Begin typing your search above and press return to search.

ఏడు భాషల్లో జి5 భారీ కంటెంట్ లైనప్.. ప్రేక్షకులకు కొత్త ట్రీట్

లోకల్ ఆడియన్స్ కు దగ్గరగా ఉండే కథలను చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ లైనప్ ను ప్లాన్ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. దీనికోసం దేశవ్యాప్తంగా ఉన్న పలు అగ్ర నిర్మాణ సంస్థలతో జి5 చేతులు కలిపింది.

By:  M Prashanth   |   29 July 2026 7:09 PM IST
ఏడు భాషల్లో జి5 భారీ కంటెంట్ లైనప్.. ప్రేక్షకులకు కొత్త ట్రీట్
X

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జి5 లేటెస్ట్ గా ఒక భారీ కంటెంట్ లైనప్ ను ప్రకటించింది. ఏకంగా ఏడు వేర్వేరు భాషల్లో ప్రేక్షకులను అలరించేందుకు ప్లాన్స్ సిద్ధం చేసింది. కొత్త తరం ఆడియన్స్ ను దృష్టిలో ఉంచుకుని సిరీస్ లతో పాటు యానిమేషన్, ఏఐ ఆధారిత కంటెంట్ తీసుకురాబోతున్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ భాషల్లో ఈ కంటెంట్ అందుబాటులోకి రానుంది. సినిమాలు మాత్రమే కాకుండా స్పోర్ట్స్, పిల్లల షోలను కూడా ఇందులో మిక్స్ చేశారు.

లోకల్ ఆడియన్స్ కు దగ్గరగా ఉండే కథలను చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ లైనప్ ను ప్లాన్ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. దీనికోసం దేశవ్యాప్తంగా ఉన్న పలు అగ్ర నిర్మాణ సంస్థలతో జి5 చేతులు కలిపింది. మన టాలీవుడ్ విషయానికి వస్తే అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ లాంటి పెద్ద బ్యానర్లతో కలిసి పని చేస్తున్నారు. బాలీవుడ్ నుంచి మడాక్ ఫిల్మ్స్ లాంటి సంస్థలు ఈ లిస్ట్ లో ఉన్నాయి. ప్రాంతీయ కథలను గ్లోబల్ స్థాయిలో ప్రొజెక్ట్ చేయాలనేది వీరి ఆలోచన.

తెలుగు ప్రేక్షకులకు ఆసక్తి కలిగించే ప్రాజెక్టులు ఈ లైనప్ లో చాలానే ఉన్నాయి. సినిమాల విషయానికి వస్తే నందమూరి బాలకృష్ణ NBK 111, వెంకటేష్ అనీల్ రావిపూడి కాంబో మూవీ, వృషకర్మ లాంటి చిత్రాలు ఇందులో ఉన్నాయి. వెబ్ సిరీస్ ల విభాగంలో నివేథా థామస్ ప్రధాన పాత్రలో శ్రీమతి, శ్రీకాంత్ నటించిన అబ్జెక్షన్ మై లార్డ్ లాంటి కొత్త ఒరిజినల్స్ రాబోతున్నాయి. వీటితో పాటు జయమ్ము నిశ్చయమ్మురా అనే ఒక హిట్ టాక్ షోను కూడా తీసుకురానున్నారు.

ఇతర భాషల కంటెంట్ కూడా ఆసక్తికరంగా ఉంది. హిందీలో వరుణ్ ధావన్, పూజా హెగ్డే సినిమాతో పాటు కంగనా రనౌత్, బాబీ డియోల్ ప్రాజెక్టులు డిజిటల్ ప్లాట్ ఫామ్ మీదకు వస్తున్నాయి. తమిళంలో నయనతార సినిమా హై, డీమాంటే కాలనీ 3, కూసే మునిసామి వీరప్పన్ లాంటి సిరీస్ లు ఉన్నాయి. కన్నడలో ఆపరేషన్ బంగార, మలయాళంలో ఏ క్వీన్ లాంటి కథలతో స్థానిక ఆడియన్స్ కు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

వెబ్ సిరీస్ లు, సినిమాలకే పరిమితం కాకుండా జి5 తమ రూట్ ను కాస్త మార్చింది. లైవ్ స్పోర్ట్స్ కేటగిరీలో ఇంటర్నేషనల్ లీగ్ టీ20, బుండెస్లిగా లాంటి టోర్నీలను ప్రసారం చేయనుంది. ఏఐ టెక్నాలజీతో రూపొందించిన విక్రమ్ భేతాల్, తిరుపతి బాలాజీ లాంటి షోలను సిద్ధం చేశారు. పిల్లల కోసం శివలోక్ కె కుండక్క మండక్క, టేల్స్ ఆఫ్ కృష్ణ లాంటి యానిమేషన్ ప్రోగ్రామ్స్ కూడా ఇందులో భాగమయ్యాయి. వినోదానికి సంబంధించిన అన్ని విభాగాలను ఇందులో కవర్ చేశారు.

ఆడియన్స్ అభిరుచులు మారుతున్నాయని, వాళ్లకు తగ్గట్టుగా కొత్త ఫార్మాట్స్ తీసుకురావాలనేది జి5 బిజినెస్ హెడ్ తేజ్‌కరన్ సింగ్ ఆలోచన. కంటెంట్ తో కొత్త ట్రెండ్ సెట్ చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు చీఫ్ కంటెంట్ ఆఫీసర్ రాఘవేంద్ర అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ప్రేక్షకులకు ఎలాంటి వినోదం కావాలో ముందే అంచనా వేసి ఈ భారీ లైనప్ ను ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ కొత్త ప్రణాళికలు మార్కెట్ లో ఏ మేరకు సక్సెస్ అవుతాయో రాబోయే రోజుల్లో స్పష్టంగా తెలుస్తుంది.