ప్రమాదవశాత్తూ కాదు హత్యే.. గాయకుడి మృతిపై రిమాండ్ రిపోర్ట్
ప్రముఖ అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ ఆకస్మిక మరణం అభిమాన లోకాన్ని నివ్వెరపోయేలా చేసింది. ఆయన 55 వయసులోను ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు.
By: Sivaji Kontham | 4 Oct 2025 12:00 PM ISTప్రముఖ అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ ఆకస్మిక మరణం అభిమాన లోకాన్ని నివ్వెరపోయేలా చేసింది. ఆయన 55 వయసులోను ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. అతడు ఈతకు వెళ్లేంత ఆరోగ్యంగా ఉన్నాడు. కానీ సింగపూర్ యాచ్ పార్టీలో ఈత కోసం వెళ్లి శవమై నీళ్లలో తేలాడు. అయితే అతడి మృతిపై తొలి నుంచి అనుమానాలు వ్యక్తమయ్యాయి. జుబీన్ నీళ్లలోకి ఈత కోసం వెళ్లాడు.. కానీ తిరిగి రాని లోకాలకు వెళ్లాడు. పైగా లైఫ్ జాకెట్ కూడా అతడికి ఉంది. కానీ అతడు ఎలా శవమయ్యాడు? అనే ప్రశ్నలు ఉదయించాయి.
అయితే ఈ వ్యవహారంలో ఇప్పటికే ప్రత్యేక అధికారుల బృందం (సిట్) దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే. వరుసగా నాలుగు అరెస్టులు సంచలనంగా మారాయి. ఈ అరెస్టుల్లో జుబీన్ గార్గ్ కి అత్యంత సన్నిహితులైన గోస్వామి, మహంత కూడా ఉన్నారు. తాజాగా పోలీసుల రిమాండ్ లో అసలు నిజాలు నిగ్గు తేల్చారని కథనాలొస్తున్నాయి.
జుబీన్ ప్రమాదవశాత్తూ మరణించలేదు. అతడిని హత్య చేసారని జుబీన్ కి అత్యంత సన్నిహితుడైన శేఖర్ జ్యోతి గోస్వామి రిమాండ్ లో వివరించినట్టు జాతీయ మీడియాలో కథనాలొస్తున్నాయి. మేనేజర్ సిద్ధార్థ్ శర్మ, ఈవెంట్ ఆర్గనైజర్ శ్యామ్ కను మహంత విషమిచ్చి హత్య చేసారని గోస్వామి వెల్లడించారని తెలుస్తోంది. యాక్సిడెంట్ అని భ్రమింపజేసేందుకు విదేశీ లొకేషన్ ని ఎంచుకున్నారని కూడా అతడు వ్యాఖ్యానించినట్టు సమాచారం. అయితే దీనిని పోలీసులు సిట్ బృందాలు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.
జుబీన్ గార్గ్ మరణించిన తర్వాత అతడిని సింగపూర్ నుంచి భారతదేశానికి తీసుకుని వచ్చారు. అటుపై దిల్లీ నుంచి వాహనంలో అతడి స్వస్థలం గౌహతికి తరలించి అంత్యక్రియలు పూర్తి చేసిన సంగతి తెలిసిందే. అతడి అంత్య క్రియలకు వేలాదిగా ప్రజలు తరలి రావడం తెలిసిందే.
