గాయకుడి అనుమానాస్పద మృతి.. ప్లాన్ ప్రకారమా? ప్రమాదమా?
ప్రముఖ అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ మరణానికి సంబంధించిన కేసులో తాజాగా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
By: Sivaji Kontham | 15 Jan 2026 12:42 PM ISTప్రముఖ అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ మరణానికి సంబంధించిన కేసులో తాజాగా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ కేసులో సింగపూర్ పోలీసులు, భారత దర్యాప్తు సంస్థల (SIT) నివేదికల మధ్య భారీ వ్యత్యాసాలు ఉన్నాయి.
సింగపూర్ పోలీసులు ప్రమాదవశాత్తు జరిగిన మరణం! అని తమ రిపోర్టులో ధృవీకరించారు. జనవరి 14న సింగపూర్ పోలీసులు అక్కడి కోర్టుకు సమర్పించిన రిపోర్ట్ ప్రకారం.. జుబీన్ గార్గ్ 19 సెప్టెంబర్ 2025న సింగపూర్‌లోని లాజరస్ ఐలాండ్ వద్ద సముద్రంలో ఈత కొడుతూ ప్రమాదవశాత్తు మునిగిపోయారు. ఆయన రక్తంలో ఆల్కహాల్ స్థాయి 333 ఎంజీ పర్ 100ఎంఎల్ ఉంది. ఇది సింగపూర్ చట్టబద్ధ పరిమితి కంటే 4 రెట్లు ఎక్కువ. తీవ్రమైన మత్తులో ఉండటం వల్లే ఆయన నియంత్రణ కోల్పోయారని విచారణ జరుపుతున్న పోలీసులు పేర్కొన్నారు.
విహార నౌక సిబ్బంది లైఫ్ జాకెట్ ధరించమని కోరినా, జుబీన్ దానిని నిరాకరించి నీటిలోకి వెళ్లారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. జుబీన్‌కు ఉన్న అధిక రక్తపోటు (బీపీ), మూర్ఛవ్యాధి (ఎపిలెప్సీ) కూడా ఈ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే అస్సాం ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించగా మరోసారి భారత్ వైపు నుంచి విచారణ జరిగింది.
అస్సాం పోలీసులు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) దీనిని హత్యగా పరిగణిస్తోంది. మేనేజర్ సిద్ధార్థ శర్మ, గాయకుడు జుబిన్ కి తెలియకుండా దాదాపు రూ.1.10 కోట్ల నగదును దారి మళ్లించి ఒక వాటర్ ప్లాంట్‌లో పెట్టుబడి పెట్టారని సిట్ ఆరోపిస్తోంది. ఈ విషయం బయటపడుతుందనే భయంతోనే జుబీన్‌ను పథకం ప్రకారం హత్య చేశారని దర్యాప్తులో పేర్కొన్నారు. ఈ కేసులో మేనేజర్ సిద్ధార్థ శర్మతో పాటు మొత్తం ఏడుగురిని (బ్యాండ్‌మేట్స్ , సెక్యూరిటీ సిబ్బంది) అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు.
4 జనవరి 2026న సిద్ధార్థ శర్మకు చెందిన వాటర్ ప్లాంట్ ఆస్తులను జప్తు చేయాలని `సిట్` కోర్టును కోరింది. ప్రస్తుతం ఈ కేసు రెండు భిన్నమైన మలుపుల్లో ఉంది. సింగపూర్ అధికారులు దీనిని ``ప్రమాదవశాత్తూ మరణం`` అని కొట్టిపారేస్తుంటే, భారత ప్రభుత్వం - ఎస్.ఐ.టి (సిట్) దీనిని `ముందస్తుగా ప్లాన్ చేసిన హత్య`గా భావిస్తూ విచారణను వేగవంతం చేశాయి. ఈ కేసులో అరెస్ట్ అయిన వారి వివరాలు లేదా గౌహతి కోర్టులో జరుగుతున్న తదుపరి విచారణ గురించి మరిన్ని వివరాలు రావాల్సి ఉంది. ఇంతలోనే అస్సాం ముఖ్యమంత్రి బిస్వాస్ వ్యాఖ్యలు కలకలం రేపాయి. జుబిన్ ని హత్య చేసినట్టు తాను నమ్ముతున్నానని ఆయన వ్యాఖ్యానించారు. దీనికి సింగపూర్ పోలీస్ స్పందిస్తారో లేదో వేచి చూడాలి.
