కల్ట్ క్లాసిక్ ZNMD సీక్వెల్.. 15 ఏళ్ల తర్వాతా ఆ మ్యాజిక్ రిపీట్?
15 ఏళ్ల క్రితం బాక్సాఫీస్ వద్ద విడుదలైన `జిందగీ నా మిలేగీ దొబారా` ప్రపంచవ్యాప్తంగా రూ. 153 కోట్లకు పైగా వసూలు చేసి అప్పట్లో సరికొత్త రికార్డులను నెలకొల్పింది.
By: Sivaji Kontham | 20 Aug 2026 10:39 PM ISTహిందీ సినీ చరిత్రలో ఫ్రెండ్‌షిప్ - రోడ్ ట్రిప్ నేపథ్యంతో వచ్చిన అత్యుత్తమ చిత్రాలలో `జిందగీ నా మిలేగీ దొబారా` (ZNMD) ఒకటి. జోయా అక్తర్ దర్శకత్వంలో హృతిక్ రోషన్, ఫర్హాన్ అక్తర్, అభయ్ డియోల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన 15 ఏళ్ల తర్వాత కూడా నేటి తరానికి ఒక క్లాసిక్ కల్ట్ ఫేవరెట్‌గా నిలిచింది. జీవితాన్ని ఎలా ఆస్వాధించాలో... స్నేహానికి ఉన్న విలువ ఏంటో అద్భుతంగా ఆవిష్కరించిన ఈ సినిమా సీక్వెల్‌పై తాజాగా వెలువడిన వార్తలు సినీవర్గాల్లోనూ, అభిమానుల్లోనూ తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఈ క్లాసిక్ చిత్రానికి సీక్వెల్ ఉంటుందా లేదా అనే సందేహాలకు దర్శకురాలు జోయా అక్తర్ స్వయంగా తెరదించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ZNMD 2 ప్రాజెక్ట్ గురించి ప్రశ్నించగా ``మేము దానిపై పనిచేస్తున్నాం`` అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అర్జున్, ఇమ్రాన్, కబీర్ పాత్రలు నేటి కాలంలో ఎలా ఉంటాయో.. వారి జీవితాల్లో వచ్చిన మార్పులకు తగిన సరైన కథ దొరికితే ఖచ్చితంగా సీక్వెల్ రూపొందిస్తామని దర్శకురాలు జోయా స్పష్టం చేశారు. సరైన కథ కుదిరితే ఈ క్రేజీ కాంబినేషన్‌ను మళ్లీ తెరపైకి తీసుకురావడం నిజంగా అద్భుతంగా ఉంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇటీవల హృతిక్, ఫర్హాన్ , అభయ్ డియోల్ ముగ్గురూ కలిసి నటించిన ఒక వాణిజ్య ప్రకటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఇది చూసిన అభిమానులు `జిందగీ నా మిలేగీ దొబారా 2` టీజర్ లేదా ట్రైలర్ వచ్చేసిందని భావించి సోషల్ మీడియాలో సందడి చేశారు. అయితే అది కేవలం ఒక ప్రకటన మాత్రమే అని తేలడంతో తీవ్ర నిరాశకు గురైన నెటిజన్లు జోయా అక్తర్ సోషల్ మీడియా అకౌంట్లను మెసేజ్ లతో ముంచెత్తారు. ఈ విషయాన్ని సరదాగా గుర్తుచేసుకున్న జోయా... జనాలు దానిని ట్రైలర్ అనుకుని పొరబడ్డారని నవ్వుతూ చెప్పుకొచ్చారు.
15 ఏళ్ల క్రితం బాక్సాఫీస్ వద్ద విడుదలైన `జిందగీ నా మిలేగీ దొబారా` ప్రపంచవ్యాప్తంగా రూ. 153 కోట్లకు పైగా వసూలు చేసి అప్పట్లో సరికొత్త రికార్డులను నెలకొల్పింది. కేవలం బాక్సాఫీస్ విజయం మాత్రమే కాకుండా బెస్ట్ కొరియోగ్రఫీ.. బెస్ట్ ఆడియోగ్రఫీ విభాగాల్లో నేషనల్ అవార్డులతో పాటు ఎన్నో ప్రసిద్ధ పురస్కారాలను సొంతం చేసుకుంది. స్పెయిన్ రోడ్ ట్రిప్.. బుల్ రన్... స్కై డైవింగ్ వంటి సన్నివేశాలు.. జావేద్ అక్తర్ రాసిన కవితలు ఈ సినిమాను సినీ ప్రియుల హృదయాల్లో శాశ్వతంగా నిలిపివేశాయి.
మానవ సంబంధాలు- ఆధునిక జీవనశైలి - స్నేహం నేపథ్యంలో కథలను తీర్చిదిద్దడంలో జోయా అక్తర్ దిట్ట. `ది అర్చీస్` తర్వాత జోయా చేయబోయే తదుపరి ప్రాజెక్ట్ ఇదేనని ప్రచారం జరుగుతుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అధికారికంగా నటీనటులు, విడుదల తేదీ ప్రకటించకపోయినా.. అర్జున్-ఇమ్రాన్-కబీర్ ల కాంబినేషన్ మళ్లీ ఒక అద్భుతమైన ప్రయాణానికి సిద్ధమైతే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదవ్వడం ఖాయమని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.
