Begin typing your search above and press return to search.

ప్రపంచ సినిమా చరిత్రలోనే నం.1 వసూళ్ల న‌టి

హాలీవుడ్ నటి జో సల్దానా ``ప్రపంచ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల న‌టి``గా సరికొత్త రికార్డు సృష్టించారు.

By:  Sivaji Kontham   |   16 Jan 2026 12:00 AM IST
ప్రపంచ సినిమా చరిత్రలోనే నం.1 వసూళ్ల న‌టి
X

హాలీవుడ్ నటి జో సల్దానా ``ప్రపంచ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల న‌టి``గా సరికొత్త రికార్డు సృష్టించారు. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన `అవతార్: ఫైర్ అండ్ యాష్` బాక్సాఫీస్ వద్ద సాధిస్తున్న భారీ వసూళ్లే ఈ న‌టిని అగ్రస్థానానికి చేర్చాయి. ఈ స‌రికొత్త రికార్డుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

నిజానికి ఇప్పటివరకు ఈ రికార్డు `బ్లాక్ విడో` ఫేం స్కార్లెట్ జోహన్సన్ పేరు మీద ఉండేది. అయితే 14 జనవరి 2026 నాటికి వెల్ల‌డైన‌ లెక్కల ప్రకారం.. జో సల్దానా నటించిన సినిమాల మొత్తం వసూళ్లు 15.47 బిలియన్ డాలర్లను అధిగ‌మించ‌డంతో ఆమె మొదటి స్థానానికి చేరుకున్నారు.

ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ వసూలు చేసిన నాలుగు సినిమాల్లో (అవతార్, అవతార్ 2, అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్, అవెంజర్స్: ఎండ్‌గేమ్) నటించిన ఏకైక నటిగా జో స‌ల్దానా అరుదైన ఘనత సాధించారు. `అవతార్: ఫైర్ అండ్ యాష్` విడుదలైన 4 వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా 1.23 బిలియన్ డాలర్ల మార్కును అధిగ‌మించింది. ఇండియాలో కూడా ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. ఇప్పటివరకు దాదాపు రూ.221 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

నిజానికి జో సల్దానా విజయానికి కారణమైన ఫ్రాంచైజీల గురించి చెప్పుకుంటూ వెళితే.. ఈ ప్ర‌తిభావ‌ని త‌న కెరీర్ లో ఎన్నో విల‌క్ష‌ణ పాత్ర‌ల్లో న‌టించింది. హాలీవుడ్‌లోని మూడు అతిపెద్ద ఫ్రాంచైజీలలో కీలక పాత్రలు పోషించారు జో.

అవ‌తార్ చిత్రంలో నేతిరి పాత్రలో జో స‌ల్ధానా న‌టించారు. మార్వ‌ల్ ఎంసీయు మూవీ `గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ`లో గమోరా పాత్రలో `స్టార్ ట్రెక్ : ఉహురా` పాత్రలోను జో స‌ల్దానా నటించారు.

తాజా విజయం తర్వాత జో సల్దానా చాలా ఎగ్జ‌యిట్ అయ్యారు. సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు, ముఖ్యంగా దర్శకులు జేమ్స్ కామెరూన్, జేజే అబ్రామ్స్, రూసో బ్రదర్స్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక భావోద్వేగమైన వీడియోను షేర్ చేశారు.