Begin typing your search above and press return to search.

రిలయన్స్-డిస్నీపై ZEE సంస్థ‌ 1800 పేజీల‌ న‌ష్టప‌రిహార దావా!

ఇప్పుడు రిల‌య‌న్స్ - డిస్నీల ఉమ్మ‌డి ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ అయిన జియో స్టార్ పై జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ కోర్టులో దావా వేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.

By:  Sivaji Kontham   |   7 May 2026 10:30 AM IST
రిలయన్స్-డిస్నీపై ZEE సంస్థ‌ 1800 పేజీల‌ న‌ష్టప‌రిహార దావా!
X

భార‌తీయ మీడియా, ఎంట‌ర్ టైన్ మెంట్ రంగంలో ఆధిప‌త్యం కోసం రిల‌య‌న్స్, జీ వంటి సంస్థ‌లు ఒక‌దానితో ఒక‌టి పోటీప‌డుతూ కొన్నిసార్లు వివాదాల‌కు తెర‌తీస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. వాస్త‌వానికి రిల‌య‌న్స్ తో జీ ఎంట‌ర్ టైన్ మెంట్ కి చాలా కాలంగా వైరం కొన‌సాగుతోంది. లండ‌న్ లోని ఒక క్రికెట్ టీమ్ లైసెన్సింగ్ విష‌యంలోను వీరి మ‌ధ్య కోర్టు వివాదాలున్నాయి.

ఇప్పుడు రిల‌య‌న్స్ - డిస్నీల ఉమ్మ‌డి ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ అయిన జియో స్టార్ పై జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ కోర్టులో దావా వేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. తాజా ప‌రిణామం చూస్తుంటే.. ఇరు సంస్థ‌ల‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు మారుతున్నాయి. తాజాగా తన మ్యూజిక్ లైబ్రరీలోని పాటలను అనధికారికంగా వాడుకున్నారంటూ రిలయన్స్-డిస్నీ జాయింట్ వెంచర్‌పై జీ సంస్థ కోర్టుకెక్కింది. ఢిల్లీ కోర్టులో దాఖలు చేసిన 1800 పేజీల భారీ దావాలో సుమారు 25 కోట్ల (3 మిలియన్ డాలర్ల ) మేర‌ నష్టపరిహారాన్ని జీ డిమాండ్ చేయడం ఇప్పుడు వినోద ప‌రిశ్ర‌మ‌లో సంచలనంగా మారింది.

ఈ వివాదానికి ప్రధాన కారణం మ్యూజిక్ లైసెన్స్ ఒప్పందాలు ముగిసిపోవడమేన‌ని తెలుస్తోంది. 2024 - 2025లో కొన్ని పాటలకు సంబంధించిన ఒప్పంద గడువు ముగిసినా.. వాణిజ్యపరమైన విభేదాల వల్ల హ‌క్కుల్ని పున‌రుద్ధ‌రించ‌లేదు. అంతేకాదు.. జియో హాట్‌స్టార్ స్ట్రీమింగ్ వేదిక స‌హా కొన్ని టీవీ ఛానళ్లలో తమ పాటలను కనీసం 50 సార్లు అనుమ‌తి లేకుండానే ఉపయోగించారని జీ ఆరోపిస్తోంది. 17 భాషల్లో 19,450 కంటే ఎక్కువ పాటల భారీ కేటలాగ్ కలిగిన తమ మేధో సంపత్తి హక్కులను రిలయన్స్-డిస్నీ ఉల్లంఘించాయ‌ని `జీ` తన పిటిషన్‌లో పేర్కొంది.

ఈ కేసును విచారించిన న్యాయస్థానం ప్రాథమికంగా `జీ` వాదనతో ఏకీభవిస్తూ కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. జీ సంస్థకు చెందిన మ్యూజిక్ కంటెంట్‌ను ఇకపై వాడుకోకుండా చూడాలని.. ఈ నిబంధనలను 15 రోజుల్లోగా పాటించాలని జియో స్టార్‌ను న్యాయమూర్తి ఆదేశించారు. కేవలం రిలయన్స్ మాత్రమే కాకుండా.. ఇన్‌స్టా రీల్స్ లో తమ పాటలను క‌మ‌ర్షియ‌ల్ ప్రయోజనాల కోసం వాడుకున్నందుకు బ్యూటీ రిటైలర్ `నైకా`పై కూడా జీ ఇప్పటికే న్యాయపోరాటం చేస్తోంది. ఇది మేధో సంపత్తి హక్కుల విష‌యంలో జీ సంస్థ ఎంత పట్టుదలగా ఉందో తెలియజేస్తోంది.

అయితే జీ చేస్తున్న ఈ ఆరోపణలను.. నష్టపరిహార డిమాండ్‌ను జియో స్టార్ త‌న‌వంతు స‌మాధానం కూడా ఇచ్చింది. వివాదాస్పద కంటెంట్‌ను తొలగించడానికి తాము ఇప్పటికే చర్యలు తీసుకున్నామని.. అయితే ఆర్కైవ్స్‌లో ఉండే పాత డేటా కాపీరైట్ ఉల్లంఘన కిందకు రాదని జియో స్టార్ వాదిస్తోంది. ఈ సమస్యను సామరస్యపూర్వకంగా ఆమోదయోగ్యమైన రీతిలో పరిష్కరించుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని రిలయన్స్-డిస్నీ వర్గాలు వెల్లడించాయి. అయితే నష్టపరిహారం ఎట్టి ప‌రిస్థితుల్లో చెల్లించేది లేద‌ని ఖ‌రాకండిగా తేల్చి చెప్పాయి.

వాస్తవానికి ఈ రెండు సంస్థల మధ్య వైరం ఈనాటిది కాదు. గతంలో లండన్ ఆర్బిట్రేషన్‌లో ఒక క్రికెట్ లైసెన్సింగ్ డీల్‌కు సంబంధించి దాదాపు 9,485 కోట్ల (1 బిలియన్ డాలర్‌) డీల్ కి సంబంధించిన‌ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. 8.5 బిలియన్ డాలర్ల విలువ చేసే భారీ విలీనం తర్వాత ఏర్పడిన జియో స్టార్ వంటి దిగ్గజ సంస్థకు దేశంలోని అత్యంత పురాతన మీడియా సంస్థ అయిన జీకి మధ్య జరుగుతున్న ఈ పోరు భారతీయ మీడియా రంగంలో పెద్ద చ‌ర్చ‌కు దారి తీస్తోంది.