Begin typing your search above and press return to search.

మైఖేల్ జాక్స‌న్ త‌ర్వాత భార‌తీయ గాయ‌కుడి రికార్డ్!

ఊక వేస్తే రాల‌నంత మంది.. ఎటు చూసినా జ‌న సందోహ‌మే. అంతిమ యాత్ర‌లో గుమిగూడిన ప్ర‌జ‌ల‌ను చూసి ఆకాశంలో చుక్కలు కూడా నివ్వెర‌పోయాయి

By:  Sivaji Kontham   |   23 Sept 2025 7:11 PM IST
మైఖేల్ జాక్స‌న్ త‌ర్వాత భార‌తీయ గాయ‌కుడి రికార్డ్!
X

ఊక వేస్తే రాల‌నంత మంది.. ఎటు చూసినా జ‌న సందోహ‌మే. అంతిమ యాత్ర‌లో గుమిగూడిన ప్ర‌జ‌ల‌ను చూసి ఆకాశంలో చుక్కలు కూడా నివ్వెర‌పోయాయి. ప్ర‌పంచంలోనే ఇది అరుదైన రికార్డ్. అందుకే అస్సామీ గాయ‌కుడు జుబీన్ అంతిమ‌యాత్ర‌ను `లిమ్కా బుక్స్ ఆఫ్ రికార్డ్స్` స‌ముచితంగా గౌర‌వించింది. ప్రపంచంలోనే నాలుగో అత్యంత భారీ ప‌బ్లిక్ గేద‌రింగ్ గా దీనిని రికార్డుల‌కెక్కించారు.

పాప్ గాయ‌కుడు మైఖేష్ జాక్సన్, పోప్ ఫ్రాన్సిస్, క్వీన్ ఎలిజ‌బెత్ 2 త‌ర్వాత అస్సామీ గాయ‌కుడు జుబీన్ గార్గ్ కి మాత్ర‌మే ఈ గౌర‌వం ద‌క్కింది. ఈనెల 23న జుబీన్ గార్గ్‌ను గౌహతి సమీపంలోని కమర్కుచి గ్రామంలో పూర్తి ప్రభుత్వ గౌరవాలతో దహన కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. ఈ భావోద్వేగ వీడ్కోలు కార్యక్రమంలో లక్షలాది మంది అభిమానులు, ప్రముఖులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. సాంప్రదాయ అస్సామీ గామోసాలో అలంకరించిన‌ చల్లని గాజు శవపేటికలో జుబీన్ భౌతికకాయాన్ని ఉంచారు. అర్జున్ భోగేశ్వర్ బారువా స్పోర్ట్స్ కాంప్లెక్స్ నుండి పూలతో అలంకరించబడిన అంబులెన్స్‌లో తీసుకువెళ్లారు. రెండు రోజుల పాటు గాయ‌కుడికి నివాళులర్పించడానికి అభిమానులు అక్క‌డ‌ గుమిగూడారు.

జుబీన్ పాడిన పాట `మాయాబిని..`ని పాడుతుండగా అతని సోదరి పాల్మీ బోర్తాకూర్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతిమ యాత్ర లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్ర‌జ‌ల‌ ప్రగాఢ సానుభూతిని గుర్తించింది. అంత్య‌క్రియ‌ల ఊరేగింపు జ‌న‌ప్ర‌వాహంతో సాగింది. గౌహతి చరిత్రలో అతిపెద్ద ప్రజా అంత్యక్రియలలో ఒకటిగా నిలిచింది. నగర వీధులు దుఃఖిస్తున్న అభిమానులతో నిండిపోయాయి.

జుబీన్ గార్గ్ కేవలం గాయకుడు మాత్ర‌మే కాదు.. అత‌డు సామాజిక క‌ర్త‌. ప్ర‌జ‌ల‌ను క‌ష్టంలో ఆదుకున్న మాన‌వ‌తావాది. అందుకే ప్ర‌జ‌లు ఇంత‌గా అత‌డిని ఆరాధిస్తున్నారు. ఒక గాయ‌కుడిగా, `కింగ్ ఆఫ్ హమ్మింగ్` గా అత‌డు పాపులర్. అస్సామీ సంగీతానికి జాతీయ ప్రాముఖ్యతకు తీసుకువచ్చిన ఘ‌నుడు అత‌డు. `గ్యాంగ్‌స్టర్‌`లోని `యా అలీ` వంటి హిట్ పాట‌ల‌తో బాలీవుడ్‌లోను పాపుల‌ర‌య్యాడు.

సెప్టెంబర్ 19న సింగపూర్‌లో స్కూబా డైవింగ్ ప్రమాదంలో మ‌ర‌ణించాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ దీనిని సంబంధిత వ‌ర్గాలు ఖండించాయి. ఒక క్రూయిజ్ షిప్ ప్ర‌యాణంలో జ‌రిగిన ప్ర‌మాదంలో గాయ‌ప‌డ‌గా ఆస్ప‌త్రికి త‌ర‌లించాక మ‌ర‌ణించాడ‌ని క‌థ‌నాలొచ్చాయి. జుబీన్ సంగీతం గానం అస్సామీల‌ త‌ర‌త‌రాల‌కు వార‌స‌త్వ‌పు ఆస్తి. అది ఎప్ప‌టికీ అంతం లేని ప్ర‌వాహం లాంటిది.