Begin typing your search above and press return to search.

గాయకుడి హత్య కేసులో కీలక పరిణామం..!

ప్రముఖ సింగర్‌ జుబీన్‌ గార్గ్‌ ఇటీవల సింగపూర్‌లో మృతి చెందారు. ఆయన మొదట ప్రమాదవశాత్తు చనిపోయినట్లు స్వయంగా ఆయన సన్నిహితులు ప్రకటించారు.

By:  Ramesh Palla   |   7 Oct 2025 5:00 PM IST
గాయకుడి హత్య కేసులో కీలక పరిణామం..!
X

ప్రముఖ సింగర్‌ జుబీన్‌ గార్గ్‌ ఇటీవల సింగపూర్‌లో మృతి చెందారు. ఆయన మొదట ప్రమాదవశాత్తు చనిపోయినట్లు స్వయంగా ఆయన సన్నిహితులు ప్రకటించారు. కానీ పోలీసులు లోతుగా ఎంక్వౌరీ చేస్తున్నా కొద్ది విషయాలు తెలుస్తున్నాయి. స్కూబా డైవింగ్‌ చేస్తున్న సమయంలో జుబీన్‌ మృతి చెందినట్లుగా మొదట వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన టూరిస్ట్‌ షిప్‌ లో ప్రమాదానికి గురయ్యాడని, ఆ ప్రమాదంలో తీవ్ర గాయాలు అయ్యాయని, ఆసుపత్రికి తరలించిన తర్వాత మృతి చెందాడు అంటూ చివరకు ప్రకటన వచ్చింది. ప్రమాద సమయంలో ఆయన మేనేజర్‌ పక్కనే ఉన్నాడని, అతడి ప్రవర్తన, అతడు చెబుతున్న విషయాలు చాలా అనుమానాస్పదంగా ఉన్నాయి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దాంతో ఈ మొత్తం వ్యవహారంపై ఒక క్లీయర్‌ ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం ఉందని అంతా డిమాండ్‌ చేస్తున్నారు.

హత్య కేసు విచారణకు సిట్‌ ఏర్పాటు

ఇప్పటికే అస్సాం ప్రభుత్వం జుబీన్‌ గార్గ్‌ మృతి విచారణకు సిట్‌ ను నియమించింది. సిట్‌ అధికారులు పలు కోణాల్లో కేసును విచారిస్తున్నారు. ఆ క్రమంలోనే వారు కీలక విషయాన్ని గుర్తించారు. జుబీన్‌ యొక్క ఇద్దరు సెక్యూరిటీ గార్డ్‌ల బ్యాంక్‌ అకౌంట్స్ లో ఈ మధ్య కాలంలో కోటి రూపాయలకు పైగా లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. సెక్యూరిటీ వారికి అంత డబ్బు ఎక్కడిది అనే కోణంలో పోలీసులు విచారణ మొదలు పెట్టారు. జుబీన్‌ యొక్క మృతి వెనుక ఎవరు ఉన్నారు, ఎవరైనా డబ్బులు ఇచ్చి మరీ హత్య చేయించి ఉంటారా అనే కోణంలో విచారణ మొదలైంది. ప్రస్తుతం ఈ విషయం గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. జుబీన్‌ గార్గ్‌ యొక్క సెక్యూరిటీ సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించే అవకాశాలు ఉన్నాయి. వారిని విచారిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని అంతా భావిస్తున్నారు.

జుబీన్‌ గార్గ్‌ మృతి వెనుక రహస్యాలు

అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు విషయమై సీరియస్‌గా ఉన్నట్లుగా తెలుస్తోంది. సిట్‌ ను వేయడం ద్వారా కేసు విచారణ వేగవంతం అవుతుందని జుబీన్‌ అభిమానులు, సన్నిహితులు నమ్మకంగా ఉన్నారు. స్వయంగా సీఎం బిశ్వశర్మీ ఈ కేసు విషయమై పోలీసు ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు విచారిస్తూ ఉన్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జుబీన్‌ మృతి వెనుక రహస్యం ఉందనే విషయాన్ని ఆయన సన్నిహితులు, ఆయన ఫ్యాన్స్‌ బలంగా నమ్ముతున్నారు. ఇలాంటి సమయంలో ఆయన సెక్యూరిటీ గార్డ్స్ ఖాతాల్లో కోట్ల రూపాయల లావాదేవీలు కనిపించడంతో కేసు కీలక మలుపు తీసుకున్నట్లే అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అతి త్వరలోనే ఈ కేసు ముగింపు దశకు చేరుకుంటుందని అంతా బలంగా నమ్ముతున్నారు.

శేఖర్‌ జ్యోతి గోస్వామి సంచలన ఆరోపణలు

జుబీన్‌ సన్నిహితుడు, బ్యాండ్‌మేట్‌ అయిన శేఖర్ జ్యోతి గోస్వామి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించాడు. ముఖ్యంగా జుబీన్‌ మేనేజర్‌ పై శేఖర్‌ జ్యోతి ఆరోపణలు చేశాడు. జుబీన్‌ ను హత్య చేసి దాన్ని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించాడు. అంతే కాకుండా జుబీన్‌ ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రికి తరలించకుండా సమయం వృదా చేశారని చెప్పుకొచ్చాడు. నోటి నుంచి, ముక్కు నుంచి నురగ వచ్చినప్పటికీ మేనేజర్‌ చాలా నార్మల్‌గానే కనిపించాడు. ఆయన కావాలని చేసిన పని అని బలంగా నమ్ముతున్నట్లు శేఖర్ జ్యోతి అంటున్నాడు. పోలీసులు ఈ దిశగా కూడా విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. మొత్తానికి జుబీన్‌ గార్గ్‌ మృతికి సంబంధించి రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది.