేస్తోంది. దీని ద్వారా 600కోట్ల డాలర్లు.. మన రూపాయిల్లో దగ్గర దగ్గర రూ.52,200 కోట్లకు సమానంగా చెప్పాలి. ముకేశ్ అంబానీకి చెందిన టెలికాం సంస్థ అయిన రిలయన్స్ జియో సహా అన్ని డిజిటల్ సేవల విభాగంగా వ్యవహరించే జియో ఇన్ఫోకామ్ కు చెందిన ఐదు వాతం వాటాను పబ్లిక్ ఆఫరింగ్ పేరుతో అమ్మనున్నట్లుగా ప్రఖ్యాత బ్లూంబర్గ్ కథనం వెల్లడించింది
ప్రస్తుతం మార్కెట్ చరిత్రలోనే అతి పెద్దదిగా చెబుతున్న హ్యుండయ్ ఐపీఓ (రూ.28వేల కోట్లు) తో పోలిస్తే జియో దాదాపు రెండింతలు అధిక నిధులు సమీకరిస్తున్నట్లుగా చెప్పాలి. ఈ పబ్లిక్ ఇష్యూ వచ్చే ఏడాదిలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ అంశంపై ఆగస్టులో రిలయన్స్ నిర్వహించే వాటాదారుల వార్షిక సమావేశంలో ఈ అంశంపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు.
2020లో జియో ఇన్ఫోకామ్ లో మెటా ప్లాట్ ఫామ్స్.. గూగుల్ వంటి అమెరికా టెక్ దిగ్గజాలు పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. ఐపీఓ అనంతరం ఈ సంస్థలు తమ వాటాను కొంతమేర ఉపసంహరించుకునే వీలుందని చెబుతున్నారు. మెటా.. గూగుల్ పెట్టబడులు పెట్టిన వేళతో పోలిస్తే ఇప్పుడు జియో మార్కెట్ విలువ రెట్టింపు అయినట్లుగా చెప్పాలి. కరోనాటైంలో ఈ సంస్థలు పెట్టిన పెట్టుబడుల విలువ 5800 కోట్ల డాలర్ల స్థాయిలో ఉంటే..ఇప్పుడది 10వేల కోట్ల డాలర్ల స్థాయికి చేరుకున్నట్లుగా చెప్పాలి. మొత్తంగా మరో హిస్టరీ క్రియేట్ చేసే దిశగా అంబానీ అడుగులు వేస్తున్నట్లుగా చెప్పాలి.
