Begin typing your search above and press return to search.

ప్రపంచానికి జీనత్ అమన్ అనే పేరు మాత్రమే తెలుసు...కానీ !

1970- 80ల కాలంలో బోల్డ్ పాత్రలతో బాలీవుడ్‌లో సరికొత్త సంచలనం సృష్టించిన నటి జీనత్ అమన్. `సత్యం శివం సుందరం`, `డాన్`, `హరే రామ హరే కృష్ణ` వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు.

By:  Srikanth Kontham   |   18 Jun 2026 2:19 PM IST
ప్రపంచానికి జీనత్ అమన్ అనే పేరు మాత్రమే తెలుసు...కానీ !
X

1970- 80ల కాలంలో బోల్డ్ పాత్రలతో బాలీవుడ్‌లో సరికొత్త సంచలనం సృష్టించిన నటి జీనత్ అమన్. `సత్యం శివం సుందరం`, `డాన్`, `హరే రామ హరే కృష్ణ` వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. ఎన్నో చిత్రాల్లో న‌టించి న‌టిగా చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో కొన్ని పేజీలు రాసి పెట్టారు. అలాగ‌ని జీన‌త్ ఇంకా రిటైర్మెంట్ తీసుకోలేదు. నేటి డిజిటల్ యుగంలోనూ సోషల్ మీడియా ద్వారా అభిమానుల‌కు ట‌చ్ లో ఉన్నారు. నిజాయితీతో కూడిన ఆలోచనలను పంచుకుంటూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న జీన‌త్ వ్యక్తిగత జీవితం- తనకున్న మరొక పేరు -మతంపై అభిప్రాయాల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ప్రపంచానికి జీనత్ అమన్ అనే పేరు మాత్రమే తెలుసు. అయితే ఓ ప్రైవేట్ కార్యక్రమంలో సన్మాన వేదికపై జీన‌త్ కొన్ని విష‌యాలు రివీల్ చేసారు. తన తండ్రి వైపు నుండి తనకు జీనత్ అమన్ అనే పేరు రాగా.. తన తల్లి వైపు నుండి మరో హిందూ పేరు కూడా ఉందన్నారు. తన తల్లి తనకు పెట్టిన ఆ పేరు లలితేశ్వరి అని తొలిసారి బహిర్గతం చేశారు. ఈ పేరు విన్న జీన‌త్ అభిమానులు -సినీ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. జీనత్ అమన్ తల్లి పేరు వర్ధిని. ఆమె ఎంతో సాంప్రదాయబద్ధమైన హిందూ మహిళ. ప్రతిరోజూ రెండు నుండి మూడు గంటల పాటు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు చేసేవారని జీనత్ గుర్తు చేసుకున్నారు.

తన చిన్నతనం అంతా ఎక్కువగా తల్లి సంరక్షణలోనే గడిచిందని.. ఆమె చూపించిన ప్రేమే తనను ఈ స్థాయికి తీసుకొచ్చింద‌న్నారు. తల్లి అంతటి భక్తురాలైనప్పటికీ జీనత్ మాత్రం నిర్దిష్ట మతానికి ఎందుకు పరిమితం కాలేదనే ఆసక్తికర‌ కారణాన్ని కూడా వివరించారు. తన జీవితంలో భిన్న సంస్కృతులను ఎంతో దగ్గరగా చూశానన్నారు. తన తల్లి హిందూ కాగా, తండ్రి ముస్లిం అని, తన పిల్లల తండ్రి కూడా ముస్లిం మతానికి చెందినవారేనని తెలిపారు. విభిన్న మతాల కలయికతో కూడిన కుటుంబ నేపథ్యం ఉండటం వల్లే మతం పట్ల తన దృక్పథం పూర్తిగా భిన్నంగా మారిందన్నారు.

కుటుంబమే కాదు.. తన విద్యాభ్యాసం ..పెరుగుదల కూడా అంతర్జాతీయ వాతావరణంలో జరిగిందని జీనత్ అమన్ పేర్కొన్నారు. తాను ఒక కాథలిక్ పాఠశాలలో చదువుకున్నానని.. తన పెంపుడు తండ్రి జర్మనీ దేశానికి చెందిన వ్యక్తి కావడంతో చిన్నప్పటి నుంచే తనకు గ్లోబల్ లైఫ్‌స్టైల్ అలవడిందని వివరించారు. ఇన్ని విభిన్న సంస్కృతుల ప్రభావం తనపై ఉండటం వల్ల ఏ ఒక్క మతానికో కట్టుబడి ఉండాల్సిన అవసరం తనకు ఎప్పుడూ కలగలేదన్నారు.

మతం కంటే మానవత్వమే మిన్న అని నమ్మే జీనత్ అమన్.. అన్ని మతాలూ మంచివేనని, ఏ మతమూ తప్పు చేయమని నేర్పదని అభిప్రాయపడ్డారు. మానవత్వం, దయాగుణం, శాంతి, సమానత్వం, మనుషులు , జంతు వులపై ప్రేమ చూపించడమే అసలైన మతమని జీన‌త్ ఉద్ఘాటించారు. వెండితెరపై గ్లామర్ క్వీన్‌గా వెలిగిన ఈ సీనియర్ నటి నిజ జీవితంలో ఇంతటి ప్రగతిశీల ..మానవీయ ఆలోచనలు కలిగి ఉండటం జీన‌త్ వ్యక్తిత్వానికి అద్దం పడుతోంది.